TTD | పరకామణి జోలికి వెళితే... చావు తప్పదా స్వామీ?
x

TTD | పరకామణి జోలికి వెళితే... చావు తప్పదా స్వామీ?

ఈ కేసులో సాక్షులకు భద్రత కల్పించాలంటున్న టీడీపీ కూటమి నేతలు


తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీపై ఫిర్యాదుగానే కాకుండా కీలక సాక్షిగా ఉన్న ఏవీఎస్ఓ (TTD Assistant Vigilance Security Officer AVSO) వై. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి పోలీసులకు సవాల్ గా నిలిచింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ అధికారులు, సిబ్బంది, ఇద్దరు సీఐలకు ప్రాణ సంకటంగా మారిన పరిస్థితి ఏర్పడింది. వారి భద్రతపై కూడా సందేహాలు తలెత్తాయి.

పరకామణి కేసులో నలుగురికి భద్రత కల్పించాల్సిన అవసరాన్ని టిడిపి కూటమి నేతలు ప్రభుత్వానికి సూచించారు. ఇందులో తిరుమల సిఐలు ఇద్దరు, అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడిన జీయంగారి మఠం మాజీ ఏకాంగి రవికుమార్, హైకోర్టులో కేసు దాఖలు చేసిన ఓ జర్నలిస్టుకు భద్రత కల్పించాలని మీడియా సమావేశంలో కోరారు.

