ప్రశ్నించే ఈ స్వామి గొంతులో..  రాజకీయ వచనాలు? ఆక్రమణలా?
x

ప్రశ్నించే ఈ స్వామి గొంతులో.. రాజకీయ వచనాలు? ఆక్రమణలా?

హిందూ ధార్మిక సంస్థలపై దాడి జరిగితే సహించరు. ప్రశ్నించే స్వభావం ఎక్కువ. పీఠాధిపతులను నిగ్గదీస్తారు. టీటీడీ, శారదా పీఠాన్ని కూడా వదలనంటున్న ఆయన స్వామీజీ ఆశ్రమం వెనుక కథేమిటి?


సర్వసంగ పరిత్యాగం చేసే వ్యక్తులు సాధువు, సన్యాసులు అవుతారు. కాషాయ దుస్తులు ధరించే ఆ వ్యక్తులు ధార్మిక కలాపాలకు మాత్రమే పరిమితం కావడం చూశాం. సాధనతో మోక్షం సాధించాలనే దిశగా సాగే ఆశ్రమాలు, పీఠాధిపతులు ధార్మిక ప్రవచనలతో హిందూ ధర్మ పరిరక్షణలో ఉంటారు. కొందరు వ్యక్తులు వివాదాస్పద రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాల్లోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

తిరుమలలో విశాఖ శారదాపీఠంపై భవన నిర్మాణం ఆక్రమణల నేపథ్యంలో రాజకీయ నేతలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు కన్నెర్ర చేశారు. ఒకో ఎన్నికల్లో ఒకో పార్టీకి, తాజాగా బీజేపీకి ఓట్లు వేయమని పిలుపునిచ్చిన ఆ పరిషత్ అధ్యక్షుడు "ధర్మ పరిరక్షణ కోసమే తాము ఈ మార్గంలో కూడా ఉంటాం" అని సమర్థించుకున్నారు. వారిది.. "అసలు సాధు పరిషత్ కాదు. సాధువులు చేయాల్సిన పని ఇది కాదు" అని ఇంకో ఆశ్రమాధిపతి అంటున్నారు. తాను చేస్తే ఒప్పు. ఇంకొకరు చేస్తే మాత్రం తప్పు అన్నట్లు డిగ్రీ చదివిన ఆ స్వామీజీ తీరు కనిపిస్తోంది. ఆయన ఆశ్రమం వెనుక అసలు కథేమిటి? అసలు తిరుమలలో వారి గోల ఏమిటి?


ఒక వ్యక్తి సాధువుగా మారాలంటే అంత ఆషామాషీ కాదు. సాధువుగా మారేందుకు నియమనిష్టలు పాటించాలి. కఠోర సాధన ఉండాలి. మనసుపై, ఆలోచనలపై పట్టు సాధించాలి. శాస్త్రాలు వేదోపనిషత్తులు అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే తాను శిష్యరికం చేసిన గురువు నుంచి అనుమతి తీసుకుని కుంభమేళాలో స్నానం చేసిన తర్వాతే సాధువుగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ పరంపరలో పురుషులే కాదు మహిళలు కూడా సాధువులుగా మారెందుకు అవకాశం ఉంది. వీరిలో నాగ సాధువులుగా మారే వ్యక్తులు కఠినమైన కఠోరమైన నియమాలను పాటిస్తారు.
ఈ చర్చకు ఆస్కారం కల్పించిన ప్రధాన కారణం ఒకటే. సర్వసంగ పరిత్యాగం చేసి, సన్యాసం స్వీకరించిన తర్వాత ప్రబోధాలతో ఆత్మజ్ఞానాన్ని బోధించాల్సిన వ్యక్తులు రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివాదాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ నేతల గొడుగు నీడలో నడవడం అనేది రాజకీయ చర్చగా మారింది.
"సాధువు" బాట మారిందా?
