శ్రీనివాసా.. మీడియాపై ఆంక్షలెందుకు స్వామీ?
x

శ్రీనివాసా.. మీడియాపై ఆంక్షలెందుకు స్వామీ?

టీటీడీ అప్రకటిత ఆంక్షలు విధించింది. జాతీయ మీడియాను కట్టడి చేసింది. వారిని అలిపిరి వద్ద ఆపివేశారు. పెద్దలకు ఓ నీతి, సామాన్యుల పరిస్థితి మరోలా ఉంది.


మీడియాపై టీటీడీ అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియాకు అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతోంది. హిందూ ధార్మిక సంస్థపై రాజకీయ నేతలు సాగిస్తున్న వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ అంశాలపై తమ వృత్తిలో భాగంగా రిపోర్టింగ్ చేయాలనుకునే వారికి అడుగడుగునా ప్రతిబంధకాలు తప్పడం లేదు.

"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో గొడ్డు కొవ్వు, చేపనూనెలు తో కూడిన నెయ్యి వాడారు" అని

సీఎం ఎన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మరో అడుగు ముందుకు వేసిన ఆయన కొడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తిరుపతిలో గురువారం రాత్రి మరో వ్యాఖ్య చేశారు.
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో పందికొవ్వుతో కూడిన పదార్థం కూడా వినియోగించారు" అని చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి మరింత ఆజ్యం పోశాయి.
ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమర్థించే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్, సీపీఎం నేతలు మాత్రం అభ్యంతరం చెప్పారు.
" మీరు (సీఎం చంద్రబాబు) చేసిన ఆరోపణలు వాస్తవమైతే, ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించండి" అని పీసీస చీఫ్ వైఎస్. షర్మిళారెడ్డి డిమాండ్ చేశారు.
"సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు టీటీడీ ఉద్యోగులు అధికారులను అవమానించడమే" అని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు, సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి అభ్యంతరం చెప్పారు. ఈ పరిస్థితులు కాస్తా...

తిరుపతిపై జాతీయ మీడియా దృష్టి

తిరుమల శ్రీవారి దర్శనానికి దేశంలోనీ వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. "లడ్డు ప్రసాదంలో గొడ్డు కొవ్వు వాడారు" అని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను కలవడానికి గురిచేసాయి. వారి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అన్ని వర్గాలు ప్రీతి పత్రంగా భావిస్తాయి. ఈ ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిపారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తిరుపతి, తిరుమల మీడియాతో పాటు జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, వార్తా కథనాలు ప్రసారం చేసింది. వెంటనే టీటీడీ అప్రమత్తమైంది. సాధ్యమైనంత వరకు స్థానిక మీడియా ప్రతినిధులను బుజ్జగించే ప్రయత్నానికి తెర తీశారు. అప్పటికే జాతీయ మీడియాలో లడ్డూ ప్రసాదం వ్యవహారంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.
తిరుపతి ప్రధానంగా తిరుమలలో ఏం జరుగుతోంది. లడ్డు ప్రసాదం, సామాన్య యాత్రికులు ప్రీతిపాత్రంగా భావించే అన్న దానం వంటి కార్యక్రమాలలో వార్తలు కవర్ చేయడానికి స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఆసక్తి చూపించారు.
తిరుమలలో రిపోర్ట్ చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని జాతీయ మీడియా ప్రతినిధులు తిరుపతికి వచ్చారు. వారిలో ముందుగానే తిరుమల కొండకు చేరుకున్న మీడియా ప్రతినిధులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. తిరుమలకు వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి చెక్ పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం లైవ్ కిట్లు, కెమెరాలు ఉన్న ప్రతినిధులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆపేశారు. బస్సులో వెళుతున్న వారి వద్ద ఉన్న కెమెరాలు, లోగోలు, గేట్ బ్యాగులు చూసి కిందికి దించేశారు.
నిరీక్షణ