"కేసుల్లో ఉన్న సాక్షులను అంతం చేయించడం అనేది వైసిపికి వెన్నతో పెట్టిన విద్య. మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది కూడా బాబాయ్ వైఎస్. వివేకానందరెడ్డి హత్య లాంటిదే. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి" అని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కోరారు. నిందితులను వదిలే సమస్య లేదని టిడిపి కూటమి నేతలు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ (టీడీపీ), హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ (జనసేన), శాప్ చైర్మన్ రవినాయుడు (టీడీపీ) వారు హెచ్చరించారు.
మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఎం నేత కందారపు మురళీ డిమాండ్ చేశారు.
"పెద్దల పాపాల ఆటలో పోలీస్ అధికారి సతీష్ కుమార్ మరణం ఓ ఘట్టం" అని మురళీ అభివర్ణించారు. పరకామణి చోరీ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము మొదటి నుంచి కోరుతున్నామని మురళీ గుర్తు చేశారు. పరవకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలు సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మురళీ డిమాండ్ చేశాు.
సతీష్ తిరుపతికి వస్తూ...
తిరుమల పరకామణి లో జరిగిన చోరీ ఘటనపై రాష్ట్ర హైకోర్టు మే ఆదేశాల మేరకు ఏపీ సిఐడి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విచారణ చేస్తోంది. ఈ కేసులో రెండో దఫా వాంగ్మూలం ఇవ్వడానికి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గుంతకల్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గురువారం రాత్రి బయలుదేరార. తలకు తీవ్ర రక్త గాయాలై ఆయన అనంతపురం జిల్లా కోమలి రైల్వే స్టేషన్ కు కాస్త దూరంలో రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించాడు. శుక్రవారం తెల్లవారిన తర్వాత రైల్వే కీ మాన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సతీష్ కుమార్ మరణించిన విషయం బయటపడింది. ఆయన వద్ద ఉన్న అనంతపురం జిల్లా ఎస్పీ జారీ చేసిన గుర్తింపు కార్డు ఆధారంగా చనిపోయింది రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ గా గుర్తించారు.
నువ్వంటే.. నువ్వు..
మాజీ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ మరణానికి నువ్వంటే నువ్వు అని కూటమి నాయకులు ఒకపక్క, వైసిపి మరోపక్క మాటల యుద్ధానికి దిగారు.
తిరుమల పరకామణి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కోమలి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన శవమై పడి ఉన్నాడు. ఆయన తల్లి, సోదరుడు, భార్య, పిల్లలు కన్నీరు మున్నీరు అవుతుంటే, తిరుపతిలో మరో రాజకీయం ప్రారంభమైంది. మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం వెనక కుట్ర ఉంది. దీనికి వైసిపి నాయకులదే బాధ్యత అని టిడిపి కూటమి నేతలు ఆరోపణలు సంధించారు.
ఈ ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
పరకామణి చోరీ కేసులో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రాణాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వహత్య అని టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.
"పరకామణి చోరీకి సంబంధించి కేసు నమోదైన తర్వాత నా పేరు చెప్పమని ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ను టీటీడీ లోని విజిలెన్స్ ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. బండ బూతులు తిట్టారు. తాజాగా జరుగుతున్న సిఐడి విచారణలో కూడా అధికారులు కర్ణాకర్ రెడ్డి పేరు చెప్పు అని బెదిరించారు" అని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
ఈనెల ఆరవ తేదీ తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా నిర్వహించిన సిఐడి విచారణకు సతీష్ కుమార్ హాజరైనప్పుడు కూడా నన్ను ఇరికించాలనే ప్రయత్నంలో పరుష పదజాలంతో సతీష్ కుమార్ ను దూషించి,. మానసిక ఒత్తిడికి గురి చేశారని కూడా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సిఐడి విచారణ జరుగుతుంటే ఈ దర్యాప్తు కమిటీకి, అసలు పోలీసు విభాగానికి ఏమాత్రం సంబంధంలేని లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నారని కూడా ఆయన నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి తిరుపతి జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ ఆక్షేపణ చెప్పారు.
"నిజంగా సతీష్ కుమార్ ను అధికారులు దూషించి, టీటీడీ మాజీ చైర్మన్ పేరు చెప్పమని ఒత్తిడి చేసినట్లు తెలిసి ఉంటే ఎన్నాళ్లు ఎందుకు గమ్మనే ఉన్నారు" అని నరసింహ యాదవ్ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా నిలదీశారు.
తిరుమల పరకామణి చోరీ కేసు ఇదీ..
తిరుమల శ్రీవారినీ దర్శించుకున్న తర్వాత యాత్రికులు అక్కడి హుండీలో కానుకలు, సమర్పిస్తారు. ఇది నిండిన తర్వాత పగడ్బందీగా సీల్ వేసి, టిటిడి ఉద్యోగులు, అధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఆలయం వెలుపల ఉన్న పరకామణికి (హుండీ కానుకలు లెక్కించే గది) కి తరలిస్తారు. ఈ హుండీలోని కరెన్సీ ని వేరు చేయడానికి శ్రీవారి సేవకులతో పాటు, బ్యాంకు సిబ్బంది పంచ, బనియన్ మాత్రమే ధరించి వెళ్లాలి. లోదుస్తులు ధరించడానికి కూడా అవకాశం ఇవ్వరు. వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరకామణిలోకి అనుమతిస్తారు. వీరితో పాటు పరకామణిలో ఆదాయం వివరాలు నమోదు చేయడానికి జీయంగార్ మఠం నుంచి ఏకాంగి (సూపరింటెండెంట్) పీవీ. రవికుమార్ 1985 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు.
