చితికిన దీనార్ల ఆశలు..!  తెలుగోడి ఎడారి ఘోష
x

చితికిన దీనార్ల ఆశలు..! తెలుగోడి 'ఎడారి' ఘోష

ఉపాధి కోసం పేదలు గల్ఫ్ కు వలస వెళుతున్నారు. దీనార్లపై ఆశతో వెళ్లే వారిలో చాలా మంది జీవితాలు మరింత చితికిపోతున్నాయి. వారికి కేంద్రం ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యక్తికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది.


అది వాల్మీకిపురం సమీపంలోని చింతపర్తి బీసీ కాలనీ. అద్దె ఇల్లు, ఇద్దరు కుమార్తెలు. జగనన్న కాలనీలో ఇచ్చిన ఇంటి నిర్మాణానికి అప్పలు అయ్యాయి. కూలీ పనులు చేస్తేనే నాలుగు వేళ్లు నోటిలోకి వెళతాయి. ఆ కాలనీకి చెందిన శివ సరిగ్గా నెల క్రితం కువైట్ కు వెళ్లాడు. శివ దీనార్లు సంపాదిస్తే జీవితం హాయిగా సాగుతుందని ఆయన భార్య అవేటి శంకరమ్మ, కుమార్తెలు వెన్నెల, వనతి సంతోష పడ్డారు. ఏజెంట్ సాయంతో రూ. 75 వేలకు మాట్లాడుకుని గొర్రెల కాపరిగా శివ కువైట్ వెళ్లాడు. ప్రస్తుతం ఆ దేశంలో మండు వేసవికాలం. వడగాల్పులు ఎక్కువ. శివ భరించలేకపోయాడు. తన దీనస్థితిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కళ్లముందు అప్పుల కుప్ప కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చడం ఎలా అనే భయంతో వారు పరిస్థితిని గుర్తు చేశారు. కొన్ని నాళ్లు భరించిన శివ "ఇక తన వల్ల కాదు. నన్ను ఇంటికి పిలిపించుకోకుంటే, మరణం తప్పదు" అని విడుదల చేసిన వీడియో వైరల్ అయింది.

2023 డిసెంబర్ నాటికి కువైట్ జనాభా 4.859 మిలియన్లు ఉంటే అందులో 3.3 మిలియన్లు ప్రవాసులే. వారిలో భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి 2020 నాటికి 1.20 లక్షల మంది కువైట్లో ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 1990 నాటితో పోలీస్తే చాలా తక్కువ. గల్ఫ్ పై ఇరాక్ యుద్ధం ప్రకటించిన సమయంలో దాదాపు 1.7౦ లక్షల మందిని అక్కడి నుంచి తరలించారు. ఇంతమంది ఎన్ఆర్ఐల భద్రతను గాలికి వదిలేసిన భారత ప్రభుత్వం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తోందా? ఇదో సాక్ష్యం మాత్రమే...


"చూడండి..సార్..
ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ కుక్కలకు మేత... అన్ని నేనే వేసుకుంటాడా సార్. ఇక్కడ నేను ఒకడే ఒకడు. దిక్కులేరు.
నా భార్యకు చెప్పిన. ఎడారిలో ఉండా, సార్ నా భార్యకు చెప్పినా ఎడారిలో యేసేసినారు. చూడండి చుట్టూ ఎడారి. చెట్టు లేదు. చామ లేదు. నాకు బతకాలని లేదు సార్. ఎవురు చెప్పినా నమ్మడం లేదు. ఈడ పావురాలకి మేత, కుక్కలకు మంచి చెడ్డ అన్నీ నేనే చూడాలి. ఒకో రోజు వాళ్లు (యజమానులు) వచ్చినారంటే రాత్రిమూడైనా నిద్ర ఉండదు సార్. కోళ్లకు కుక్కలకి మేత చూసుకోవాలి సార్, చెట్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాయి సార్. వాటికి నీళ్లు ఎత్తుకుని పోయి పోయాల. క్యాన్లతో నీళ్లు మోసుకుని పోవాలి. ఈ జనరేటర్లు రెండు ఉండాయి. ఒకటి పనిచేయడం లేదు. ఒక మోటర్ చెడిపోతే చెప్పినా చెవిలోకి వేసుకోలేదు. ఈటికి పొద్దటి నుంచి నీళ్లు పోయాలి. ఒకడే.. నా వల్ల కావడం లేదు. ఒళ్లు సుస్తి అయిపోతాంది. నా వల్ల కావడం లేదు. ఇప్పుటికి ఆయన (యజమాని) వచ్చి మూడు రోజులు అయితాంది. కనీసం తిన్నావా? సచ్చినావా అని అడిగే వాడు లేడు సార్. పాములు, తేళ్లు ఎక్కువగా తిరగతాయ ఉండాయి. నేను సచ్చిపోయినా అడిగేవోళ్ల లేరు సార్. మీ కాళ్లు మొక్కుతా ఎట్టయినా నన్ను ఇండియాకు తీసకపోండి. కూలీ పనులతో బతుకుతా" లేదంటే ఈడనే సచ్చిపోతా" అని తన దీనగాధ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గల్ప్ ఎడారిలో ఓ తెలుగోడి వేదనలో ఇదో ఉదాహరణ మాత్రమే..
స్పందించిన మంత్రి లోకేశ్
కువైట్‌లో దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్న వీడియోపై రాష్ట్ర మంతి నారా లోకేష్ స్పందించారు. "వీడియోలోని వ్యక్తిని గుర్తించాం. టీడీపీ ఎన్​ఆర్​ఐ బృందం ఆయనను చేరుకుంది" అని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.


