
TTD | 'బర్డ్ ఆస్పత్రి'కి పారిశ్రామికవేత్తల చేయూత
పేద వికలాంగులకు కృత్రిమ అవయవాల కోసం రూ. నాలుగు కోట్లు విరాళం.
శ్రీవారి దర్శనాలకు వచ్చే యాత్రికులు టీటీడీ నిర్వహించే ట్రస్టులకు కూడా ఊతం ఇస్తున్నారు. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిలో వికలాంగులకు కృత్రిమ అవయవాలు, శస్ర్తచికత్సల కోసం ఇద్దరు పారిశ్రామికవేత్తలు టీటీడీ బర్డ్ ( BIRRD ) ఆస్పత్రికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పేదల వైద్య సేవల విరాళం అందించారు. వారిద్దరు వేర్వేరుగా విరాళం చెక్కులు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరికి అందించారు.
ప్రధాన పథకాలు...
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల్లో నిత్యాన్నదానం, ప్రాణదానం, గోసంరక్షణ పథకాలతో పాటు ఆరోగ్య సేవలు కూడా ప్రధానమైనవి. అందులో బర్డ్ ఆస్పత్రి కీలకమైనది. శ్రీబాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ( Sri Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled BIRRD) ట్రస్ట్ అనేది పోలియో మెల్లిటస్, సెరిబ్రల్ పాల్సీ, పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలు, వెన్నెముక గాయాలు, వికలాంగులకు చికిత్స చేసే ఒక ప్రముఖ వైద్య సంస్థ. పుట్టుకతో కలిగిన అంగవైకల్యాన్ని నయం చేసి ఆత్మగౌరవంతో అందరిలా బతకాలనే లక్ష్యంతో మాజీ సీఎం ఎన్టీ. రామారావు బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించారు. 300 పడకల ఆస్పత్రి ద్వారా పోలియో, ఇతర వైకల్యం ఉన్న వారికి ఉచిత సేవలు అందుబాటులోకి తెచ్చారు.
భారీగా విరాళాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి టీటీడీ నిర్వహించే ఆ ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఆ నిధులు టీటీడీ అధికారులు జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ జమ చేయడం ద్వారా ఆ వడ్డీతో పథకాల నిర్వహిస్తున్నారు.
తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తరువాత హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ఆ సంస్థ యజమాని విరాళంగా అందించారు. అంగవైకల్యంతో బాధపడే పేద రోగులకు కృత్రిమ అవయాల అమరిక, సర్జీల కోసం ఈ నిధులు వెచ్చించాలని ఆర్ఎస్పీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కోరారు.
తిరుపతిలో టీటీడీ నిర్వహించే బర్డ్ ఆస్పత్రికి మరో పారిశ్రామికవేత్త కూడా 1.10 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. వీఐపీ విరామసమయంలో శ్రీవారిని దర్శించకున్న తరువాత ఆర్ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది. ఆ సంస్థల ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు విరాళం డీడీలను అందజేశారు.
తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ట్రస్టుకు నర్సారావుపేటకు చెందిన జె.రామాంజనేయులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Next Story