
ఉగ్రవాదులకు రాయచోటిలో చోటెలా దొరికింది
ఎవరికీ సందేహం లేకుండా వ్యాపారాలతో జనంలో మమేకం అయ్యారు.
రాయలసీమను అల్ ఉమ్మా (Al Ummah) స్లీపర్ షెల్స్ (sleeper shels) ఉగ్రవాద కార్యకలాపాలకు షెల్టర్ జోన్ గా మార్చుకున్నారా? ఎవరికీ సందేహం లేకుండా, చిన్న వ్యాపారాలతో జనంలో కలిసిపోయారా?
రాయచోటి పట్టణంలో తాజాగా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తీరు. గతంలో చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో ఇదే తరహాలో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యాన్ని పరిశీలిస్తే, భావసారూప్యం ఉంది. ఈ రెండు పట్టణాల్లో పట్టుబడిన ఉగ్రవాదుల జీవనం, వ్యవహార సరళి లో ఏమాత్రం భిన్నత్వం లేదు.
ఈ నలుగురు ఉగ్రవాదులకు బీజేపీ అగ్రనేత ఎల్.కే అడ్వాణీ రథయాత్రపై బాంబు దాడికి కుట్రలో భాగస్వామ్యం ఉందనే విషయం పోలీస్ రికార్డుల్లో ఉంది. తమిళనాట బీజేపీ నేత రమేష్ హత్య సంఘటనల నేపథ్యంలో మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదుల జాబితాలతో ఉన్నారు.
పుత్తూరు పట్టణంలో పట్టుబడిన ఉగ్రవాదులు ఇద్దరు తమిళనాడు జైల్లో ఉన్నారు. వారితో రాయచోటిలో తాజాగా అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
"జైల్లో ఉన్న ఈ ఇద్దరితో వీరికి ఉన్న లింకులపై కూడా తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Tamil Nadu Anti terrorist squad ATS), ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence bureau-IB) లోతుగా చేసే దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది" అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు.
షెల్టర్ జోన్
ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే, ఉగ్రవాదుల జీవన విధానం. జనంలో కలిసిపోయిన తీరు. ఉగ్రవాద కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు అనే విషయం మరోసారి స్పష్టమైంది. సాధారణంగా షెల్టర్ జోన్ గా వాడుకునే ప్రదేశాల్లో తమ ఉనికికి ప్రమాదం లేకుండా చూసుకుంటారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించడం ద్వారా తమ నెట్ వర్క్ విస్తరించుకోవడం, ఆపరేషన్లు సాగిస్తారనేది పోలీసు రికార్డులు చెప్పే మాట. ఈ విషయాలు గతంలో కూడా బయటపడ్డాయి.
మొదటి సంఘటన
చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో ఇద్దరు అల్ ఉమ్మా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. తమిళనాడులో మొదటి ఫక్రుద్డీన్ అనే తీవ్రవాది పట్టుబడ్డారు.
2013 అక్టోబర్ 5న ఆ సమాచారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, చిత్తూరు పోలీసులతో కలిసి ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు 11 గంటల పాటు పోరాడి, ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా, అల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్ తిరునల్వేలి ప్రాంతం మేల్ పాయలయూనికి చెందిన ఇస్మాయిల్ ను అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకునే యత్నంలో జరిగిన రాళ్ల దాడితో అప్పట్లో ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.
2011లో బీజేపీ అగ్రనేత ఎల్.కే. అడ్వాణీ రథయాత్రపై బాంబు దాడితో హత్య చేయాలనే కుట్రలో ఆ ఇరిద్దరూ నిందితులు. అప్పటి నుంచి ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్ అలియాస్ మున్నా, ఉల్ ఉమ ఉగ్రవాద సంస్థకు చెందిన బిలాల్ మాలిక్ తిరునల్వేలి ప్రాంతం మేల్ పాయలయూనికి చెందిన ఇస్మాయిల్, బిలాల్ మాలిక్, అబూబకర్ సిద్ధిక్ కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ తీవ్రవాదల నుంచి ఫక్రుద్దీన్ శిక్షణ తీసుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. వారి కోసం ఏపీతో పాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ పోలీసులు వేట సాగిస్తున్నారు. బాంబులు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడంలో వారంతా ఆరితేరారని పోలీసులు చెబుతున్నారు. పుత్తూరులో ఉన్నారనే ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ కార్డు కూడా అప్పట్లో వారిద్దరిని అరెస్టు చేసింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
వ్యాపారం ముసుగులో ఉగ్ర కలాపాలు
పుత్తూరు పట్టణంలో కూడా స్టీల్ పాత్రలు, దుస్తుల వ్యాపారం చేస్తూ ఈ ఇద్దరు ఉగ్రవాదులు అక్కడి ప్రజల్లో కలిసిపోయారు. ఈ పట్టణం కూడా చెన్నైకి సమీపంలోనే ఉండడం. ఇక్కడి ప్రజలు కూడా తెలుగు కంటే ఎక్కువగా తమిళ భాషను మాట్లాడడం సర్వసాధారణం. దీంతో ఆ ఉగ్రవాదుల పై ఎవరికి అనుమానం కలగలేదు. అందుకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా వారిద్దరూ పట్టణ ప్రజలతో కలిసిపోయారు.
