శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై ఈఓ స్వరం మారిందా?
x

శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై ఈఓ స్వరం మారిందా?

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో ఆరోపణలపై ఈఓ నాలుక మడత వేశారా ? గుజరాత్ రిపోర్ట్ కు సహేతుక ఉందా? మైసూరు నివేదిక ఏమైంది.


తిరుమల కేంద్రంగా లడ్డు వ్యవహారంపై రాజకీయాలు కేంద్రీకృతం అయ్యాయి. శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరీక్షించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మైసూరు ల్యాబ్ ప్రధానమైంది. ఆ నివేదిక ఇంతవరకు బయటికి రాలేదు. ఈఓ శ్యామలరావు, టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గుజరాత్ ఎన్డీడీబీ ప్రయివేటు ల్యాబ్ నివేదికల ఆధారంగా వివరాల్లో అదనంగా ఎందుకు చేర్చారు? ఎందుకు మాట మార్చారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య రాజకీయ రగడకు తిరుమల క్షేత్రం కేంద్రీకృతమైంది.
టీటీడీ ఈఓ మొదట ఏమన్నారు?
ఈ ప్రకంపనాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించిన తీరు వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో టీటీడీ ఈఓ జే. శ్యామలరావు రెండునెలల కిందట చెప్పిన మాటకు శుక్రవారం చేసిన ప్రకటన మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది.
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఆరోపణలు విమర్శల నేపథ్యంలో ఎవరు చెబుతున్నది నిజం. అధికారుల ఇస్తున్న వివరణలో మాట ఎందుకు మారింది. పరస్పర విరుద్ధమైన ల్యాబ్ నివేదికల వెనక నిగూఢంగా ఉన్న రాజకీయ పరమార్ధం ఏమిటి అనేది ఒకసారి పరిశీలిద్దాం..
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లేని నెయ్యి వాడారు. అనేది బహిరంగ రహస్యం. దీనిపై ప్రతిపక్షాలు ఆధారాలు సేకరించలేదు. దానిని పట్టించుకోలేదు. టీడీపీ కూడా అప్పట్లో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. తిరుమల లడ్డూ ప్రసాదంలోనే కాకుండా అన్నదానంలో కూడా నాణ్యత లోపించింది. ప్రమాణాలు ప్రాటించడం లేదని విమర్శలు చేశారు. ఈ విషయంలో ఎక్కడ నిజనిర్ధారణ చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. కాగా

ప్రక్షాలనపై దృష్టి

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఐదేళ్లు రాష్ట్రంలో వైసీపీ పాలన సాగింది. వైఎస్. జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అవినీతి, అక్రమాలపై టీడీపీ కూటమి దృష్టి సారించింది. ప్రక్షాళన పేరుతో అధికారులను కూడా మార్పు చేసింది. అది పరిపాలనలో భాగం. టీటీడీ ఈఓగా జీ. శ్యామలరావును నియమించారు. ఆయన తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంపై దృష్టి నిలిపారు. ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుని, సఫలమయ్యారు. అదే సమయంలో నాణ్యత కొరవడిందలే ఆరోపణలు వినిపిస్తున్న లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి నాణ్యతపై విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటివరకు తమిళనాడు రాష్ట్రం దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న నెయ్యి ట్యాంకర్ పరీక్షించారు.
జూలై8: నెయ్యి శాంపిల్స్ పరీక్షలకు పంపించారు.
16వ తేదీ: ఆ శాంపిల్స్ నివేదిక అందింది.
దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు ఏమన్నారంటే...
"నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ ఆనవాళ్లు ఉన్నాయి" అని ప్రకటించారు. "నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ ప్రతినిధులకు నోటీసు ఇచ్చాం. రెండు ట్యాంకర్లు వెనక్కు పంపించాం" అని ఈఓ శ్యామలరావు స్పష్టంగా చెప్పారు.
మాట మారింది

