పింఛన్ల పంపిణీలో..  చంద్రబాబువి మళ్లీ అవే అడుగులా..
x

పింఛన్ల పంపిణీలో.. చంద్రబాబువి మళ్లీ అవే అడుగులా..

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. వారి అనుభవ పాఠాలతో వలంటీర్లను పక్కన ఉంచారా? కొత్త ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలో అడుగులు వేస్తోందా?


రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద గ్రామ, డివిజన్ సచివాలయ సిబ్బంది ద్వారానే వృద్ధులకు సామాజిక పింఛన్ల పంపిణీకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో గ్రామ స్థాయి నాయకుడి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు విధిగా హాజరు కావాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులకు సందేశాలు అందాయి. సిబ్బంది వెంట వెళ్లి , పది కేంద్రాలకు తగ్గకుండా పరిశీలించి, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి సందేశాలు అందాయి. పింఛన్ల పెంచిన మొత్తంపై సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు లబ్ధదారులకు శనివారం బహిరంగ లేఖ కూడా రాశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ శ్రేణుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

పెంచిన పింఛన్ రూ. మూడు వేల నుంచి నాలుగు వేలతో పాటు మూడు నెలల బకాయిలు రూ. మూడు వేలతో కలిపి మొత్తం రూ. ఏడు వేలు నేడు (ఆదివారం )యధావిధిగానే ఇళ్ల వద్ద నగదు పంపిణీకి సీఎం. ఎన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఇకపై ప్రతినెలా రూ. 819 కోట్ల అదనపు భారం పడుతోందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.
ఆ మేరకు రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మందికి పింఛన్లు ఒకటో తేదీ మొదటిరోజే 90 శాతం పంపిణీ పూర్తి చేయాలని సీఎస్. నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.ఇదిలావుంటే, పింఛన్ల పంపిణీకి వలంటీర్ల సేవలు వినియోగించుకోకపోవడం వెనుక బలమైన కారణం ఉందనే విషయం స్పష్టం అవుతోంది.
2019 ఆగష్టులో అప్పటి సీఎం వైఎస్. జగన్ రాష్ర్టంలో గ్రామ, డివిజన్ వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఏర్పాటు చేసి, ఒకో కేంద్రంలో పది మంది వంతున సిబ్బందిని కూడా నియమించారు. ఇంటి వద్దకే సేవలు అందించడానికి వీలుగా 50 ఇళ్లకు ఒకరు వంతున 2,54,832 మంది వలంటీర్లను కూడా నియమించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడం, పింఛన్ల పంపిణీ, సర్వే వంటి కార్యక్రమాల్లో వలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. వారిపై అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ నేతల పెత్తనం కూడా ఎక్కువగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. వారంతా వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అంశంపై రాజకీయరగడ చెలరేగింది. ఈ పరిస్థితుల్లో..
2024 ఎన్నికల ప్రచార సమయంలో ..
గ్రామాల్లో వలంటీర్లు సేకరించే సమాచారం తెలుసుకున్న "సంఘ వ్యతిరేక శక్తుల వల్ల దాదాపు 30 వేల మంది మిస్ అయ్యారు. నేషనల్ క్రైం రిర్ట్ ఆధారంగా కేంద్ర నిఘా అధికారులు నాకు చెప్పారు. అని ఎన్నికల సమయంలో జనసేన్ చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వారిలో "14 వేల మంది తిరిగి వచ్చారు. మిగతా 18 వేల మంది ఏమయ్యారు. వీరిపై రివ్యూ ఎందుకు పెట్టలేదు" అని కూడా పవన్ కల్యాణ్ నిలదీయడం గమనార్హం.