ఆశ్రమాల్లో జ్నాన బోధ చేయాల్సిన సాధువులు ధర్నాలకు దిగడం, రాజకీయ నేతల తరహాలో వ్యవహరించారు. తిరుమలలో విశాఖ శారదాపీఠం వద్ద నిర్మాణాల వ్యవహారం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో తిరుపతి జనసేన నేతలు, విశ్వహిందూ పరిషత్ ద్వారా రంగప్రవేశం చేసిన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం గ్రామం వద్ద శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వాస్తవానికి తిరుమలలో గోవిందనామ స్మరణలు మినహా రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు, నిరసనలకు ఆస్కారం లేదు. నిబంధనలు కూడా అనుమతించవు.
ఏవరీ స్వామీజీ..
శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అసలు పేరు చింతా శ్రీనివాసరావు. ఆయనది గంగువారి శిగిడాం (జి. శిగిడాం) మండలం వాండ్రంగి గ్రామం. పదో తరగతి పాస్ అయ్యాక గ్రామం నుంచి వెళ్లిపోయిన ఆయన 15 ఏళ్ల తరువాత కాషాయాంబరదారిగా శ్రీనివాసానంద స్వామీజీగా శ్రీకాకుళంలో ప్రత్యక్షం కావడంతో అవాక్కయ్యారు. సొంత ఊరి వాళ్లు ఇక్కడ వద్దు నాయనా.. అని నెత్తినోరు బాదుకోవడంతో రామానంద ఆశ్రమంలో చేరాలని విఫలయత్నం చేశారు. చివరాఖరికి క‌ృష్ణాపురం వద్ద ప్రత్యక్ష్యం అయ్యారు.
ఊరి పొలిమేరలో చెరువు గట్టుపై పూరిపాక కట్టుకుని దేవుని పూజించుకుంటా అని నమ్మించాడు. ఆ తరువాత శ్రీనివాసానంద స్వామీ చివరన సరస్వతి అని ట్యాగ్ వేసుకున్నారు. కృష్ణాపురం సమీపంలో గుడిసెలో ఏర్పాటు చేసుకున్న ఆశ్రమం సమీపంలో ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ చేసిన జనం, చివరికి కనికరించి, ఆధ్యాత్మికత కోసం సానుకూంగా స్పందించిన అక్కడి వారు 1995లో సర్వే నంబర్ 67 /13 లోని 3.36 ఎకరాలు పట్టా భూములు విరాళంగా అందించారు. ఆ స్వామీజీ అంతటితో సంతృప్తి చెందలేదని చెబుతున్నారు.
చెరువు ఆక్రమణ
ఆశ్రమాన్ని విస్తరించాలనే కోరిక బలంగా ఉన్న ఆ స్వామి పొందూరు, చిలకపాలెం ప్రధాన రహదారికి పక్కన ఉన్న 200 నుంచి 300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే కృష్ణాపురం సమీపంలోని పదెకరాల్లో సగం వంతు చెరును ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్తులు ఇచ్చిన భూమితో సరిపుచ్చుకోని ఆయన సమీపంలోని చెరువును ఆక్రమించి, మట్టితో పూర్తిగా నింపేశాని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అడ్డు వచ్చిన వారిని శపిస్తా అని సెంటిమెంట్ తో అడ్డుకున్ననాడని చెబుతారు. ఈ విషయంలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెబుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారికి వంతపాడు ఆయన చెలరేగుతున్నారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
చెరువు ఆక్రమణను కృష్ణాపురం వీఆర్ఓ ప్రకాశరావు ధృవీకరించారు. "గత ప్రభుత్వంలో భూముల రీ సర్వే చేసినప్పడు చెరువు ఎక్కువ భాగం ఆక్రమణ జరిగిన విషయం బయట పడింది" అని స్పష్టం చేశారు. "అన్ని వివరాలు పొందూరు మండల సర్వేయర్ నరసింగరావు వద్ద ఉన్నాయి" అని చెప్పారు.
