వారి చేతి స్పర్శ సోకితే శిలలకు ప్రాణం
x

వారి చేతి స్పర్శ సోకితే శిలలకు ప్రాణం

వారి చేయి తాకితే కృష్ణశిలకు జీవం వస్తుంది. శిలను దేవతామూర్తిని చేస్తారు. ఆలయ, శిల్పాల తయారీపై శిక్షణ ఇస్తున్న టీటీటీ ఉపాధి కూడా చూపుతోంది. అదేంటో చూద్దామా..


తిరుపతి నగరం అలిపిరికి సమీప ప్రాంతం అది. రోడ్డుపై వాహనాల రోద ఎక్కువగా ఉంది. రోడ్డు పక్కనే విశాలమైన ఆవరణలో ఉన్న విగ్రహాలతో నిండిన ప్రశాంత వాతావరణం స్వాగతిస్తోంది. ఆ లోపలికి అడుగుపెట్టగానే ఎటు చూసిన దేవతామూర్తుల విగ్రహాలే. వాటిల్లో ఉట్టిపడే జీవకళ ఆధ్యాత్మిక పాఠాలు బోధించేలా ఉన్నాయి. వృత్తాకారంలోని ఆ భవనంలోని గదుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గదిలోకి వెళితే.. మగ, ఆడ పిల్లు కనిపించారు. ఎవరు వచ్చారనేది కూడా గమనించే స్థితిలో వారు లేరు. శిక్షణలో భాగంగా సిమెంటు, పంచలోహాలు, కొయ్యపై విగ్రహాల తయారీలో కొందరు, కాన్వాస్ పై కళంకారీ బొమ్మలు వేయడంలో యువతులు నిమగ్నమై ఉన్నారు.

దేశంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురం తరువాత శిల్పకళలో తిరుపతి కేంద్రంగా మాత్రమే శిక్షణా సంస్థ ఉంది. టీటీడీ ఆధ్వర్యంలోని "శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ, శిల్ప శిక్షణ సంస్థ" రెండవది. ఈ ఆవరణలో కనిపించిన దృశ్యాల్లో విగ్రహాలు, ఔత్సాహిక శిల్పులు, శిక్షణ ఇస్తున్న వారి సృజనాత్మకత మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఈ సంస్థలో ఆరు రకాల శిక్షణతో పాటు శిల్పులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. అందులో ప్రధానంగా ఆలయ నిర్మాణం, శిలా- శిల్పం, దారుశిల్పం, లోహ శిల్పం తోపాటు కలంకారీ, చిత్రలేఖన విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కాలేజీలో డిప్లమో కోర్సుకు రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్య, శిక్షణ (ఎస్ బీటీఈటీ)తో పాటు న్యూఢిల్లీ ఏఐసీటీఈ అనుమతి కూడా ఉంది.

శిలలకు ప్రాణం
శిల్పకళకు జక్కనాచార్యుడు, ఢక్కనాచార్యుడు ఆద్యులుగా కర్ణాటక ప్రభుత్వం ఏటా అవార్డులు కూడా ఇస్తోంది. ఇక్కడ టీటీడీ జీవం పోస్తోంది. ఔత్సాహిక శిల్పుల నైపుణ్యానికి పదును పెడుతోంది. ఉపాధి మార్గం కూడా చూపుతోంది. అందులో భాగంగా..
టీటీడీ 1960లో సర్టిఫికెట్ కోర్సుతో అలిపిరి వద్ద సంస్థను ప్రారంభించింది. 2010 నుంచి నాలుగేళ్ల డిప్లమో కోర్సులు బోధించే స్థాయికి పెంచింది. 2014 నుంచి ఇక్కడ శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంచారు. శిల్పశాస్త్రం చదువు పూర్తయ్యాక దేవాదాయ శాఖలో స్థపతి ఉద్యోగావకాశాలతో పాటు టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో కూడా ఉద్యోగాలకు అవకాశం ఉంది.
దీనిపై శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ, శిల్పశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి ఏమంటున్నారంటే..
"పదో తరగతి పాసైన విద్యార్థులు కోర్సులో చేరడానికి అర్హులు. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్, సుధా, మెటల్, స్టోన్, ఉడ్, స్క్లప్చర్ తో పాటు సంప్రదాయ కళంకారీ విద్యలో కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం" అని తెలిపారు. ఈ ఆరు కోర్సుల్లో ఒక్కో విభాగంలో పది మందికి మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి.
