భయాందోళనలో 'అంజనాపురం' జనం
కలుషిత నీటితో ఓ గ్రామం మంచం పట్టింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం స్పందించారు. అధికారులు రంగంలోకి దిగారు.
ఇటీవల వరుసగా సంభవించిన తుఫాన్ల కారణంగా కురిసిన వర్షాలతో కొత్తనీరు చేరింది. దీనికి మురుగునీరు కలవడం వల్ల రోగాలు ప్రబలుతున్నాయి. అనుకోని విధంగా పల్నాడు జిల్లాపై అతిసారం పంజా విసిరింది. ఈ జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీలో అతిసార వ్యాధికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబుతో సీఎం ఎన్. చంద్రబాబు మాట్లాడారు. పరిస్థితి చేయిదాటకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా స్పందించారు. విజయవాడ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంకొందరు అతిసార వ్యాధికి గురికాకుండా వైద్య సేవలు అందిస్తున్నారు.
అంజనాపురంలో ఏమి జరిగింది?
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ అంజనాపురంలో 300కు పైగానే కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి బోరు ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. తాగునీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో మురుగునీరు అందులో కలిసిందని అంజనాపురం గ్రామస్తులు తెలిపారు. తాగునీటి కాలుష్యం వల్ల దాదాపు పది మంది వాంతులు, విరేచనాలకు గురయ్యారు. కొందరు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, మరో ఇద్దరు మరణించడంతో ఉలిక్కిపడ్డారు. నీరు కలుషితం అవుతున్న విషయమై గతంలో అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. తాగునీరు కలుషితం కావడంతో అతిసార వ్యాధికి గురైన వారిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, ఇంకొందరు ఇళ్ల వద్దే వైద్య సేవలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. కాగా,
ఇద్దరి మృతి
అతిసార వ్యాధికి గురైన వారిలో గ్రామానికి చెందిన ఇద్దరు మరణించడంతో అంజనాపురంలో ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు (21), నిన్న బండారు చిన్నవీరయ్య పిడుగురాళ్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో, గ్రామంలో అస్వస్థతకు గురైన వారిలో మరింత ఆందోళన ఎక్కువైంది. ఈ సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ పి. అరుణ్ బాబుతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ,
"డయేరియా ప్రబలిన కాలనీకి రూ. 25 లక్షలతో వాటర్ ఫిల్టర్ బెడ్లు, పైపులైన్లు ఏర్పాటు చేయిస్తా" అని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. "ఈ తరహా పరిస్థితి మళ్లీ ఎదురుకాకుండా, శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. అనంతరం డయేరియాకు గురై, రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాసరావు పరామర్శించారు.
ఇంటింటా పరిశీలన
డయేరియా ప్రబలిన అంజనాపురంలో కలెక్టర్ పి. అరుణ్ బాబు వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కలిసి ఇంటింటా పరిశీలించారు. ఇళ్లలో అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. ఈ కాలనీలో ఇంటింటా సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. బి. రవికుమార్ తెలిపారు. కాలనీలో మురుగునీటి కాలువలను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయించడంతో పాటు బ్లీచింగ్ చల్లించారు. కాలనీకి మంచినీరు సరఫరా అవుతున్న పైపులైన్లను కూడా వెంటనే మరమ్మతు చేయించడం ద్వారా రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నీటిని పరీక్షలకు పంపండి
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ అంజనాపురం కాలనీలో డయేరియా ప్రబలిన సమాచారం అందిన వెంటనే మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు. గ్రామంలోని బోర్ల నుంచి నీటిని సేకరించి, ల్యాబ్ కు పంపించడం ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంజనాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాలు కొనసాగించడంతో పాటు, అప్రమత్తంగా వ్యవహరించి, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, ఆర్డీఎంఏ హరికృష్ణతో పాటు డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవికుమార్, ప్రజారోగ్య శాఖ ఎస్ఈ శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ అప్పారావుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Next Story