ఆయన ఘాటు ఆరోపణలతో చిచ్చు మరింత రగిలింది. దీనికి తోడు టీడీపీ కూడా వలంటీర్లు అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ కనుసన్నల్లోనే ఉన్నారంటూ, ఆరోపణలు చేయడం, వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం, వంటి పరిణామాలతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్నికలకు ముందు 1,08,000 మంది రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం 1,26,659 మంది వలంటీర్లు ప్రస్తుతం పనిచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో..
సిబ్బంది ద్వారానే పంపిణీ
రాష్ర్టంలో కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీకి గ్రామ, డివిజన్ సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించుకుంటోంది. అధికారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల నేపథ్యంలో అందుబాటులోని వలంటీర్ల సేవలు టీడీపీ కూటమి ప్రభుత్వం వాడుకోవడానికి సుముఖంగా లేదనే విషయం స్పష్టం అవుతోంది. అందుకు కారణం ఆ నాటి నాయకుల అనుభవం ఎలా ఉందంటే..
గత ప్రభుత్వంలో వలంటీర్ల వల్ల వైఎస్ఆర్ సీపీ నేతలకు గుర్తింపు లేకుండా పోయింది. దీనిపై ఒక నాయకుడు ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, ఎన్నికల వేళ గడప గడపకూ వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించాం. ఆ సమయంలో "పధకాలు అందాయా? అంటే ఔనన్నారు. పించన్ ఎవరు ఇచ్చారు? అంటే మా వాలంటీర్" అనే సమాధానం వచ్చింది. ఇదే మాకు గుర్తింపు లేకుండా చేయడమే కాదు. దెబ్బతీసింది. అని వ్యాఖ్యనించారు.కాగా,
ఆ అనుభవాలతోనేనా...
గత ఐదేళ్ల కాలంలో అప్పటి వైఎస్ఆర్ సీపీ నేతలకు ఎదురైనా అనుభవనాలను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్టు భావిస్తున్నారు. అందువల్లే, వలంటీర్ల సేవలను పక్కన ఉంచారనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా, ఎన్నికల వేళ పింఛన్ల కోసం వృద్ధులను వైఎస్ఆర్ సీపీ నేతలు మంచాలపై కేంద్రాలకు తీసుకుని వెళ్లడం ద్వారా వలంటీర్లు లేని కొరత చూపించి, రాజకీయంగా లబ్ధిపొందాలని నానా యాతన పడిన వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. అయినా, ఎన్నికల కమిషన్ జోక్యంతో సచివాలయ సిబ్బంది సకాలంలో పింఛన్లు పంపిణీ చేయడం ద్వారా తమ కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వలంటీర్లను కూటమి ప్రభుత్వం దూరంగా ఉంచడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
మళ్లీ అవే అడుగులా..
టీడీపీతో పాటు జనసేన కూడా వలంటీర్ల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వారందరినీ దూరంగా ఉంచి, సిబ్బంది ద్వారా పంపిణీ చేయించడానికి తీసుకున్న చర్యల వెనుక ఇంకో కారణం కూడా ఉందంటున్నారు. వలంటీర్ల వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థకు మంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కావడం కూడా ప్రస్తావనార్హం. అయితే, ఎన్టీఆర్ భరోసా పధకం ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీకి టీడీపీ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉండాలని సీఎం ఎన్. చంద్రబాబు సూచనలు ఇవ్వడం ద్వారా కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారా? అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అధికారం ఇవ్వడం ద్వారా పుట్టి ముంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
దీనిపై వెటరన్ జర్నలిస్ట్ పీ.వి. రవికుమార్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ, "సచివాలయ సిబ్బంది వలంటీర్ల అవతారంలోకి వస్తారు. ఉద్యోగులు కాబట్టి, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారు. వారికి తప్పదు" అని అన్నారు. అన్ని కార్యక్రమాల్లో "టీడీపీ నేతలను మమేకం చేయడం అంటే, ఐదేళ్లకు ముందు ఇదే తరహాలో జన్మభూమి కమిటీల వల్ల జరిగిన నష్టాన్ని మరిస్తే మాత్రం తలపోటు తప్పదు" అని రవికుమార్ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story