కృష్ణాపురం మాజీ సర్పంచ్ గార వెంకటరమణ కొన్ని విషయాలను ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు. "శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై గుడిసె వేసుకుంటానని విన్నవించడంతో అంగీకరించాం. ఆ తరువాత ఆక్రమణలకు పాల్పడ వద్దనే విధంగా తనతో పాటు ముగ్గురు రైతులం కలసి 3.36 ఎకరాల పట్టా భూమి విరాళంగా రిజిస్ట్రేషన్ చేయించాం" అని తెలిపారు. "స్వామీజీ మేనత్తను మా ఊరి వ్యక్తి, మాజీ సర్పంచ్ అంబళ్ల లక్ష్మీపతినాయుడుతో వివాహం చేశారు. స్వామీజీ చెల్లెలు రేవతికి ఇదే ఊరికి చెందిన జగన్నాథంతో వివాహం చేశారు" అని వివరించారు. తరచూ గ్రామంలో కూడా ఆయన రాజకీయాలు సాగిస్తున్నారు. అనేక ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు అంతేకాకుండా, ఊరి చెరువును ఆక్రమించిన విషయం వాస్తవేమే అన్నారు. స్వామీజీగా మారకముందు గరివిడికాడు ఎస్బీఎస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు" అని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆశ్రమంల చెల్లి రేవతి, బావ జగన్నాధం, మేనళ్లదే పెత్తనం సాగుతోంది అని తెలిసింది.
తిరుగుబాటులో..
కాషాయ దుస్తులు ధరించిన శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ బ్రహ్మచారి. మధ్య తరగతి కుటుంబమే. చిన్ననాటి నుంచి ఆయన ఆలోచనలు ప్రజల సమస్యలు వైపే భ్రమిస్తుంటాయి. అన్యాయం, అక్రమాలు జరిగిన ప్రదేశానికి తన సహచరులతో రంగం ప్రవేశం చేస్తారు. బాధితుల పక్షాన నిలుస్తారు. ఆయన మాటల్లో ప్రశ్నించే స్వభావం ఎక్కువగా వినిపిస్తుంది.
శ్రీకాకుళంలోని సీనియర్ జర్నలిస్ట్ కలియా ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ప్రజలకు సంబంధించి అన్యాయాన్ని సహించరు" అని తెలిపారు. ఆయన డిగ్రీ వరకు చదివారని కలియా చెప్పారు.
2012లో నాగార్జున అగ్రిసెమ్ శ్రీకాకుళం పరిశ్రమలో రియాక్టర్ పేలింది. వెంటనే రంగ ప్రవేశం చేసిన ఆ స్వామీజీ పోరాటంలోకి దిగారు. ఇది ప్రజలకు సబంధించిన తీవ్రమైన సమస్య కావడంతో స్ధానికంగా కూడా ఆయనకు మద్దతు లభించింది. ఆ తరువాత శ్రీకాకుళంలో రహదారి విస్తరణ వల్ల రామమందిరానికి ప్రమాదం ఏర్నడింది. తరువాత విజయనగరం వద్ద రామతీర్ధం వద్ద విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో ఆయన రంగ ప్రవేశం చేశారు. తాజాగా ఇటీవల విశాఖ శారదా పీఠానికి భూములు కేటాయించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్థానికులతో కలిసి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత తిరుమలలో సేమ్ సీన్ తెలిసిందే.
ఈ సంఘటనల వెనుక శ్రీఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వ్యవహార సరళి అర్థం అయ్యేది ఒక్కటే, హిందూత్వ సంస్థలపై దాడి జరిగితే తాను ముందువరుసలో ఉంటా అనే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం స్పష్టం అవుతుంది. తద్వారా ప్రజా మద్దతు కూడగట్టే విధంగా సాగుతున్నఆయన ఇటీవల ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడినప్పడు కూడా తిరుమలలో కొన్ని మఠాలు బాగున్నాయి. ఇంకొన్నింటిలో పూజ లేదు. యజ్ణం లేదు. యాగం లేదు. భజన లేదు. భజనలు లేవు. ధార్మిక కార్యక్రమాలు అసలు లేవు అని అన్నారు. వ్యాపారంగా మారాయి అన్నారు. తన ఆశ్రమంలో ఏమి చేస్తున్నారో మాత్రం చెప్పలేదు.


2024 ఎన్నికల్లో బీజేపీ ఓట్లు వేయమని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ఫెడరల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చిరునవ్వు మాత్రమే సమాధానం లభించింది. రాజకీయ ప్రేరేపిత నిరసనల్లో సాధువులు పాల్గొనడంపై అడిగిన ప్రశ్నకు "హిందూత్వానికి ప్రమాదం ఏర్పడితే తమ సాధు పరిషత్ రంగంలోకి దిగుతుంది. అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ప్రశ్నలు అడిగినా ఆయన స్పందించలేదు. కాగా, ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019లో వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారని కృష్ణాపురం గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలో ఆయన మేనత్త భర్త అంబళ్ల లక్ష్మీనాయుడు మాజీ సర్పంచ్ కూడా. అక్కడ కూడా స్వామీజీ రాజకీయాల్లో వేలు పెడుతుంటారని చెబుతున్నారు.
