Madanapalli|15 మంది ముఠా సరే!?  కిడ్నీ ఖరీదెంత?  ఆ.. డాక్టర్ ఎక్కడ..?
x

Madanapalli|15 మంది ముఠా సరే!? కిడ్నీ ఖరీదెంత? ఆ.. డాక్టర్ ఎక్కడ..?

ఆరుగురిని అరెస్టు చేశామన్నమదనపల్లె డీఎస్పీ మహేంద్ర.


చిత్తూరు జిల్లా మదనపల్లి కేంద్రంగా సాగిన కిడ్నీ రాకెట్ (Kidney Rocket) వెనక 15 మంది సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో గుర్తించిన ఏడుగురిలో ఆరు మందిని శనివారం అరెస్టు చేశారు. విశాఖపట్టణానికి చెందిన యమున నుంచి కిడ్నీ తొలగించడం, ఆమె మరణానికి కారణమైన బెంగళూరు డాక్టర్ తోపాటు మరో ఎనిమిది మంది కోసం గాలింపు ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాలకు విస్తరించిన కిడ్నీ రాకెట్ ముఠా మూలాలను ఛేదించే దిశగా మదనపల్లె ( MADANAPAALLI) పోలీసులు దృష్టి సారించారు.

మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో విశాఖపట్నం కి చెందిన 29 సంవత్సరాల యమున (Yamuna) నుంచి కిడ్నీ తొలగించడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసు కు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులను డిఎస్పి మహేంద్ర, టూ టౌన్ సిఐ రాజారెడ్డి, సిబ్బందితో కలిసి మీడియాకు శనివారం వివరించారు.
మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో అక్రమంగా కిడ్నీల మార్పిడి జరుగుతుందనే విషయం ఇరవై సంవత్సరాల యమునా అనే వివాహిత మరణించిన ఘటన నేపథ్యంలో వెలుగు చూసింది. ఈ ఘటనపై మరణించిన యమున (29) తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు Cr.No.179/2025, BNS Human Organ Transplantation Act - 2011 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గ్లోబల్ ఆస్పత్రి ఎవరిది?
అన్నమయ్య జిల్లా డిసిహెచ్ఎస్ (District Government Hospitals Coordinating Officer DCHS) డాక్టర్ కంప ఆంజనేయులు గ్లోబల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మదనపల్లి, కదిరి డయాలసిస్ (Dialysis) కేంద్రాల్లో పనిచేస్తున్న మేనేజర్లు ఇంకొందరితో కలిసి నెట్వర్క్ సాగించినట్లు విచారణలో తేలింది. అంటే పేదరికం, ఆర్థిక అవసరాలు ఉన్న వారిని గుర్తించడం, వారిని మదనపల్లికి తీసుకొని వస్తే కిడ్నీలు తొలగించి, లక్షలాది రూపాయలు చెల్లించిన డయాలసిస్ రోగులకు అమర్చడం ఓ వ్యాపారంగా మార్చుకున్నారు. ఆ కోవలో..
యమున మరణంతో..

విశాఖపట్నం ( Visakhapatnam) జిల్లా అనంతపురం మండలం బొడ్డుపాల్యానికి చెందిన సాడి కృష్ణ భార్య యమున (29) ను ఈనెల 9వ తేదీ కొంతమంది దళారులు మాయ మాటలు చెప్పి మదనపల్లెకు తీసుకొని వచ్చారు. సర్జరీ చేస్తుండగా ఆమెకు ఫిట్స్ రావడం వల్ల చనిపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో యమునకు చెల్లించాల్సిన 8.5 లక్షల రూపాయల పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
తమ కూతురు చనిపోయిందని సమాచారం అందుకున్న యమున తల్లి సూరమ్మ, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మదనపల్లె పోలీసులు ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఆ తర్వాత యమునా మృతదేహానికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన, కిడ్నీలో డాక్టరు లేరనే కారణంతో మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పంచనామా నిర్వహించిన తర్వాత యమున మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు.
Cr.No.179/2025
కిడ్నీలు తొలగించడంతో మరణించిన యమునా తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు మదనపల్లి రెండో పట్టణ సీఐ రాజారెడ్డి కేసు నమోదు చేశారు. ఐదు రోజుల తర్వాత నిందితులను గుర్తించినట్లు మదనపల్లి డిఎస్పి మహేంద్ర శనివారం మీడియాకు చెప్పారు.
"కిడ్నీ రాకెట్ ముఠా సభ్యులను అరెస్టు చేయడంలో మదనపల్లె సీఐలు కే. రాజారెడ్డి, పీ. మహమ్మద్ రఫీ, సీ.వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రహీముల్లా, అన్సర్ బాషా, హరిహర ప్రసాద్, తిప్పేస్వామి ట్రైని ఎస్ఐ ప్రియ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు దర్యాప్తు చేయడంలో కీలకంగా వ్యవహరించిన నిందితులను అరెస్టు చేశారు" అని డీఎస్పీ మహేంద్ర వివరించారు.