రూ. లక్ష డిపాజిట్ :ఈ కోర్సుల్లో చేరే వారి విద్యార్థి పేరిట టీటీడీ రూ. లక్ష డిపాజిట్ చేస్తుంది. నాలుగేళ్ల కోర్సు పాసైన విద్యార్థికి ఈ కళలో స్థిరపడడానికి వీలుగా రూ. లక్షకు వచ్చిన వడ్డీతో కలిపి మొత్తం అందిస్తుంది. అని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు.
బోధనాంశాలు : రూపధ్యానం, సంస్కృతం, ఇంగ్లీషు, ఆగమాలు, ప్రతిమా లక్షణం,ప్రతిమాచిత్రం, ప్రసాద లక్షణం, ప్రసాదచిత్రం, భారతీయ కళల చరిత్ర, నిర్మాణ వస్తువులు, సివిల్ డ్రాయింగ్, ప్రాక్టికల్స్ ఉంటాయి.
వసతి: స్థానిక, స్థానికేతర విద్యార్థులకు టీటీడీ ద్వారానే ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంది. ఉచితంగా మూడు శిల్పశాస్త్ర గ్రంధాలు ఇస్తారు. డిప్లమో కోర్సులో నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు ఆలయ నిర్మాణ శిల్పకళా విజ్నానానికి దక్షిణభారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనకు ఉచితంగా తీసుకుని వెళతారు.
కోర్సు పూర్తయ్యాక : కోర్సు పూర్తి చేసిన తరువాత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ, పురావస్తు శాఖలో, టీటీడీ ఇంజినీరింగ్ విభాగం, శ్రీవేంకటేశ్వర శిల్ప కళాశాలలో స్థపతులు, డ్రాయింగ్ మాస్టర్స్ ఉద్యోగాలకు అవకాశం ఉంది.
ఉపాధి: శిలా- శిల్పం డిప్లమో కోర్సులు పూర్త చేసిన తరువాత ఉపాధికి అవకాశం ఉంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రొడక్షన్ సెంటర్,లో కాంట్రాక్టు శిల్పుులుగా నియమించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణాలు, జీర్ణోద్ధరణ, పనులు, దేవతా శిల్పాలు తయారు చేయడానికి స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడే చదవి..:
శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థలో చదువుకున్న విద్యార్థులే ప్రస్తుతం ఇక్కడ అధ్యాపకులుగా ఉన్నారు. అంతేకాకుండా, దేవాదాలయ, పురావస్తు శాఖలో కూడా ఉద్యోగులుగా ఉన్నారు. ఆ కోవలోని వారు ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, స్టోన్ డిపార్టుమెంట్ పర్యవేక్షుడు ఉదయచంద్ర ప్రసాద్ తోపాటు ఇంకొందరు ఉన్నారు.
ఉన్నత విద్య :డిప్లమో పూర్తి చేశాక బీఎఫ్ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఎంఎఫ్ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) కోర్సులు చేయడానికి అర్హత ఉంటుంది.
తమ సంస్థ నుంచి శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు " చిత్రరంగంలో ఆర్ట్ డైరెక్టర్లుగా కూడా మా సంస్థ నుంచి వెళ్లిన వారు ఉన్నారు" అని ప్రిన్సిపల్ వెంకటరెడ్డి వివరించారు. శిల్ప కళలో విగ్రహాల తయారీకి సంబంధించి, వర్క్ షాపులతో స్వయం ఉపాధి పొందుతున్నట్లు ఆయన చెప్పారు.
సంప్రదాయ కళలు : రెండేళ్ల సంప్రదాయ కలంకారీ కోర్సు, నాలుగేళ్ల చిత్రలేఖనం డిప్లమో కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. ఇందులో కలంకారీ థియరీ, లైన్ డ్రాయింగ్, ప్రాక్టికల్స్, మార్కెటింగ్ థియరీ ఉంటుంది.
డ్రాయింగ్ టీచర్ కావచ్చు..
చిన్ననాటి నుంచి నాకు బొమ్మలు వేయడం ఇష్టం. మాకు తెలిసిన వారి ద్వారా ఇక్కడ కోర్సులో చేరాను. అని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంటున్న అన్నవరం ప్రాంతానికి చెందిన శ్రీజ తెలిపారు. డ్రాయింగ్ అంటే బొమ్మలే కదా అని అనుకున్నా. ఇక్కడికి వచ్చాక తెలిసింది . మంచికళ ఇది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కోర్సు పూర్తయ్యాక లోయర్, హయ్యర్ టీటీసీ చేయవచ్చు. టీచర్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. స్వశక్తితో జీవించే ధైర్యం దొరుకుతుంది అని శ్రీజ ధీమాగా చెప్పారు.
