ఆమె కన్న కలలే నిజమయ్యాయి..  గేలి చేసిన కోటలో జనసేన గోల్
x

ఆమె కన్న కలలే నిజమయ్యాయి.. గేలి చేసిన కోటలో జనసేన గోల్

గేలి చేసిన నేతల కోటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గోల్ కొట్టారు! ఓ పంచాయతీ ఆయనకు ఎలా ప్రేరణ కల్పించింది. ఏడాది కిందట ఆమె చెప్పిన మాటలు ఎలా నిజమయ్యాయి?


కడప జిల్లాపై జనసేన దృష్టి నిలిపింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఈ జిల్లాపై జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించడానికి బలమైన కారణం కూడా ఉంది. పంచాయతీలపై మరింత ఆసక్తి పెంచుకోవడానికి మారుమూల పంచాయతీ మహిళా సర్పంచ్ ప్రేరణగా నిలిచారు.


రైల్వే కోడూరు మండలం మైసూరావాండ్లపల్లె పంచాయతీలో 2011 జానాభా లెక్కల ప్రకారం 2,368 మంది ఉంటే ఎస్సీలు 361 మంది, ఎస్టీలు 29, మిగతా వారంతా బలిజ (కాపు), బీసీ వర్గాలే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా, గ్రామస్తులు అండగా నిలవడంతో జనసేన మద్దతుతో కారుమంచి సంయుక్త సర్పంచ్ విజయం సాధించారు. ఏడాది కిందట ఆ మహిళా సర్పంచ్ నోటి నుంచి యాదృచ్ఛికంగా వ్యక్తం చేసిన అభిప్రాయం నిజమైంది. రాజకీయంగా అన్ని కలసిరావడంతో కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మైసూరావారిపల్లెకు రావడానికి అడుగులు వేయించాయని విషయం స్పష్టమైంది.


గేలి చేసిన చోటే..
ఆవిర్భావం నుంచి టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ ర్యాగింగ్ కు గురయ్యారు. కడప జిల్లాకు చెందిన మాజీ సీఎం వైఎస్. జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడిన విషయం తెలిసిందే. తనను రాజకీయంగా గేలి చేసిన కడప జిల్లా గడ్డపైనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోల్ కొట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనసేన ప్రస్థానం
రాష్ట్రంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. 2024 ఎన్నికల్లో సత్తాచాటి 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకొని స్థిరంగా నిలబడింది. అంతకుముందు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శలకు గురయ్యారు.
2019 సార్వత్రిక ఎన్నకలకు ముందు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు

"పోలవరంపై నాకు పూర్తి అవగాహన లేదు. పరిశీలించడానికి వచ్చా. అన్ని విషయాలు తెలుసుకుంటా" అని చెప్పడం ద్వారా, విమర్శలకు ఆస్కారం కల్పించారు. ప్రతి విషయానికి పవన్ కల్యాణ్ కు బదులు రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానాలు ఇచ్చేవారు. ఈ అంశాలపై అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ నేతలు రాజకీయంగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. ఈ అనుభవాలే పాఠాలుగా..

ఏడాది క్రితం...
2024 ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉండగానే.. పార్టీ శ్రేణులతో మమేకం కావడం, వారితో ఎక్కువ సేపు చర్చించడం వంటి అంశాలకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కోవలో..
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వేదికగా సర్పంచులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని జనసేన మద్దతుదారుల తోపాటు వివిధ పార్టీల సర్పంచులు కూడా హాజరయ్యారు. మహిళా సర్పంచుల మాటతీరు తెగువ ఎక్కువగా ప్రస్ఫుటించింది.
"పంచాయతీలకు నిధులు రావడం లేదు. గంటల వ్యవధిలో ఖజానా ఖాళీ అవుతోంది" అనే విషయాలను కూలంకషంగా సర్పంచులు వివరిస్తుండగా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాటన్నిటిని సావధానంగా నోట్స్ రాసుకున్నారు. ఆ కోవలో..
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరావారిపల్లె నుంచి జనసేన మద్దతుతో రాయలసీమలో విజయం సాధించిన ఏకైక మహిళా సర్పంచ్ కారుమంచి సంయుక్త కూడా హాజరయ్యారు.
"ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన నిధులు కూడా మరుసటి రోజుకు ఖాతాలో కనిపించ లేదు. ఇదేమంటే పాత బకాయిలకు జమ చేశారు" అని పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాధానాన్ని సంయుక్త వివరించారు.


"నేను పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయవద్దన్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు రూ.20 లక్షలు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాను. నా భర్త సరిహద్దుల్లో సిపాయిగా పనిచేశాడు. రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ఆశయం నాకు ముఖ్యం" అని వివరించారు. చివరగా ఆమె చెప్పిన మాట..
"జనసైనికులు సిద్ధంగా ఉన్నారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అభ్యర్థిని పోటీ చేయించండి. కచ్చితంగా గెలిపించుకుంటాం"
అని సూచన కూడా చేశారు.
సీన్ కట్ చేస్తే...
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడం, సీట్ల సర్దుబాటు జరిగింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకీ పెట్టని కోటగా ఉన్న రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు స్ధానంలో అభ్యర్థి సమస్యగా మారింది. అనడం కంటే నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. ఇదే అంశం జనసేనకు కలిసి వచ్చింది. ఈ సెగ్మెంట్లో ఉన్న నేతలకు తోడు టీడీపీ-జనసేన సమన్వయకర్తగా ముక్కా రూపానందరెడ్డి తృతీయశక్తిగా నిలిచారు. దీంతో ఆయన మద్దతు ప్రకటించిన మొదట యునమల భాస్కర్ కు అవకాశం దక్కింది. ఆయన మాజీ సీఎం వైఎస్. జగన్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ఉన్న ఫొటోలు వైరల్ కావడం వల్ల అభ్యర్థిత్వం రద్దు చేసి, ముక్కావారిపల్లు సర్పంచ్ అరవ శ్రీధర్ కు అవకాశం లభించింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో విప్ గా పనిచేసిన కొరముట్ల శ్రీనివాసులుపై జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ 11,101 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు.