కువైట్ లో దీనస్థితిలో ఉన్నా అని వీడియో వైరల్ చేసిన శివ భార్య శంకరమ్మతో ఫెడరల్ ప్రతినిధి మాట్లాడారు. తమ కుటుంబ దీనస్థితిని ఆమె వివరించారు. "నా భర్త పాత్రలు (బోకులు) వాహనంలో ఉంచుకుని ఊరూరా తిరుగుతూ విక్రయించే వారు. నేను కూలీ పనులకు వెళ్లేదాన్ని" అని శివ భార్య శంకరమ్మ చెప్పారు. "నా పెద్ద కూతురు వెన్నెల చదువు మానేసి ఇంటి వద్దే ఉంది. ఇద్దరం కలిసి కూలీ పనులకు వెళ్లే వాళ్లం. చిన్న కూతురు వనిత ఆరో తరగతి చదువుతోంది" అని వివరించారు." నా భర్త కోయేట్ పోవడం వల్ల మా బతుకులు బాగు పడతాయని అనుకుంటే ఇలా అయింది" అని కన్నీరు పెట్టుకున్నారు.
కువైట్లో ఎవరికి రక్షణ
కువైట్లో నైపుణ్య రంగాల్లో వేళ్లే వారికి అన్ని రకాల భద్రతా సదుపాయాలు ఉంటున్నాయి. అందులో ప్రధానంగా ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, శాస్త్రవేత్తలు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, మేనేజ్‌మెంట్ నిపుణులు, కన్సల్టెంట్‌లు, ఆర్కిటెక్ట్‌లు, రిటైల్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు వంటి నిపుణులు ప్రధానంగా ఉన్నారు. ఆలస్యంగా, హైటెక్ రంగాలలో, ప్రత్యేకించి కువైట్‌లో సాఫ్ట్‌వేర్, ఆర్థిక రంగంలో అధిక అర్హత కలిగిన భారతీయ నిపుణుల సంఖ్య పెరిగింది. ఆరోగ్య రంగంలో, భారతదేశం అగ్రశ్రేణి నిపుణులను మాత్రమే కాకుండా ఉన్నత ఖ్యాతిని పొందే పారా-మెడికల్ సిబ్బందిని కూడా అందిస్తుంది. కువైట్ నుంచి భారతదేశానికి ఇన్వార్డ్ రెమిటెన్స్‌లు గణనీయంగా ఉన్నాయి. వారి కుటుంబాలు, పిల్లల కోసం అక్కడ 18 సీబీఎస్ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, 106 ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్లు భారత రాయభార కార్యాలయంలో రిజిస్టర్ అయ్యాయి.

గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళుతున్న వారు అష్టకష్టాలు పడి సంపాదించి, బ్యాంకుల ద్వారా పంపించే నగదు ద్వారా కేంద్రానికి ఆదాయం వస్తందనేది వాస్తవం. ఆ దేశాల్లో భారత రాయభార కార్యాలయం కూడా ఉంది. కార్మికులుగా వెళ్లే వారికి రక్షణ అంతంత మాత్రమే ఉంటోంది.

"రాయభార కార్యాలయం పనితీరు అంత సక్రమంగా లేదు" అని కువైట్లో పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న చిట్వేలి మండలానికి చెందిన షేక్ మస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కార్యాలయంపై తక్కువ మాట్లాడుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2023 నాటికి కువైట్ జనాభా 4.859 మిలియన్లు (1.546 మిలియన్ పౌరులు 3.3 మిలియన్ల ప్రవాసులు), 2022లో వారి జనాభా (4.7 మిలియన్లు). 2023లో కువైట్ మొత్తం జనాభాలో (2.97 మిలియన్లు) 61% మంది కార్మికులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కువైట్ ప్రవాస జనాభాలో 75 శాతం మంది ఉన్నారు. భారతీయ సంఘం కువైట్‌లో అతిపెద్ద ప్రవాస సంఘంగా మిలియన్ మార్క్‌ దాటింది.

"కొన్ని తెలుగు సంఘాల్లోని వ్యక్తలు ఇక్కడ కీలకంగా ఉండాలని ప్రయత్నిస్తారు. బాధితులకు సాయం అందిస్తున్నారు" అని కువైట్ లో ఉంటున్న కడప జిల్లాకు చెందిన సీనియర్ జన్నలిస్ట్ ఒకరు ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యనించారు. "రాయభార కార్యాలయానికి వెళ్లకుండా, అంతా ప్రైవేటు వ్యక్తల చేతిలో సాగుతుంటే, మనవారిని పట్టించుకునే వారెవ్వరు" అని ఆయన ప్రశ్నించారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. " గత పదేళ్లతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే హౌస్ మేడ్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పడు చాలా వరకు ఫాం, షీప్ ఫాంలో పనిచేయడానికి వీసాలు జారీ చేస్తున్నారు. భారతదేశం నుంచి గల్ఫ్ కు రావాలనుకునే వారు తమకు వచ్చింది. ఏ రకం వీసా అనేది మొదట పరిశీలించుకోవాలి" అని ఆయన సూచించారు. ఇలా ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే, ఏదో ఊహించుకుని వచ్చి, అక్కడే ఎదురయ్యే వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకు వాల్మీకిపురం ప్రాంతానికి చెందిన శివ ఉదంతం ఓ ఉదాహరణ అని ఆయన ప్రస్తావించారు.
Read More
Next Story