హైదరాబాద్ నుంచి వచ్చిన సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ మహిళ జర్నలిస్ట్ స్వస్తిక, వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ అలిపిరి ఏవీఎస్ ఓ కార్యాలయం వద్ద నిరీక్షిస్తూ కనిపించారు.
"మా ఎడిటర్ ఆదేశాల మేరకు రిపోర్గింగ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాం. ముందుగానే సమాచారం కూడా ఇచ్చాం. ఇక్కడ ఎందుకు నిలిపివేశారనేది అర్థం కావడం లేదు" అని మహిళా జర్నలిస్టు స్వస్తిక ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఈఓ, అధికారులతో మాట్లాడేందుకు మా ఛానల్ ప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నా సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందారు.
వీరితోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన మరో నేషనల్ మీడియా ప్రతినిధులను కూడా అలిపిరి దాటనివ్వకుండా అడ్డుకున్నారు. యాత్రికులతో మాట్లాడేందుకు కూడా వారిని అనుమతించలేదు. దీనిపై
అలిపిరి ఏవీఎస్ఓ రామకృష్ణ ( అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడారు. మాకు ఉన్న మౌఖిక ఆదేశాలను అమలు చేస్తున్నాం. "వారి విధులకు ఆటంకం కలిగించలేదు. వారు తిరుమలకు వెళ్లడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నాం" అని వ్యాఖ్యానించారు.
శ్రీవారంటే వారందరికీ భక్తి

తిరుమల శ్రీవారి దర్శనానీకి హిందువులే కాదు. ఆ సంప్రదాయాల పట్ల గౌరవం ప్రేమ ఉన్నవారు ఎవరైనా వెళ్లడానికి అభ్యంతరం లేదు. ఇతర మతస్తులు దర్శనానికి వెళ్లే సమయంలో మాత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద డిక్లరేషన్ తీసుకుని పద్ధతి అమల్లో ఉంది. ఇది ఎంతమంది పాటిస్తున్నారని విషయం ఆ ప్రస్తుతం. అందుకు ప్రధాన కారణం..
రాయలసీమలోనే కాదు. కోస్తాంధ్ర ప్రాంతం, తెలంగాణ తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ముస్లిం భక్తులు శ్రీవారిపై అచంచల భక్తిభావంతో దర్శనానికి వస్తుంటారు. వారిలో చాలామంది బురఖాలు ధరించి కూడా కనిపిస్తారు. "వారిని దర్శనానికి అనుమతించం" అని చెప్పడంధర్మం కాదు కదా! టీటీడీ కూడా అలా ఎవరిని అభ్యంతరం చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఇది అభినందనీయమే.

పేరుకే సామాన్య యాత్రికులు

"తిరుమల శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులకు పెద్దపీట" వేస్తాం. అని టీటీడీ అధికారులు వల్లె వేస్తుంటారు. వారికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిస్తే, గంటలు రోజుల తరబడి వైకుంఠం క్యూట్ కాంప్లెక్స్ లో నిరీక్షింపజేస్తుంటారు. వీఐపీలు వీవీఐపీలకు మహద్వార దర్శనం కల్పించడానికి కూడా ఏమాత్రం వెనకాడరు. వారికి ప్రోటోకాల్ ఉంది కాబట్టి.. అవి పాటించాల్సిందే తప్పులేదు. అంతటితో ఆగరు.
శ్రీవారి ఆలయం లోకి అడుగుపెట్టగానే మహద్వారం వద్ద ఆ ప్రముఖులకు ఘన స్వాగతం లభిస్తుంది. బలిపీఠం (ధ్వజస్తంభం) వద్దకు వెళ్లగానే శిరస్సు ఆనించి స్వామివారిని మొక్కుకుంటారు. అంతవరకు తప్పులేదు. వారి రాకకు విశిష్ట ప్రచారం కల్పించడానికి టీటీడీ సమాచార విభాగం ఫోటోగ్రాఫర్ ప్రత్యేకంగా ఫొటోలు తీస్తారు. వాటిని టీటీడీ వెబ్సైట్లో పెట్టడమే కాదు. మీడియా కూడా విడుదల చేస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు టీటీడీ ఇచ్చే ప్రాధాన్యత ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే,
సామాన్యులపై ఆంక్షలు
ప్రముఖులు, అత్యంత ధనవంతలతో పోలిస్తే సామాన్య యాత్రికుల పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. రోజుకు తిరుమలకు సగటున 75 నుంచి 85 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. వీరి ద్వారా శ్రీవారి హుండీకి కానుకల రూపంలో రోజుకు సగటున రూ. 3.50 కోట్ల నుంచి రూ. నాలుగు కోట్లకు పైగానే ఆదాయం లభిస్తుంది. తల నీలాల ద్వారా సామాన్య భక్తుల వల్ల టీటీడీకి ఏటా రూ. 12 వందల కోట్ల ఆదాయం ఉంటుంది. పొరపాటున వీరు సెల్ ఫోన్ లోపలికి తీసుకువెళ్తే లాక్కునే వరకు ఫరవాలేదు. పొరపాటున ఫోటో తీస్తే మాత్రం వారు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యంత ప్రముఖులు, రాజకీయవేత్తలు, సంపన్నులకు ఇచ్చే ప్రాధాన్యత, సామాన్యులతో టీటీడీ వ్యవహరించే తీరులో ఇంత వ్యత్యాసం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో
స్వేచ్ఛకు సంకెళ్లు

