తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University SVU) తెలుగు విభాగం ప్రొఫెసర్ పేటశ్రీతో The federal Andhra Pradesh యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే విందాం..
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర చరిత్రను తమిళనాడు తెలుగు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశమైంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన పేటశ్రీ (పేట శ్రీనివాసులు రెడ్డి) 900 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంపై పరిశోధించి, ప్రచురించిన చరిత్రకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తిరుపతి గంగ జాతరను 2023 ఏప్రిల్ 13వ తేదీ రాష్ట్ర పండుగ మాత్రమే ప్రకటించింది. అంతకుముందే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జాతరను తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ గా పనిచేసిన పేట శ్రీనివాసులురెడ్డి “పేటశ్రీ" కలం పేరిట రచయిగా గుర్తింపు సాధించారు. తిరుపతి నివాసి. జానపద సాహిత్యంలో రచనలు చేశారు. ఆయన రాసిన "తిరుపతి గంగ జాతర” గ్రంథం "ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్" వారి “రామరాజు జానపద విజ్ఞాన అవార్డు" ను పొందింది. గ్రామదేవతలు, కొండ కథలు, తిరు వీధులు, తెలుగు ఐతిహ్యాలు, తిరుపతి కథలు, తిరుమల కథలు, జానపద శృంగార గేయాలు వంటి చాలా రచనలు చేశారు. ఆయనకు జానపద సాహితీరత్న, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించింది. ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖలో ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా, పీఠాధిపతిగా, పాఠ్య ప్రణాళికా అధ్యక్షులుగా పనిచేశారు. పలు పదవులు నిర్వహించారు. వీరు
తమిళనాడులో తెలుగు విద్య
తమిళనాడులో మైనారిటీ విద్యా సంస్థలు చాలా వరకు మూతపడ్డాయి. తొలినాళ్లలో 1,500 వరకు ఉన్న తెలుగు మాధ్యమ పాఠశాలలు వెయ్యి వరకు మూతపడ్డాయని తెలుస్తోంది. హోసూరు జిల్లా క్లస్టర్ లోనే 27 తెలుగు పాఠశాలలు ఉన్నాయి.
"తమిళనాడులో ప్రస్తుతం 900 వరకు తెలుగు పాఠశాలలు ఉన్నాయి" అని టీ.నగర్ ప్రాంతంలో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల కరస్పాండెంట్ నాగుల గోపాలయ్య చెప్పారు.
"తెలుగు పుస్తకంలో గంగజాతర పాఠం" గ్రామీణ చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గోపాలయ్య అన్నారు.
నేపథ్యం ఇదే..
తిరుపతి గంగజాతర పూర్వ చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే, తిరుపతి ప్రాంతం ఉత్తర ఆర్కాట్ జిల్లాలో ఉండేది. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి తెలుగు భాషా పండితుల నిర్ణయం మేరకు తిరుపతి జాతరను 2019 నుంచి పాఠ్యాంశంగా చేర్చింది. తద్వారా ఒకనాటి తమ తిరుపతి ప్రాంత చరిత్రను ఓన్ (own) చేసుకునే దిశగానే సానుకూలంగా స్పందించింది.
తిరుపతి గంగ జాతర నేపథ్యంపై పరిశోధన చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన ప్రొఫెసర్ ' పేటశ్రీ' (పేట శ్రీనివాసులు రెడ్డి) కథనం రాయడమే కాదు. ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఈయన కృషికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం గుర్తింపు ఇచ్చింది. ఆ విభాగం ప్రతినిధులు చొరవ తీసుకున్నారు. దీంతో,
2019 వ విద్యా సంవత్సరం నుంచి తమిళనాడులోని తెలుగు పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు 'తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర చరిత్రను పాఠ్యాంశంగా" చేర్చారు.
చరిత్ర పెద్దదే..
మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే కాదు. అంతకుముందు కూడా నార్త్ ఆర్కాట్ జిల్లాలో తిరుపతి అంతర్భాగంగా ఉండేది. ఆరు రోజుల్లో కూడా తిరుపతి గంగ జాతరను వైభవంగా నిర్వహించేవారు. అంతకుముందు బ్రిటీషర్ల కాలంలో కూడా అంటే 200 సంవత్సరాల కిందటే తిరుపతి గంగ జాతరకు తెల్ల దొరలు ప్రాధాన్యత ఇచ్చారు అనే చరిత్ర ఉంది.
తిరుపతి తొలినాళ్లలోనే తమిళనాట అంతర్భాగంగా ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అందువల్లే ఆ రాష్ట్రంలోని తెలుగు భాషా ప్రేమికులు, పరిశోధకులు ' పేటశ్రీ ' గంగమ్మ జాతర చరిత్రపై రాసిన పుస్తకాన్ని గుర్తించారు. దానిని పరిశీలించిన తర్వాత పదవ తరగతి విద్యార్థులకు గద్యభాగంగా తెలుగు వాచకం 3.2 పాఠ్యాంశంగా 43వ పేజీ నుంచి 48 పేజీల వరకు చరిత్రను పాఠ్యాంశంగా అందుబాటులోకి వచ్చారు.
చిత్తూరు లో జాతరలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగే జాతర్ల విశేషాలను పేటశ్రీ తన పరిశోథాత్మక రచనల్లో ప్రధానంగా ప్రస్తావించారు.
అందులో కుప్పం తాలూకా కెంచబలియ గ్రామంలో తిరుపతి గంగమ్మ, కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ, ఒంటిపల్లెలో రాళ్ల గంగమాంబ, కమతమూర్లో దండు గంగమ్మ, తిరుపతి సమీపంలోని అవిలాలలో ఉన్న అవిరాల గంగమ్మ, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ, తాళ్లపాక గంగమ్మ, శ్రీకాళహస్తిలోని ఏడుగురు గంగమ్మలు వంటి ఎన్నో పేర్లతో అమ్మవారు అందుకుంటున్న పూజల వివరాలను ఇందులో ప్రస్తావించారు.
తిరుపతి గంగమ్మ చారిత్రక విశేషాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ కు లభించిన ప్రాధాన్యత. ఈ జాతర నిర్వహించే తీరు, చాటింపు విధానం, వేషాలు, పురుషులు మహిళలు వేషాలు వేయడానికి ఉన్న చారిత్రిక నేపథ్యం, పూజా విధానం పై సమగ్రమైన కథనం రాశారు.
గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ చారిత్రిక నేపథ్యాన్ని భావితరాల ప్రతినిధులైన విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ చరిత్రను పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.
పరీక్షల్లో ప్రశ్నలు
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో పదో తరగతి తెలుగు విద్యార్థులకు కూడా తిరుపతి గంగ జాతరపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో తిరుపతి గంగజాతరపై తెలుగులో ఐదు మార్కుల ప్రశ్న ఉంది.
తిరుపతిలో వెలిసిన గ్రామ దేవత ఎవరు
తిరుపతి గంగమ్మ చారిత్రక విశేషాలు ఏమిటి
తాళ్లపాక చెరువు అనే పేరు రావడానికి కారణం ఏమిటి
తిరుపతి గంగ జాతరను వివరించండి
గంగ జాతరలో వేసేటువంటి వేషాలు ఏవి
తిరుపతి పరిసర ప్రాంతాల్లో జాతర ఏ విధంగా చేస్తారు
అనే ప్రశ్నలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మార్కుల ఆధారంగా పాస్ చేస్తుంది.