ఆ ఆస్తుల మాదిరి...  వక్ఫ్పై పెత్తనం కుదరదు
x

ఆ ఆస్తుల మాదిరి... "వక్ఫ్"పై పెత్తనం కుదరదు

వక్ప్ చట్టానికి సవరణలు చేయాలనే బిల్లుపై రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వే, డిఫెన్స్ ఆస్తుల్లా చేస్తామంటే కుదరదు అని వ్యాఖ్యానించారు.


మత సంస్థలపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు జోక్యం సరికాదని రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ. ఫరూఖ్ స్ఫష్టం చేశారు. వక్ఫ్ చట్టానికి సవరణలపై ముస్లిం మతపెద్దలతో చర్చించకుండా, ఏకపక్షంగా సమీక్షిస్తాం అంటే కుదరదని ఆయన హెచ్చరించారు. కడప పర్యటనకు వచ్చిన రాష్ర్ట మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఫరూఖ్ గురువారం మీడియాతో మాట్లాడారు.

"నేను ఎక్కడికి వెళ్లినా వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై అడుగుతున్నారు. ముస్లింలు కూడా మెసేజ్ లతో పాటు ఫోన్లు చేస్తున్నారు" అని మంత్రి ఫరూఖ్ చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామ్యపక్షంగా ఉన్న టీడీపీ సీనియర్ మంత్రి ఫరూఖ్ వక్ఫ్ చట్టానికి సవరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ బిల్లు, జేపీసీపై గొంతు విప్పారు.
1995 వక్ఫ్ చట్టానికి 40 సవరణలు ప్రతిపాదిస్తూ, కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనికి యునిఫైడ్ వక్ఫ్ మేనేజిమెంట్, ఎంపర్మెంట్, ఎఫికసీ అండ్ డెవలప్మెంట్ యాక్టుగా మార్చడానికి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు చర్చకు తీసుకువచ్చారు. ఈ బిల్లును సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ (శరద్ పవార్) ఏఐఎంఐఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించాయి. దీంతో వక్ప్ చట్టానికి సవరణపై సమీక్షకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయడంతో పాటతు కమిటికి చైర్మన్ గా లోక్ సభ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జగదాంబికా పాల్ ను నియమించారు. ఆయన సారధ్యంలోని 21 మంది ఉభయ సభల నుంచి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సమీక్ష చేయనున్నది. ఇదిలావుండగా,
మంత్రి ఫరూఖ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ మంత్రి ఎన్ఎండీ. ఫరూఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు" అని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదని హితవు పలికారు. పరమత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహారించాల్సిన కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని మత సంస్థలపై రుద్దడం సరికాదని అభ్యంతరం తెలిపారు.

జగన్ మాదిరి వ్యవహరిస్తారా?
దేశంలో మైనారిటీ సంస్థ అయిన వక్ఫ్ బోర్డుకు విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటిపై ముస్లిం పెద్దలకు, సంస్థకు మాత్రమే అజమాయిషీ నిర్ణయాధికారం ఉండాలని రాష్ట్ర మంత్రి ఫరూఖ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్. జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకుని వచ్చి విలువైన భూములు కాజేయాలని చూశారని ఫరూఖ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి నిర్ణయంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం "ముస్లింల విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తుల్లా చేస్తామంటే కుదరదు" అని తేల్చిచెప్పారు.
చర్చించాల్సిందే...
వక్ఫ్ వ్యవహారాలపై కేంద్రం నిర్ణయాలు సరికాదు. ఏదైనా చేయాలని భావిస్తే ఖచ్చితంగా " మత పెద్దలతో చర్చికుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు" అని మంత్రి ఫరూఖ్ ప్రకటించారు. వక్ప్ చట్టానికి సవరణ చేయాలని అనే కేంద్రం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. ఈ విషయంలో ముందుగానే సీఎం చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతానికి చెందిన తమ పార్టీ నేతలతో కలసి వివరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనతో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎంఎల్సీ సీ. రామచంద్రయ్య, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులురెడ్డి, కడప జిల్లాకు చెందిన నాయకులు కూడా ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో దేశం మొత్తం మన వైపు చూస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించడం వల్ల ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి ఫరూఖ్ చెప్పారు. ఆ తరువాతే చట్ట సవరణ నిలుపుదల చేయించడానికి తమ పార్టీ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. త్వరలో జేపీసీ భేటీ అవుతుందని చెప్పిన ఆయన ముస్లిం పెద్దలతో చర్చించి తీరాలని స్పష్టం చేశారు.
Read More
Next Story