మీడియాపై కూడా ఆంక్షల వల విసిరింది. స్వేచ్ఛగా రిపోర్టింగ్ చేసుకునే సదుపాయం కూడా లేకుండా చేసింది. టీటీడీ ప్రధాన పరిపాలన కార్యాలయం తిరుపతిలోని కేటీ. రోడ్డు (కపిలతీర్థం రోడ్డు) లో ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు ఈ పరిపాలన భవవనం పరిసరాల్లో అమలు చేస్తున్నారు. ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న ఈ పరిపాలన భవనం ఆవరణలో ఫొటోలు తీసుకోవడం కూడా నిషిద్ధం. వీడియోలు అసలు అనుమతించరు. కెమెరా తీసుకుని వెళ్లే వీడియో జర్నలిస్టును పరిపాలన భవనంలోకి అనుమతించకుండా, ఎంట్రన్స్ లోనే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటారు.
"టీటీడీ పీఆర్వో విభాగానికి వెళుతున్నాం" అని చెప్పిన భవనం లోపలికి అనుమతించరు.
ఇదిగో సాక్ష్యం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫెడరల్ ప్రతినిధులు ఇటీవల టీటీడీ పరిపాలన భవనం ఆవరణలో స్టార్ కోసం వీడియో తీసుకోవడానికి అభ్యంతరం చెప్పారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు, టీటీడీ జేఈవో పై చెబుతారు. ఆయనను సంప్రదిస్తే ఈవో తో మాట్లాడాలి అంటారు. ఈవో కోసం ప్రయత్నం చేస్తే ఆయన దొరకరు. ఫోన్ కాల్కు అందుబాటులో ఉండరు.. అపాయింట్మెంట్ కూడా దొరకదు. దీనిపై టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవిని సంప్రదిస్తే,
"ఈఓ అనుమతి ఉంటే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మా విభాగం వరకు ఏ సమాచారం కావాలని అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం" చీఫ్ పీఆర్ఓ రవి అసహాయత వ్యక్తం చేశారు.
తాజాగా లడ్డు ప్రసాదాల వ్యవహారంలో చేలారేగిన దుమారంపై టీటీడీ అధికారులు, వారి అధికార ప్రతినిధులుగా వీఆర్వో విభాగం స్పందించలేదు. మీడియాపై అమలు చేస్తున్న అప్రకటిత ఆంక్షలు విషయంపై వివరణ కూడా ఎందుకు కూడా వారి నుంచి స్పందన లేదు.
ఇలా అయితే.. ఎలా?
టీటీడీ అధికారులు అనుసరిస్తున్న ఈ విధానం వల్ల జాతీయ మీడియా కూడా ఆంక్షలు ఎదుర్కొంటుంది. కార్యక్రమాల తో పాటు తరచూ తెరపైకి వచ్చే ఆరోపణలపై స్పందన, అధికారుల వివరణ తీసుకోవడానికి టిటిడి ఈవో లేదా అదనపు ఇఓ సకాలంలో సరైన విధంగా స్పందించకుంటే తిరుమల శ్రీవారి విశిష్టత ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలరు అనేది వారికి తెలియాలి. తాజా వ్యవహారాలపై టీటీడీ ఎలా స్పందిస్తుందనేది.. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చే విషయంలో ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
సమీక్షించాలి..
మీడియాపై ఆంక్షలు విధించడంపై ఓ జర్నలిస్టు సంఘం జిల్లా ప్రసాద్ రెడ్డి స్పందించారు."పిలవని పేరంటానికి వెళ్లే వారు ఎవరైనా ఉంటారంటే అది మీడియా ప్రతినిధులు మాత్రమే. జర్నలిస్టుల వృత్తి ధర్మానికి ఆటంకాలు సృష్టించడం మంచిది కాదు" అని ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా హిందూ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న తిరుమల శ్రీవారి వ్యవహారాల్లో జరుగుతున్న పరిస్థితులు ప్రజలకు వివరించాలి. తద్వారా హిందువుల మనోభావాలను కాపాడాలి. ఇలా జరగాలంటే మీడియా పై తిరుమల కొండపైనే కాదు. పరిపాలన భవనం వద్ద కూడా ఆంక్షలు విధించడం సరైనది కాదు. దీనిని టీటీడీ అధికారులు సమీక్షించాలి" అని ప్రసాద్ రెడ్డి సూచన చేశారు.
Read More
Next Story