కృష్ణశిలకు ప్రాధాన్యం
శిల్పాల తయారీపై శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థలో ఔత్సాహిక శిల్పులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం శిలలు (రాళ్లు) ఎలా? ఎక్కడి నుంచి సేకరిస్తారు? అనే అంశాన్ని ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి స్టోన్ డిపార్టుమెంట్ ఇన్చార్జి ఉదయచంద్రకుమార్ తో కలిసి ఫెడరల్ ప్రతినిధులకు వివరించారు.
శిలాశాస్త్రం ప్రకారం..
"శిల్పం తయారీకి కృష్ణశిల ప్రధానమైంది. వాటిని తమిళనాడులోని కాంచీపురం, తిరుచ్చి నుంచి తెప్పిస్తున్నాం" అని తెలిపారు. రాష్ట్రంలోని కోటప్పకొండ వద్ద ఉన్న బురిజేపల్లి వద్ద కూడా రాళ్లు ఉన్నాయి. ఇవి విగ్రహం తయారీకి అనువుగా లేవు" అని చెప్పారు. "నల్లటి శిలపై ఎలాంటి మచ్చలు ఉంటే విగ్రహాల తయారీకి ఉపయోగపడవు" అని తెలిపారు. ఇవి "గర్భాలయంలో ప్రతిష్టంచేందుకు ఉపయోగపడవు" అని స్పష్టం చేశారు. ఆ రాళ్లలో కూడా పురుష, స్త్రీ, నపుంస శిలలు అని మూడు విభాగాలుగా ఉంటాయి.
"నల్లటి శిలపై వేలి గోరు తగిలేలా చిటికె వేస్తే, గంటానాదం వినిపించాలి" అది మాత్రమే విగ్రహం తయారీకి ఉపయోగం అని వెంకటరెడ్డి వివరించారు.
శిక్షణ ఎలాగంటే...
శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థలో డిప్లమో కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అంశాలను స్టోన్ డిపార్టుమెంట్ ఇన్చార్జి ఉదయచంద్ర కుమార్ వివరించారు.
"మొదటి సంవత్సరం విద్యార్థులకు బలపం రాయిపై శిక్షణ ఉంటుంది. ఆ తరువాత చిన్నపాటి విగ్రహాల తయారీపై మెళకువలు నేర్పిస్తాం" అని తెలిపారు. మూడో ఏడాది ఫైనల్ విద్యార్థులకు గ్రానైట్ రాయిపై ఆర్ట్ వేయి, ఆ మేరకు చాతుర్యంగా శిల్పం చెక్కడం నేర్పిస్తాం" అని వివరించారు. ఈ ప్రక్రియకు సాధారణంగా దుస్తులు కుట్టడానికి ఎలాంటి కొలతలు తీసుకుంటారో పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం డ్రాయింగ్ వేయడం ద్వారా చిత్రాన్ని తయారు చేయడంతో పాటు శిలపై కూడా మార్కింగ్ చేసి, విగ్రహానికి తుదిరూపు, జీవకళ తీసుకుని వస్తాం" అని స్పష్టం చేశారు.
"ఈ విగ్రహాలన్నీ సంస్థ ఆవరణలో మాత్రమే ఉంచుతాం. విక్రయాలు ఉండవు" అని చెప్పారు.విద్యార్థులకు శిక్షణానంతరం ఉపాధి కల్పించేందుకు వసతి ఉంది. అని చెప్పారు. ఆలయాల నిర్మాణానికి విగ్రహాలు అవసరమైన వారు ఆర్డర్ ఇస్తే తయారు చేస్తారు. ఆ సొమ్ము టీటీడీ ద్వారానే శిల్పాలు తయారు చేసిన వారికి అందిస్తారు" అని ఉదయచంద్ర కుమార్ వివరించారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఆలయ నిర్మాణరంగంలోనే కాకుండా, విగ్రహాల తయారీలో కూడా సుక్షితులు అవుతున్నారు. "కళలపై ఉన్న ఇష్టంతో ఈ కోర్సుల్లో చేరాం" అని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణరంగంలో మాకు ప్రాధాన్యత ఉంది. అని నిరూపించుకోవడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నామని కొందరు విద్యార్థినులు అంటున్నారు.
గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన అన్నా, చెల్లెలు ఏ గణేశ్ కుమార్, హిమబిందు ఏమంటున్నారంటే... "మా తండ్రికి ఆలయ నిర్మాణ రంగంపై పట్టు ఉంది. ఆయన ప్రేరణతోనే టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాం" అని ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
"ఈ రంగంలో యువతులు కూడా ప్రవేశించవచ్చు. ప్రతిభ చాటడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా" అని హిమబిందు ధీమాగా చెప్పారు. " నా వల్ల ఇంకొందరు యువతులు ప్రేరణగా భావించాలి. ఇందులో శిక్షణ తరువాత దేవాదాయ శాఖలోనే కాదు. టీటీడీలో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. లేదంటే స్వతంత్రంగా జీవించే ధైర్యం వస్తుంది" అని హిమబిందు వ్యాఖ్యానించారు.
"ఆలయ నిర్మాణ శాస్త్రం చదివే భాగ్యం నాకు దొరికింది. ఈ రంగంలో యువతులు ఎందుకు రాణించలేరు?" అని ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈపురుపాళెంకు చెందిన డీ. తనూజ ప్రశ్నించారు. "ఇది ఓ వరం. ఆధ్యాత్మికత మరింత పెంచానికి అవసరమైన ఆలయ నిర్మాణ రంగంలో నాకంటూ ప్రత్యేకత సాధిస్తా" అంటున్నారు. అందుకు తగిన శిక్షణ ఈ సంస్థలో ఉంది. ఇక్కడ నేర్చుకున్న అంశాలతో నాకు నేను స్వయంగా జీవించే ధైర్యం వస్తుంది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎదగగలరు అని నిరూపిస్తా తనూజ అన్నారు.
లోహానికి ప్రాణం..
ఈ సంస్థలో లోహంతో కూడా విగ్రహాల శిక్షణ ఇస్తున్నారు. పంచలోహాలను కరిగించడం ద్వారా విగ్రహాలకు జీవం పోస్తున్నారు. ఈ విధానాన్ని లోహశిల్ప విభాగం అధిపతి ఎం . ప్రసాద్ కుమార్ వివరించారు.
"మొదట మైనంతో తయారు చేసి, మూసకడతారు. ఆ తరువాత ఆరబెట్టి మంటల్లో వేడి చేస్తారు. దీనివల్ల మైనం కరిగిపోతుంది. డై అలాగే ఉంటుంది. పంచలోహాలు కరగబెట్టి అందులో పోయడం ద్వారా చిన్న,పెద్ద విగ్రహాల తయారు చేస్తున్నట్లు" ఆయన వివరించారు.
" మా నాన్న స్ఫూర్తితో ఈ కోర్సులో చేరాను. అని విశాఖకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎం. భార్గవ్ చెబుతున్నారు. విగ్రహాల తయారీ అనేది ఆధ్యాత్మిక ఆనందం ఇస్తుంది. స్వయంగా జీవించే ధైర్యం కూడా ఇస్తుంది" అని భార్గవ్ అంటున్నారు. ఈ కళతో ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించే భాగ్యం కలుగుతుంది. ఆలయాల నిర్మాణాలకు దేవతామూర్తులను అందించడం ద్వారా ప్రజల్లో మానసిక శాంతిని కలిగించే భాగ్యం దక్కింది.
ఉన్నత విద్య చదవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రుల తీరు కూడా అలాగే ఉంది. సంప్రదాయ కళలను విస్మరిస్తున్నారు. ఇది సరైంది కాదు అని బెంగళూరుకు చెందిన వి. అశ్విన్ అంటున్నారు. అందరూ ఓకే మూసలో వెళితే ఎలా? మా తల్లదండ్రుల సహకారంతో " నేను పంచలోహ విగ్రహాల తయారీలో నేర్పరితనం పెంచుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నా" అని భార్గవ్ వ్యాఖ్యానించారు.
మా నాన్నే నాకు స్ఫూర్తి అని రాజమండ్రి సమీపంలోని నిడదవోలుకు చెందిన కృష్ణప్రసాద్ చెబుతున్నారు. సంప్రదాయ కళలకు జీవం పోయడం భాగ్యంగా భావించాలి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అందులోనే ఉపాధి కూడా వెదుక్కుంటాం అని కృష్ణప్రసాద్ అంటున్నారు.
Read More
Next Story