Modern elegance in Tirumala |రథసప్తమికి అధికారులు అద్దిన హైటెక్ సొబగు
x

Modern elegance in Tirumala |రథసప్తమికి అధికారులు అద్దిన హైటెక్ సొబగు

తిరుమలలో ఇది మినీబ్రహ్మోత్సవం. ఫిబ్రవరి 4న సూర్యజయంతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాడవీధుల్లో ఆధునిక ఏర్పాట్లు చేయడంలో ప్రత్యేకత చాటుకోవాలనే ఆసక్తి కనిపించింది.


నిత్యకల్యాణం. పచ్చతోరణానికి మారుపేరు తిరుమల. రథసప్తమి (సూర్య జయంతి) మినీ బ్రహ్మోత్సవానికి సిద్ధమైంది. మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి మంగళవారం ఒకే రోజు ఏడు వాహనాలపై విహరిస్తూ, భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఈ ఉత్సవాలకు కనీసంగా మూడు లక్షల మంది యాత్రికులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టీటీడీ (TTD) అధికారులు అంచనా వేశారు. దీనికోసం ప్రత్యేక హైటెక్ (HighTeck ఏర్పాట్లు చేశారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కోసం యాత్రికులు ఎగబడిన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో గత నెల ఎనిమిద తేదీ ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన టీటీడీ అధికారులకు ఓ పాఠమే కాదు. చరిత్రలో మాయనిమచ్చగా మార్చారు. ప్రస్తుతం ఉన్న ఈఓ (Excutive Officer), అదనపు ఈఓ, సీవీఎస్వో (Chief Vigilence and Security Officer - CVSO), ఎస్పీ (గతంలోని అధికారులు) కూడా తిరుమల వ్యవహారాలకు పూర్తిగా కొత్త. అనుభవం ఉన్న అధికారులను మమేకం చేయడం, సమన్వయం సాధించడంలో జరిగిన అపసవ్య పరిస్థితి దుర్ఘటనకు దారి తీసింది. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకున్న టీటీడీ అధికారులు మళ్లీ విస్తృత సమీక్షలతో సూర్యజయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చేయాలని పటిష్ట ఏర్పాట్లు చేసింది.
తిరుమల మాడవీధుల్లో మలయప్పస్వామి విహరించే సమయంలో గ్యాలరీల్లో (Gallery) యాత్రకుల కోసం ముందస్తుగా టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని సభ్యులు, ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో అధికారులకు బాధ్యతలు వికేంద్రీకరించారు. తిరుమల ఆస్థాన మండపంలో అధికారులు, సిబ్బందిలతో టిటిడి ఈఓ, అదనపు ఈఓ, జేఈవో, ఇంఛార్జి సీవీఎస్వో, తిరుపతి ఎస్పీ మాట్లాడారు.

"రథసప్తమికి వచ్చే యాత్రికులకు సమష్టిగా సేవలు అందించండి" అని కోరారు.
1. మాడవీధులతో పాటు తిరుమలలో ఎల్ఈడీ స్క్రీన్లు (LED screens) ఏర్పాటు చేశారు.
2. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 130 గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు.
3. నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచీనీరు, పులిహోరా, సాంబారన్నం, పెరుగన్నం. పొంగలి వంటి ఆహార పదార్థాలు అందిస్తారు.
4. గ్యాలరీల్లో కూర్చొనే సుమారు మూడు లక్షల మందికి ఈ సేవలు అందించడానికి 3,500 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు.
5. మాడవీధుల్లోని ఎనిమిది ప్రధానగేట్ల వద్ద (నాలుగు ప్రధాన గేట్లు, నాలుగు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు) టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, ఎస్టీఎఫ్, సివిల్ పోలీస్, ఎన్సీసీ, స్కౌట్లు సిద్ధంగా ఉంటారు.

జర్మన్ షెడ్లు ఏర్పాటు
తిరుమల మాడవీధుల్లో ఉత్సవమూర్తలను పల్లకీపై ఊరేగించే సమయంలో గ్యాలరీల్లోని యాత్రికులు చలి, ఎండకు, వర్షానికి ఇబ్బంది లేకుండా గ్యాలరీల్లో జర్మన్‌ షెడ్లు (German sheds ) ఏర్పాటు చేశారు. శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తారు. వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ మాడ వీధులను రంగవళ్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బంది పడకుండా తెలుపురంగు వేశారు.

