రాయలసీమలో యాత్రికులను వెంటాడిన ప్రమాదాలు..
x

రాయలసీమలో యాత్రికులను వెంటాడిన ప్రమాదాలు..

నలుగురు హైదరాబాద్ భక్తులు మృతి. 18 మందికి గాయాలు


దైవ దర్శనం ముగించుకొని ఇళ్లకు తిరుగు ముఖం పట్టిన యాత్రికులను ప్రమాదాలు వెంటాడాయి. రాయలసీమలోని జాతీయ రహదారులపై రెండు ప్రమాదాలు జరిగాయి. నంద్యాల వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలు శుక్రవారం వేకువజామున జరిగాయి. మృతులు, క్షతగాత్రులు హైదరాబాదుకు చెందిన వారిగా గుర్తించారు.


ఒకే కుటుంబంలోని నలుగురు మృతి

హైదరాబాద్ కు చెందిన ఆరుగురు క్వాలిస్ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమలలో దర్శనం అయిన తర్వాత వారంతా తిరిగి గురువారం రాత్రి హైదరాబాదుకు బయలుదేరారు. ఆ యాత్రికులు ఉన్న క్వాలిస్ వాహనం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో ప్రయాణిస్తోంది. డ్రైవర్ అలసిపోయాడో.. లేక, నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. అదుపుతప్పిన క్వాలిస్ డివైడర్ను ఢీకొట్టింది. ఆ వేగంలో దూసుకునిపోయి, ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

ఇద్దరి పరిస్థితి విషమం
ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలియడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రిక తరలించినట్లు సమాచారం అందింది. ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టిన ఆయన బాధితులను ఆసుపత్రికి తరలించడంలో కూడా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. క్వాలిస్ వాహనం నడుపుతున్న డ్రైవర్ అలసిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిన దానికి దారితీసింది అని తెలుస్తోంది. కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం అందింది.

అన్నమయ్య జిల్లాలో...

హైదరాబాదుకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలై దర్శనం చేసుకుని బస్సులో తిరుగు ప్రయాణం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనం కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం వద్ద ప్రయాణిస్తుండగా, అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సంఘటన సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది అయ్యప్ప స్వామి భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంలో పోలీసులు శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు మరో బాలుడికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story