HOT Topic :రాజకీయంగా కూడా షర్మిల ఒంటరేనా?
x

HOT Topic :రాజకీయంగా కూడా షర్మిల ఒంటరేనా?

వైఎస్ఆర్ కుటుంబ వివాదం రచ్చ కెక్కింది. అమ్మ, చెల్లిపై జగన్ కోర్టుకు వెళ్లారు. షర్మిలపై వైసీపీ మాటల దాడి పెరిగినా, కాంగ్రెస్ పెద్దలు స్పందించడం లేదు.


ఆస్తుల వ్యవహారంలోనే కాదు. రాజకీయంగా కూడా వైఎస్. షర్మిలారెడ్డి ఒంటరి పోరాటం సాగిస్తున్నట్లే కనిపిస్తోంది. సొంత అన్న వైఎస్. జగన్ తో తాజాగా ప్రారంభమైన వివాదం నేపథ్యంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఎవరూ ఆమెకు మద్దతుగా నిలిచినట్లు కనిపించడం లేదు. పీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్. తులసిరెడ్డి మినహా ఒక్కరూ మద్దతుగా నిలిచిన వారు కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏంటనేది చర్చకు దారితీసింది. షేర్ల గిఫ్ట్ డీడ్ ఎపిసోడ్ లో తల్లి వైఎస్. విజయమ్మతో పాటు చెల్లి వైఎస్. షర్మిలరెడ్డిపై వైఎస్. జగన్ కోర్టులో కేసు వేయడంతో కలహాలు ముదిరి పాకాన పడ్డాయి.

వైఎస్ఆర్ కుటుంబం కడపలోనే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. అభిమానులతో పాటు అసంతృప్తి, అసమ్మతి వాదుల ఆ కుటుంబం మొదటి నుంచి ప్రయాణం సాగిస్తోంది. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన కొడుకు వైఎస్. జగన్ సొంతంగా వైఎస్ఆర్ సీపీ ఏర్పాటు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా ఇక్కట్లు పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పాతర వేశారు.
ఆ సమయంలో ఓప్రచార సభలో వైఎస్. షర్మిల రెడ్డి మాట్లాడుతూ, "నేను జగనన్న వదిలిన బాణాన్ని" అని చేసిన వ్యాఖ్యాలు ఆసక్తికరంగా మారడమే కాదు. పాపులర్ అయ్యాయి. అన్న వైఎస్. జగన్తో ఉన్న అనురాగం, మమకారాన్ని చాటుకున్న వైఎస్. షర్మిల ఏఐసీసీ పెద్దలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం, వైఎస్ అభిమానులు, మద్దతుదారులను ఉత్సాహ పరిచాయి.

ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతల ఆగ్రహానికి గురైన వైఎస్. జగన్ ఆర్థిక అవకతకల కేసుల్లో జైలుకు వెళ్లారు. 18 నెలల పాటు ఆయనకు బెయిల్ దొరకలేదు. 2011లో వైఎస్. షర్మిల వైసీపీని జనంలోకి తీసుకుని వెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఉపఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించడానికి వైఎస్. షర్మిల, ఆమె తల్లి విజయమ్మ కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత కూడా పాదయాత్రలో ఉన్న జగన్ జైలుకు వెళితే, ఆ స్థానంలో పాదయాత్ర సాగించడం ద్వారా ఆయన చెల్లెలు వైఎస్. షర్మిల పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు.
2014 ఎన్నికలు మొదటిసారి వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. అప్పటికీ వైఎస్. షర్మిల పార్టీలో అన్న కోసం కీలకంగా వ్యవహరించినా, 2019 ఎన్నికల్లో "బైబై బాబు" పేరిట షర్మిల బస్సు యాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు. రాజకీయంగా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం, సీఎం కావాలనే వైఎస్. జగన్ లక్ష్యం కూడా నెరవేరింది. కానీ,
అన్నా.. చెల్లి మధ్య విబేధాలు
వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్. షర్మిలకు ఎలాంటి పదవి దక్కలేదు. ఆమెను కడప ఎంపీగా పోటీ చేయిస్తారని కూడా ప్రచారం జరిగినా , ఆ స్థానంలో వారి తమ్ముడు వైఎస్. అవినాష్ రెడ్డిని పోటీ చేయించారు. అంతకుముందు ఈ వ్యవహారంపై "వైఎస్ఆర్ కుటుంబంలో పెద్ద చర్చే జరిగింది" అని వార్తలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత,
2011లో వైసీపీతో సంబంధాలు తెంచుకున్న వైఎస్. షర్మిల పార్టీకి, అన్న జగన్ కు దూరమయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందనేది మాత్రం చిదంబర రహస్యంగానే మిగిలింది. అన్నా, చెల్లెళ్లు ఎవరూ దీనిపై నోరు మొదపకున్నా, ఆస్తుల గొడవతో పాటు షర్మిలకు పదవి దక్కకపోవడం కూడా ఓ కారణమై ఉంటుందనే మాటలు వినిపించాయి.
2021 ఏప్రిల్ లో వైఎస్. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించారు. ఆ తరువాత జూలై 8న తండ్రి వైఎస్ఆర్ జయంతి రోజు ఖమ్మం వేదికగా పార్టీ ప్రారంభించారు. అప్పటి టీఆర్ఎస్ (TRS) ( బీఆర్ఎస్-BRS) విధానాలు, సమస్యలపై సమరశంఖం పూరించారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో సన్నిహితంగా మెలిగిన అన్న జగన్ పై కూడా రాజకీయ విమర్శలు సంధించారు. దీంతో ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా స్పందించారు. "తెలంగాణలో ఎందుకు తల్లీ... మీ అన్న జగన్ పై నీ బాణం సంధించు" అని కూడా వ్యాఖ్యానించారు.
ఆ..సామెత సాకారం..
"రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు" అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అన్న జగన్ కోసం ఏఐసీసీ పెద్దలపై షర్మిల కూడా మాటల యుద్ధం సాగించారు. తెలంగాణలో అనుకూల వాతావరణం ఉండడం, ఆంధ్రలో మళ్లీ పార్టీకి జీవం పోయాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఆంధ్రలో మాజీ సీఎం వైఎస్. జగన్ ను దెబ్బతీయాలి. ఎలాగూ అన్నతో షర్మిళ విబేధించారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అస్త్రంగా మార్చాలనుకున్నారు. ఆమెతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు సాగించిన చర్చలు ఫలప్రదం కావడం..
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఏకంగా పీసీపీ పగ్గాలు కూడా అప్పగించారు.
సుడిగాలి పర్యటన
పీసీసీ బాధ్యతలు చేపట్టగానే వైఎస్. షర్మిల కాంగ్రెస్ శ్రేణుల ఏకీకరణ సభలకు శ్రీకారం చుట్టారు. దీంతో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అందించారు. అప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంఎల్సీ గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. "మా నేత వైఎస్ఆర్ కూతురికి పదవి వస్తుందంటే మాకు ఆనందంగా ఉంది" అని కూడా వ్యాఖ్యానించారు. ఈ సభలో తరువాత ఆమె ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. అన్న వైఎస్. జగన్ పై కూడా అవిశ్రాంతంగా విమర్శలు సంధించారు.
2024 ఫిబ్రవరి 26త తేదీ అనంతపురంలో "న్యాయ సాధన" పేరుతో భారీ బహిరంగ నిర్వహించారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జు ఖర్గేతో పాటు రాష్ట్రంలోని సీనియర్లు, భారీగా జనం హాజరు కావడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడుతుందనే బలమైన సంకేతం ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్ఆర్ విధేయ కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రులు ఎన్. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, ఒకనాటి అసమ్మతి నేతల్లో మాజీ ఎంపీ జివి. హర్షకుమార్, కేంద్ర మాజీ మంత్రులు జేడీ. శీలం, డాక్టర్ చింతా మోహన్, పల్లంరాజు వంటి వారు కూడా షర్మిల నాయకత్వాన్ని స్వాగతించారు.
"వైఎస్ఆర్ ఎప్పుడు వచ్చినా నేను వెళ్లేవాడిని కాదు. కానీ షర్మిల తిరుపతికి వస్తుంటే వెళ్లా. ఆమె నాయకత్వాన్ని సమర్థిస్తున్నా" అని డాక్టర్ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వ్యవహారంలో వైఎస్. షర్మిల విమర్శలు ఎదుర్కొన్నారు. పొగిడిన నోళ్లలో మాజీ ఎంపీ చింతా మోహన్ సహా విజయవాడ నేతలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి (నగరి) కూడా షర్మిలకు వ్యతిరేక గళం వినిపించారు. "ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారంట. అందరూ అంటున్నారు. నాకైతే తెలియదు" అని చింతా మోహన్ బాహాటంగా ఆరోపించారు. రాష్ట్రంలోని సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా విమర్శలు సంధించారు. ఇదిలా ఉండగా,
తెరపైకి ఆస్తుల గొడవ
2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నామమాత్ర కార్యక్రమాలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో షేర్ల వ్యవహారం, ఆస్తుల గొడవపై అన్న వైఎస్. జగన్తో వైఎస్. షర్మిల వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై తల్లీ వైఎస్. విజయమ్మ, సోదరి వైఎస్. షర్మిల మధ్య వైఎస్. జగన్ కు సాగిన లేఖల యుద్ధం మీడియాల పతాక శీర్షికలుగా మారాయి.
"జగనన్న మోచేతి కింద నీళ్లు తాగుతారు" అని చిన్నాన్న, రాజ్యసభ సభ్యుడు వైవీ. సుబ్బారెడ్డిపైనే కాకుండా మరో నేత ఏ. విజయసాయిరెడ్డిపై కూడా షర్మిల ఘాటైన పదజాలం వాడారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు షర్మిలపై మాటల దాడి ప్రారంభించారు. వైసీపీ నేతల మాటలతో ఇటీవల షర్మిల మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అయినా, వదలని వైసీపీ నేతలు విమర్శలు సంధించారు. ప్రధానంగా
వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా మాటలతో దాడి చేశారు. "నేను నాలాంటి వారు వైఎస్ఆర్ ను అత్యంత గాఢంగా అభిమానిస్తాం. ఆయన బిడ్డ షర్మిళపై గౌరవం ఉంది" అంటూనే "షర్మిల సీఎం చంద్రబాబు సంధించిన విషపు బాణం" అని ఘాటు వ్యాఖ్య చేశారు. ఆమె ఏకాకిగానే మిగులుతారు అని కూడా జోస్యం చెప్పారు. ఇదిలావుంటే..
స్పందన ఏదీ..?
మాజీ సీఎం వైఎస్. జగన్ కు స్వయాన చెల్లెలు వైఎస్. షర్మిల. వారి మధ్య అనుబంధం సంవత్సరాల కిందటే బద్దలైంది. అన్నా, చెల్లెలి కుటుంబం, ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. ఇది కాస్తా, మళ్లీ రాజకీయ ఆరోపణలు, విమర్శలకు వేదికగా మారింది. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు సొంత పార్టీ నుంచి మద్దతు కనిపించడం లేదు. నాయకులు కూడా స్పందించడం లేదు. జగన్ కోసం వైసీపీ తరహాలో షర్మిళ పక్షాన మాట్లాడేవారు లేకుండా పోవడం వల్ల ఆమె ఇంట్లోనే కాదు. రాజకీయంగా కూడా ఒంటరి అయ్యారా? అనేది చర్చకు ఆస్కారం కనిపించింది. నేనున్నా అంటూ పీసీసీ (PCC) ప్రధాన అధికార ప్రతినిధి (Spokes Person) నర్రెడ్డి తులసిరెడ్డి ఒక్కరు మాత్రమే నాలుగు రోజుల తరువాత స్పందించారు.
జగన్ కు బంధాలు లేవు...