2023 ఏప్రిల్ 29వ తేదీ పరకామణిలో కానుకలు లెక్కిస్తుండగా నగదు వివరాలు నమోదు చేస్తున్న జీయంగార్ మఠం ప్రతినిధి రవికుమార్ చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీనికోసం ఆయన తాను ధరించిన పంచలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరలో దాచుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రవికుమార్ కదలికలపై సందేహించిన టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పరకామణి ఏవీఎస్ఓ గా ఉన్న వై సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రవికుమార్ను ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి తనిఖీ చేస్తే 900 డాలర్లు ఆయన పంచలో దాచుకున్నట్లు బయటపడ్డాయి. దీనిపై ఆనాటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. సీఐ జగన్మోహన్ రెడ్డి ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పరకామణి చోరీకి సంబంధించి తేలికపాటి సెక్షన్లలో అంటే దొంగతనం కేసు నమోదు చేశారు.
2023 సెప్టెంబర్ 9న పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ తో మాజీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ తిరుపతి ఫస్ట్ క్లాస్ సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ రేట్ కోర్టులో రాజీ అయ్యారు. టీటీడీ అనేది ఒక సంస్థ. వ్యక్తులతో ముడిపడి ఉండదు. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యక్తులు ఎలా రాజీ చేసుకుంటారు. దీని వెనక రాజకీయంగా పాత్ర ఉందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
"ఈ కేసులో రాజీ చేసుకోవాలని ఒత్తిళ్లు వచ్చిన వ్యవహారాన్ని సతీష్ కుమార్ టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు ఇచ్చిన నివేదికలో ప్రస్తావించారు.. ఒక సివిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు" అని మాజీ ఏవీఎస్ సతీష్ కుమార్ తన నివేదికలో ప్రస్తావించిన అంశాల రికార్డులను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రస్తుత టిటిడి పాలక మండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి మీడియాకు ఆ పత్రాలు విడుదల చేయడమే కాకుండా రాష్ట్ర డిజిపి, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు.
2023 సెప్టెంబర్ 10వ తేదీ తిరుమల కేంద్రంగా ఓ పత్రిక నిర్వహించే జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు టీటీడీ ఈవో కు వినతి పత్రం ఇచ్చారు. స్పందన లేకపోవడం వల్ల ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"పరకామణి ఉద్యోగి సివి రవికుమార్ డాలర్ల రూపంలో భారీగా నగదు, బంగారు చోరీ చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు చర్చిట్ దాఖలు చేశారు ఆరోగ్యంగా మాజీ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ తో స్వచ్ఛందంగా లోక్ అదాలత్ లో రాజీ పడ్డారు" అని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ప్రస్తావించారు.
హైకోర్టు ఆగ్రహం...
ఒక సంస్థలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి వ్యక్తులు ఎలా రాజీ పడతారు? దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి రికార్డులు కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఏపీ సిఐడిని ఆదేశించింది. దీంతో ఏపీ సిఐడి డిఐజి రవిశంకర్ అయ్యన్నార్ ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ తిరుమలలో పరకామణిని పరిశీలించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పరకామణి రికార్డులు స్వాధీనం చేసుకొని సీల్ చేసిన కవర్లో హైకోర్టుకు సమర్పించారు.
దర్యాప్తు వేగవంతం కాగానే..
పరకామణి చోరీ కేసులో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సారధ్యంలోని బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలకమైన ఫిర్యాది, ఆనాటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను ఈనెల 6వ తేదీ విచారణ చేశారు. మళ్లీ 14వ తేదీ విచారణ ఉండడంతో గుంతకల్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన సతీష్ కుమార్ కోమలి రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కన అనుమానాస్థితిలో శవమై పడి ఉండడం కలకలం రేపింది. ఇది పోలీసులకు ఓ సవాల్ గా నిలిచింది. నిందితుల కోసం అనంతపురం జిల్లా పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు.
సాక్షులకు భద్రత అవసరం
పరకామణి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇది పథకం ప్రకారమే చేసిన హత్యగా టిడిపి కూటమి నేతలు అభివర్ణించారు. ఈ కేసులో నిందితులు, సాక్షులకు భద్రత కల్పించాలని టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ కోరారు.

హత్యా...? ఆత్మహత్యా..

తిరుమల పరకామణి మాజీ ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ అనంతపురం జిల్లా ఏఆర్ (Armed Reserve Police) విభాగంలో సీఐ. ప్రస్తుతం ఆయన గుంతకల్లు రైల్వే జీఆర్పీ విభాగంలో పనిచేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో విచారణ కోసం గురువారం రాత్రి గుంతకల్లు నుంచి రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి కోమలి రైల్వే స్టేషన్ దాటిన తరువాత ట్రాక్ పై శవమై తేలిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి శనివారం అనంతపురం జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తలకు బలమైన ఇనుప వస్తువుతో దాడి చేయడం వల్ల, పుర్రె ఎముకలు కూడా పగులినట్లు డాక్టర్లు నిర్ధారించారని సమాచారం. దీంతో మాజీ ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు అనంతపురం జిల్లా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.


Read More
Next Story