వీరంతా గెలిస్తే రికార్డే
అనంతపురం జిల్లాలో టిడిపి నుంచి నలుగురు మహిళలు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఎంతమంది అసెంబ్లీకి వెళ్ళనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
అనంతపురం జిల్లా రాజకీయాలు అంత ఆషామాషీ కాదు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి టిడిపి అభ్యర్థులుగా మహిళలే పోటీ చేశారు. ఈ నలుగురు గెలిస్తే రాయలసీమలో కొత్త రికార్డు నమోదవుతుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోటీ పోరాహోరీగానే జరిగింది. టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఒకరు మాజీ మంత్రి. మరొకరు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇంకో ఇద్దరు కొత్తవారు.
పట్టు కోసం పరిటాల పోరాటం
జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ పోటీ చేశారు. ఈమె అంతకుముందు పెనుగొండ, తర్వాత రాప్తాడు నుంచి కూడా గెలుపొందారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో ఆమె మళ్ళీ పోటీ చేశారు. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ హోరాహోరీగా శ్రమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చేయి సాధించాననే ఆమె విశ్వాసంతో ఉన్నారు. కొందరు కీలక నాయకులు ప్రచార ఘట్టం ప్రారంభ దిశలోనే టిడిపిలో చేరడం, మహిళల అండ ఎక్కువగా ఉందని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
పట్టుబట్టి టికెట్ సాధించి..
సింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బండారు శ్రావణిశ్రీ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె ఈసారి అన్ని అవరోధాలు అధిగమించి, టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు వద్ద పట్టుబట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు టికెట్ సాధించారు. ఈసారి ఎలాగైనా గెలవాలని హోరాహోరీగా శ్రమించిన ఆమె విజయం ధీమాతో ఉన్నారు. టిప్పర్ డ్రైవర్‌గా గుర్తింపు సాధించుకున్న విద్యావంతుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థి వీరాంజనేయులు ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన రాజకీయాలకు కూడా కొత్త కావడం వల్ల పార్టీ నేతలే ఆయనకు పెద్దదిక్కుగా మారారు. టిడిపి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, వైఎస్ఆర్సిపి అభ్యర్థి వీరాంజనేయులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారే.
సామాజిక సేవలే రక్ష
ఫ్యాక్షన్ ప్రాంతమైన పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కురుబ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఇక్కడి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్. రామచంద్రారెడ్డి కుమార్తె టిడిపి అభ్యర్థిగా ఎస్. సవితమ్మ పోటీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ఎస్. సవితమ్మ విజయం వరిస్తుందనే ధీమాతో ఉన్నారు.
వైయస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీలో ఉన్నారు. ఈమెపై స్థానికేతరురాలు అనే ముద్ర వేశారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమెపై అవినీతి ఆరోపణలు ఉండడంతో రాజకీయ బదిలీ చేసి, పెనుగొండ నుంచి పోటీ చేయించారు. ఈ అంశాలు తమకు అనుకూలం కాగలవని టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
మామ సేవలపై ఆధారం
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాకుండా, ఆయన కోడలు పల్లె సింధూరరెడ్డికి టిడిపి అవకాశం కల్పించింది. ఈమె రాజకీయాలకు కొత్త అయినప్పటికీ, విద్యారంగంలో అందిస్తున్న సేవలు, గతంలో పల్లె రఘునాథరెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ శ్రేణులు ఆదుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు.
ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధరరెడ్డి తీవ్రంగా శ్రమించారు. ప్రజల్లో ఆయనకు మంచి అనుకూలత ఉండడం మెరిట్ గా భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఉన్న వ్యతిరేకత తమకు లభిస్తుందని టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
మొత్తం మీద రాయలసీమలోని మిగతా మూడు జిల్లాలతో పోలిస్తే, అనంతపురం జిల్లాలో టిడిపి నలుగురు మహిళలకు అవకాశం కల్పించింది. ఓట్ల లెక్కింపు తర్వాత వీరి రాజకీయ భవిష్యత్తు తీరనుంది. టిడిపి నుంచి జిల్లాలో పోటీ చేస్తున్న నలుగురు మహిళల్లో ఓటర్లు శాసనసభకు ఎంతమందిని పంపించనున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లో తేలుతుంది.