వైఎస్. జగన్ కు బంధాలు, అనుబంధాలు ఏమి ఉండవు అని తులసిరెడ్డి నిందించారు. కారణం.. "వైఎస్. జగన్కు పిచ్చి ఎక్కువైంది. డబ్బు, అధికారం, పదవి కోసమే" అని వ్యాఖ్యానించారు. "వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీని కుట్ర ఉందని, వారి ఆస్తులపై జగన్ వ్యాఖ్యలు దాడులకు పురిగొల్పాయి" అని తులసిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే అదే అంబానీకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెళ్లి రెడ్ కార్పెట్ తో స్వాగతించారు. అంబానీ సూచించిన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా జగన్ ఎంతకైనా దిగజారతారు" అనడానికి మచ్చుతునక అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడతారు అంటూ "తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళపై నేషనల్ లా ట్రిబ్యునల్ లో కేసు పెట్టడం" అనేది జగన్ దర్మార్గానికి నిదర్శనం అని అభివర్ణించారు. ఇలాంటి వ్యక్తులు సమాజం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తులసిరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కొందరు నేతల వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు. "పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారనడం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఆ దుర్గతి లేదు. మీరంతా (పెద్దిరెడ్డి, సీఎం చంద్రబాబు, జగన్,కేసీఆర్ ) కాంగ్రెస్ పార్టీ వటకృక్షం ఊడలు అని అన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. వారు రాసిచ్చింది చదవడం అలవాటని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పెద్దల మౌనం ఎందుకు?
ఇదిలావుండగా, మిగతా కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించకపోవడం వెనక కారణం ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. జగన్, షర్మిల వ్యక్తిగత విషయాలు అనుకుంటున్నారా? లేక పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా కినుకగానే ఉన్నారా? అనేది చర్చకు తెరతీసింది. దీనిపై ఏఐసీసీ కూడా అదే తీరుగా ఉండడం వెనుక మరో కారణం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధినేత ఒంటరిగానే మూడు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆ విషయం ముందుగానే చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఐదేళ్ల వేధింపులకు కూటమి ప్రభుత్వం దీటుగానే వైసీపీకి సమాధానం చెబుతోంది. వైసీపీకి జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీ మద్దతు అవసరంగా భావిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నుంచి ఆ అవకాశం లేదు. ఉత్తరాదిలోని పార్టీలకు వైసీపీతో అంత అవసరం లేదు. ఇక మిగిలింది. కాంగ్రెస్, ఇండియా (INDIA) కూటమి మాత్రమే. కాగా, ఇటీవల కొన్ని రోజులుగా కాంగ్రెస్ తో వైసీపీ కలుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని ఏఐసీసీ భావిస్తోందా? అందుకే పీసీసీ చీప్ షర్మిల ఎపిసోడ్ లో ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు వేచిచూసే ధోరణితో ఉన్నారా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. రాజకీయాల్లో ఏ క్షణాన ఏదైన జరగవచ్చు. పీసీసీ చీఫ్ షర్మిళకు కాంగ్రెస్ ఎలాంటి సహకారం, మద్దతు అందిస్తుందనేది వేచి చూడాల్సిందే.
Read More
Next Story