రెండో సంఘటన
పుత్తూరులో ఏటీఎస్ స్క్వాడ్ దాడి చేసిన సమయంలోనే రాయచోటిలో అరెస్టు చేసిన అబూబకర్ సిద్ధిక్, మహమ్మద్ అలీ పేర్లు తెరపైకి వచ్చాయి. పుత్తూరు ఘటన నేపథ్యలోనే ఈ ఇద్దరు రాయచోటికి మకాం మార్చినట్లు కనిపిస్తోంది. వీరు కూడా రాయచోటిలో చీరలు, చిన్న దుకాణంతో జనజీవనంలో కలిసిపోవడం గమనించదగిన విషయం
ఇక్కడే ఎందుకు ఆశ్రయం?
రాయలసీమలో నే కాదు. రాష్ట్రంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న పట్టణం రాయచోటి.. ఇక్కడి ముస్లిం మైనార్టీల జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కొన్ని దశాబ్దాల పరిస్థితితో పోలిస్తే, మత సామరస్యానికి నిలయంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల రాజకీయ ప్రేరేపిత సంఘటనల నేపథ్యంలో వైషమ్యాలు చెలరేగిన, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీసుకున్న చర్యలతో పరిస్థితి చక్కబడింది. ఇలాంటి ప్రశాంతమయిన రాయచోటి తమ డెన్ గా మార్చుకుంటనేందుకు అనుకూలంగా ఉందని ఉగ్రవాదులు బావించి ఇక్కడ మకాం వేశారు. చాలా కాలం ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగారు కూడా.
ఇలాంటి ప్రశాంతమైన పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అరెస్టు చేసిన తర్వాత కలకలం చెలరేగింది. తమిళనాడు ప్రాంతానికి చెందిన అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా ఎంచుకోవడం వెనక వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు పోలీసులు సందేహిస్తున్నారు.
దేశంలోనే ప్రధానంగా కర్ణాటక తమిళనాడులో జరిగిన బాంబు పేలళ్ల వెనక వారి పాత్ర ఉండటం. నిఘవర్గాలు వెంటాడుతున్నాయని విషయాన్ని వారు గ్రహించలేకపోయారు.
సాధారణ జనంతో కలిసిపోవడానికి ఒకరు దుస్తుల వ్యాపారం, మరొకరు చిల్లర అంగడి నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక మహిళలనే వివాహం చేసుకున్న వారిద్దరూ 30 ఏళ్లుగా అందరిలో ఒకరిగా మారిపోయారు. ఇది బయటికి కనిపించేది. తెర వెనుక మాత్రం ఉగ్ర వ్యూహాలకు పదును పెడుతున్నారనే విషయం పోలీసులు అరెస్టు చేసే వరకు పసిగట్టలేకపోయారు.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కథనం మేరకు..
"పట్టణంతో పాటు పొరుగు ప్రాంతాల్లో అల్ ఉమ ఉగ్రవాదుల నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారా? అనే కోణంలో ఇంటెలిజెన్స్ బ్యూరో దృఫ్టి సారించింది" అని చెప్పారు.
ఎలా మాటు వేశారు...
రాయచోటిలో ఉగ్ర కదలికలపై ఐబీ, తమిళనాడు ఏటీఎస్ సిబ్బందికి చూచాయగా ఉప్పందినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. పట్టణవంలో ఆ విభాగాల సిబ్బంది కూడా మారువేషాల్లో మాటు వేశారు. వారి వద్ద పాత ఫోటోలు ఉన్నట్లు సమాచారం. అమానుల్లాగా మారిన అబుబకర్ సిద్ధిక్, మంజూద్ పేరుతో మహ్మద్ అలీ రాయచోటి ప్రజలతో కలిసి పోయిన వారిపై నెలపాటు నిఘా వేశారని చెబుతున్నారు. అరెస్టు చేయడానికి ముందు వారికి ఓ కొరియర్ పార్శిల్ రావడం, దానినిని తీసుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఆ కొరియర్ కేంద్రానికి వెళ్లిన ఐబీ సిబ్బంది, తమ వద్ద ఉన్న ఫొటోలు చూపించి, ఆ కొరియర్ తీసుకున్నది సందేహిస్తున్న వారే అని నిర్ధారణకు వచ్చిన వెంటనే, స్థానిక పోలీసుల సహకారంతో దాడి చేసిన ఉగ్రవాద నిరోధక బృందం ఇద్దరినీ అరెస్టు చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
ఇంకెందరో...
తమిళనాడుకు సరిహద్దులోని ఆంధ్ర పట్టణాలను వదిలిన ఉగ్రవాదులు, అనువైన ప్రదేశాలను ఎంచుకుని మకాం వేశారనే విషయం రాయచోటి ఘటనతో స్పష్టమైంది. వారి ద్వారా ఇంకెంతమంది సుక్షితులు తెరమీదకు వస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద రాయలసీమలో ఉగ్ర కదలికలు వేళ్లూనుకుంటున్నట్లు కనిపిస్తోంది.