భక్తులకు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలందిస్తారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్‌ అధికారులకు విధులు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేస్తారు.

మూడు లక్షల మంది అంచనా..
తిరుమల నాలుగు మాడవీధుల్లో 200 గ్యాలరీలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల వేళ ఉదయం, రాత్రి నిర్వహించే వాహన సేవలు చూడడానికి కనీసంగా అంటే 1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు యాత్రికులు హాజరవుతారు. గరుడోత్సవం రోజు ఆ సంఖ్య ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వరకు ఉంటుంది. తాజా విషయానికి వస్తే..
రథసప్తమి సందర్భంగా ఒకో రోజు రెండు గంటల వ్యవధిలో ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్ప స్వామి ఏడు వాహనాలపై ఊరేగుతారు. దీంతో గ్యాలరీల్లో కూర్చొనే యాత్రికులు మూడు లక్షలకు పైగానే రావచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో నాలుగు మాడ వీధుల్లో 66 అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరాయంగా మంచినీరు, పాలు, మజ్జిగ అందివ్వనున్నారు. సమీప ప్రాంతాల్లో 351 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. గ్యాలరీల్లో యాత్రికులకు సేవలు అందించడానికి 3,500 మంది శ్రీవారి సేవకులు మాత్రమే సేవలు అందిస్తారు.
టీటీడీ ఇన్చార్జి సీవీఎస్వో మణికంఠ చందోలు ఏమంటున్నారంటే..

"మాడవీధులు, గ్యాలరీల్లో ఆధ్యాత్మిక ప్రశాంతతకు అవసరమైన చర్యలు తీసుకున్నాం" అని ఇన్ చార్జి సీవీఎస్వో మణికంఠ చందోలు స్పష్టం చేశారు. మాడవీధుల వెలుపల, సమీపంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంచామన్నారు. అగ్నిమాపక, వైద్యబృందాలు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు.
ఇదీ కార్యాచరణ
రథసప్తమి రోజు గ్యాలరీల్లో భక్తులకు అందించే సేవలపై ముందస్తుగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి గ్యాలరీకి ఇన్చార్జి తోపాటు , అన్ని శాఖల విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోలీసులు, విజిలెన్స్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకునే విధంగా ప్రతి ఉద్యోగి సంబంధిత విభాగాలతో ఎప్పటికప్పుడు సమాచారం అందించుకునే విధంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా అన్నదానం, పోలీసు, విజిలెన్స్, ఇంజినీరింగ్, వైద్య, ఆరోగ్య విభాగం, శానిటేషన్ శాఖల సిబ్బందితో కలిపి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేశారు. ఉద్యోగులు తమకు అప్పగించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు.
తిరుపతి ఎస్పీ హర్షవర్థనరాజు మాట్లాడుతూ,.

"టీటీడీ ఉద్యోగులు, పోలీసు, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం" చెప్పారు. వాహనసేవలు జరిగే సమయంలోనే కాకుండా, గ్యాలరీల్లో యాత్రికులను అనుమతించడం, బయటికి పంపించడంలో ఎక్కడా అపృతులకు ఆస్కారం లేకుండా పరస్పరం సమాచారం అందుకునే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేశాం" అని ఎస్పీ హర్షవర్థనరాజు స్పష్టం చేశారు.
సమన్వయం సహకారంతో...
సూక్ష్మ, స్థూల స్థాయిలో స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బందితో ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. ఆ దిశగానే తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు చేశారు. దీనిపై
అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఏమంటున్నారంటే..

"అనుభవంతో పాటు అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. అందరూ అప్రమత్తంగా అమలు చేస్తేనే విజయం సాధిస్తాం" అని అన్నారు గ్యాలరీల్లో అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది" అని వెంకయ్య చౌదరి గుర్తు చేశారు. "బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి స్ఫూర్తితో సేవలు అందించాలి" అని ఆయన కోరారు. రథసప్తమిలో వాహనసేవల మధ్య విరామ సమయంలో శానిటేషన్ కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Read More
Next Story