15 మంది ముఠా..
"మదనపల్లి పట్టణం ఎస్బిఐ కాలనీ కేంద్రంగా గ్లోబల్ ఆసుపత్రి ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కంప ఆంజనేయులు ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో 15 మందితో కూడిన బృందం కిడ్నీ రాకెట్ లో ఉన్నట్లు గుర్తించాం" అని డి.ఎస్.పి మహేంద్ర తెలిపారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసిహెచ్ఎస్) ఆంజనేయులు, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ మేనేజర్ బాల రంగడు అలియాస్ బాలు, కదిరి డయాలసిస్ కేంద్రం మేనేజర్ మెహరాజ్ ఉన్నారని చెప్పారు. కిడ్నీలు తొలగించడంతో మరణించిన యమునను తీసుకురావడంలో దళారులుగా వ్యవహరించిన విశాఖపట్నంకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య, యమునా ప్రియుడు హరిబాబును అరెస్టు చేశామని డిఎస్పి మహేంద్ర వివరించారు. ఇందులో నిందితుడిగా ఉన్న అంటే.. కిడ్నీ రాకెట్ లో ప్రముఖ పాత్ర పోషించిన బెంగళూరు ప్రాంతానికి చెందిన డాక్టర్ కోసం గాలింపు సాగిస్తున్నామని డిఎస్పి మహేంద్ర వివరించారు. విశాఖపట్నం కు చెందిన యమునకు సర్జరీ చేసి కిడ్నీ తొలగించిన వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆ ఎనిమిది మంది ఎవరు?

మదనపల్లి కేంద్రంగా సాగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఇంకా 8 మంది నిందితులు ఉన్నట్లు డిఎస్పి మహేంద్ర చెబుతున్నారు. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు కొడుకు, ఈయన భార్య పాత్రపై ఇంకా నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డిసిహెచ్ఎస్ ఆంజనేయులు అరెస్ట్ చేసినట్లు డిఎస్పి వెల్లడించారు. ఆయన కొడుకు, కోడలు గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో కీలకంగా వ్యవహరించారని వ్యాఖ్యలు వినిపించినప్పటికీ, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో వారి పాత్ర ఏమిటి అనేది పోలీసులు వెల్లడించలేదు.
"ఈ కేసు దర్యాప్తులో ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించాం. ఆ నిందితులను ఆధారాలతో అరెస్టు చేస్తాం. ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తాం" అని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు.
కిడ్నీ రాకెట్ నెట్వర్క్ ..
మదనపల్లి కేంద్రంగా సాగిన కిడ్నీ రాకెట్ ( Kidney rocket) వేర్లు ఎన్ని రాష్ట్రాలకు విస్తరించాయి అనేది కూడా మదనపల్లి పోలీసులు దృష్టి సారించారు. మదనపల్లి నుంచి విశాఖపట్నం వ్యాపించిన ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దళారులు ఉన్నట్లు పోలీసులు సందేహిస్తున్నారు.
మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో యమునా నుంచి తొలగించిన కిడ్నీని గోవాకు తరలించారని పోలీసులు సందేహిస్తున్నారు. ఎపిసోడ్లో బెంగళూరు ప్రాంతానికి చెందిన డాక్టర్ కీలక భూమిక పోషించినట్లు పోలీసు అధికార వర్గాల కథనం ద్వారా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు, కర్ణాటక, గోవాకు కూడా దర్యాప్తు కోసం పోలీసులు బృందాలను పంపించినట్లు డిఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ సేకరించడం ద్వారా కిడ్నీ రాకెట్ నెట్వర్క్ ఎప్పటికీ చేదిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? దొరికిన వారు చాలు అని భావిస్తారా ? అనేది పోలీసుల దర్యాప్తులో వెలడయ్య అంశాల ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read More
Next Story