రాయలసీమలో జనసేన మద్దతుతో గెలిచిన మైసూరవారిపల్లె సర్పంచ్ సంయుక్త ఏడాది కిందట చేసిన సూచన ఫలించడం వల్ల కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంశాలు జనసీన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎక్కువగా ప్రభావితం చేశాయని అంటున్నారు.
"రాజంపేట సమీనంలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల మా కుటుంబం కూడా నష్టపోయింది. పరిశీలించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్ వచ్చారు. ఆయనకు తమ పరిస్ధితి వివరించడానికి చొరవ తీసుకున్నా" అని సంయుక్త ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. నేను ప్రజల పక్షాన తీసుకున్న చొరవ జనసేన పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి దోహదం చేసిందని ఆమె అంటున్నారు. ఈ పరిణామాలు పార్టీ హైకమాండ్కు వివరించడంలో నేను సఫలం అయ్యాను" అనేది ఆమె మాట. అందువల్లే...

కలిసొచ్చిన అవకాశం
వైఎస్ఆర్ సీపీలో తనకు జరిగిన అవమానాలకు ప్రజల ద్వారానే చెక్ పెట్టే అవకాశం జనసేనకు లభించినట్టైంది. కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్. జగన్ కు ఆయన తండ్రి, తాత కాలం నుంచి ఫాలోయింగ్ ఉంది. ఎమ్మెల్యేగా కొరముట్ల శ్రీనివాసులు నాలుగుసార్లు గెలిచారు. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్థిని నిలపడం ద్వారా కూటమి నేతల సమన్వయం, సహకారంతో విజయం సాధించండం ద్వారా "తనను ర్యాగింగ్ చేసిన వారిని, వారి కోటలోనే గోల్ చేశారు" అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

"రాజకీయంగా ఎదుర్కొంటాం. మినహా ప్రతీకార దాడులు ఉండవు. ప్రజలు అధికారం ఇచ్చింది కూడా అందుకే" అని అధికారంలోకి రాగానే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఇవి. ఆ మేరకే తమ పనితీరు ఉంటుందనే రీతిలో చాపకింద నీరులా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వ్యవహరిస్తున్నట్లు పరిశీలికులు అంచనా వేస్తున్నారు. అందువల్లే తనను గెలిపించిన పిఠాపురం, కోస్తా ప్రాంతాన్ని కాదని పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రధానంగా కడప జిల్లాలో ఫోకస్ పెట్టే విధంగా మారుమూల పంచాయతీకి రావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామాలపై

సర్పంచ్ సంయుక్త స్పందించారు. "నా భర్త మిలీటరీలో పనిచేశారు. మాకు ఆదర్శాలు ఉన్నాయి. జనసేన నేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చాయి. గ్రామస్తుల సహకారం ఉంది. అందుకే ఆ పార్టీలో ఉన్నాను" అని సంయుక్త ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. పంచాయతీకి నిధులు ఇచ్చారు. ఇవి రాకముందే ఇప్పటి వరకు గ్రామంలో 150 మీటర్లు మురుగునీటి కాలువలు నిర్మించా. నాలుగు బోర్లు తవ్వించా. గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు ఇస్తున్నాం. పారిశుద్ధ్యం చక్కగా నిర్వహిస్తున్నా. నా కుటుంబ జీవనం కోసం చిన్నపాటి దుస్తుల దుకాణంతో జీవనం సాగిస్తూనే, సర్పంచ్ పదవికి న్యాయం చేస్తున్నా" అని చెప్పారు.


" నా భర్త కారుమచి వెంకటసుబ్బయ్య మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాక, రైల్వే కోడూరు మండల బీజేపీ నేతగా ఉండేవారు. రోడ్డు ప్రమదంతో మరణించారు. ఇద్దరి పిల్లల బాధ్యత చూసుకుంటున్నా. ఆయన మిలిటరీలో ఉన్నప్పటి నుంచి అన్ని పనులు సర్దుకునే ధైర్యం వచ్చింది. నా భర్త రాజకీయాల్లో ఉండడం కూడా నాపై ప్రభావం చూపింది" అని సంయుక్త వివరించారు. ఆయన బాటలోనే ప్రజలకు మంచి చేసేందుకు నాకు సర్పంచ్ పదవి దక్కింది. జనసేన అండతో మరిన్ని మంచి పనులు చేస్తా అని ఆమె అంటున్నారు. పంచాయతీలకు సంబంధించి, పార్టీ మంగళగిరిలో ఏ కార్యక్రమం నిర్వహించినా, నాకు మొదట ఆహ్వానం వస్తుంది. ఇంతకంటే నాకు ఏమి గుర్తింపు కావాలి? అనేది ఆమె మాట. రానున్న కాలంలో రాజకీయంగా ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.
Read More
Next Story