అది ఒరిజినల్ కాదు...
రాజకీయ నాయకుల తరహాలో సాగుతున్న "ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్" ఒరిజినల్ కాదు. అని విజయవాడ సమీపంలోని పెనమలూరు సమీపంలో ఉన్న పరమాత్మానంద ఆశ్రమ పీఠాధిపతి ప్రకాశనంద సరస్వతి ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. అఖిలభారత సాధు పరిషత్ మాత్రమే ఎంచుకున్న మార్గంలో సాగుతున్న అసలైనదని స్పష్టం చేశారు.
శాస్త్రం, ధర్మాన్ని ఆచరించే వారికి రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు సమంజసం కాదని ధర్మప్రచారం అజెండా వీడిన సాధు పరిషత్ వ్యవహార సరళిపై ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనేక అంశాలను పంచుకున్నారు. "నాకు ఆ సంస్థతో సంబంధం లేదు. సాధు పరిషత్ కేంద్రానికి విజయవాడలో చోటు కావాలని, తనను ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంటామని చెబితే సరే అన్నాను. అడ్రసు వేసుకోవడానికి అనుమతి ఇచ్చా" అని చెప్పారు. ఆ సంస్థ కార్యకలాపాలు చూసిన తరువాత నేను, ఆశ్రమాన్ని వారికి దూరంగా ఉంచామని ప్రకాశనంద సరస్వతి స్పష్టం చేశారు. తాను సన్యాసం స్వీకరించిన తీరును ప్రకాశనంద సరస్వతి ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు.
"మాది ఒడిశా రాష్ట్రంలోని బరంపుర. చిన్నతనంలోనే నేను సన్యాసం తీసుకునేందుకు రిషికేష్ వద్ద ఉన్న ఓ ఆశ్రమంలో గురువు వద్ద శిష్యరికం చేశాను. శాస్ర్తం, వేదాలు, ఉపనిషత్తులు నేర్చకున్నా. అని చెప్పారు. "కాకినాడ పరిపూర్ణానందస్వామి వారి శిష్యరికంలో ఉండగా, కరోనా సమయంలో విజయవాడలోని ఆశ్రమ పీఠాధిపతి ఆచార్య శంకరాచార్య శివైక్యం చెందారు. ఆయన స్థానంలో నన్ను నియమించారు" అని ప్రకాశనంద సరస్వతి వివరించారు. "సాధువులు, ఆశ్రమ పీఠాధిపతుల లక్ష్యం మోక్ష సాధన చేయాలి. సమాజంలో ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లడానికి జ్నాన బోధ మాత్రమే చేయాలి. రాజకీయ వ్యవహారాలు సాధువుల పనికాదు" అని కుండబద్దలు కొట్టారు. "కొందరు సాధువులు చేస్తున్న వ్యవహారాలు వైదిక ధర్మానికి విరుద్ధం" అని స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలోని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ గతంలో కూడా అనేకసార్లు టీటీడీతో పాటు, పీఠాధిపతులు, మఠాధిపతులపై విమర్శలు సంధించారు. ధార్మిక సంస్థల వ్యవహారలపై ఆయన టీవీల్లో కూడా చర్చలకు పిలవడం ద్వారా మరింత ప్రాచుర్యం కల్పించారు. ఎక్కడ వివాదాలు ఉన్నా రెక్కలు కుట్టుకుని వాలుతున్న ఆయన, తన ఆశ్రమంపై ఉన్న ఆరోపణలను తనదైన శైలిలో వ్యవహరించడం ద్వారా నెగ్గుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన వ్యవహారాలపై రాజకీయ నేతలకు ఆయన కూడా గొంతు కలుపుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఆయన మరింత దూకుడు పెంచడానికి కూడా ఆస్కారం లేకపోలేదు.
Read More
Next Story