సెప్టెంబర్ 18: సరిగ్గా రెండు నెలల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ " తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిపారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య" అని తీవ్రస్థాయిలో మధనపడుతూనే, గత వైసీపీ పాలనలో సీఎం వైఎస్. జగన్ వ్యవహారం వల్ల ఇది జరిగింది" అని ఆరోపణలు చేశారు. దీంతో శ్రీవారి భక్తులను కలవరానికి గురి చేశారు.
భారీ ట్విస్ట్.. మైసూర్ రిపోర్ట్ ఎక్కడ?
సాధారణంగా టీటీడీ కొనుగోలు చేసు వస్తువులు ప్రధానంగా నెయ్యి, నూనె వంటి పదార్థాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మైసూరు ల్యాబ్ లో పరీక్షిస్తారు. తాజా ఆరోపణల నేపధ్యంలో గుజరాత్ ల్యాబ్ కు పంపినట్లే అదే రోజు మైసూరులోని ల్యాబ్ కు కూడా శాంపిల్స్ పంపించారు. గుజరాత్ నివేదిక వచ్చిన రోజూ మైసూరు నుంచి కూడా నివేదిక అందినా, ఇంతవరక దానిని బయటకు రానివ్వడం లేదు. గుజరాత్ శాంపిల్ టెస్టు మాత్రమే వెల్లడించారు.
దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ,
"నెయ్యిలో కల్తీ వ్యవహారంపై గుజరాత్ ఎన్డీడీడీబీ ల్యాబ్ నివేదికనే వెలుగులోకి తెచ్చారు. ఇక్కడి కోరుకున్నట్లు నివేదిక అందే అవకాశం ఉంది. మైసూరు ల్యాబ్లో పప్పులు ఉడకవు" అందువల్లే రాజకీయ కారణాల నేపథ్యంలో మైసూరు నివేదిక బయటపెడితే వాస్తవాలు తేలతాయి" అని ఓ అధికారి స్పష్టం చేశారు.
టీటీడీ మౌనం
టీటీడీపై సోషల్ మీడియా, రాజకీయ ప్రతినిధులు చేసే ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందిస్తారు. ఈ ధార్మిక సంస్థ అధికార ప్రతినిధులుగా చీఫ్ పీఆర్వో, ఏపీఆర్ఓ వివరణలు తో కూడిన ప్రకటన జారీ చేస్తారు. కానీ, లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వుతో కూడిన నెయ్యి వాడారనే ఆరోపణల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేదు. టీటీడీ ఈవో జే శ్యామలరావు నివేదికలు బయట పెట్టలేదు. ఓ ప్రకటన కూడా జారీ చేయలేదు.
48 గంటల తర్వాత

ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు సంచలన ఆరోపణల తర్వాత 48 గంటలు అంటే రెండు రోజుల తర్వాత టీటీడీ ఈఓ జే. శ్యామలరావు తిరుమలలో హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లో డొల్లతనం బాహాటంగా బట్టబయలైంది.
రెండు నెలల క్రితం చేసిన ప్రకటనకు, శనివారం చెప్పిన తీరుకు పరస్పర విరుద్ధంగా ఉంది.
మొదట ఆయన "నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్స్, వనస్పతి లాంటి ద్రవాల మూలాలు కనిపించాయి" అని చెప్పారు. సీఎం చంద్రబాబు మాటలను నిర్ధారిస్తున్నట్లుగా, నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనెతో కలిసిన నెయ్యి వాడారు" అని అదనంగా మాట చేర్చారు. అంటే, రాజకీయ వ్యవహారాల నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు మాటలు చేర్చడానికి ప్రకటన చేసినట్లు ఇక్కడ గమనించవచ్చు.
సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటనలో రెండు రోజుల క్రితం" ఆవు నెయ్యిలో పంది కొవ్వు కూడా కలిపారు" అని కూడా తండ్రి ఆరోపణలను మరింతగా ముందుకు కొనసాగించారు.
టీటీడీ ఈవో శ్యామల రావు మీడియా సమావేశంలో, నారా లోకేష్ చెప్పిన మాటలను ఎక్కడ ధృవీకరించకపోవడం గమనించుదగ్గ విషయం.
టీటీడీకి రాష్ట్రంలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, తిరుప్పారావ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తోపాటు తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి సరఫరా అవుతుంది.
" మిగతా సంస్థల మాదిరి కాకుండా తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్స్ నెయ్యి పరిశీలించినప్పుడు కల్తీ జరిగినట్లు నివేదిక వచ్చింది" అని టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రెండు నెలల కిందట చెప్పిన మాటకు ఇప్పటికీ వ్యత్యాసం ఉండడమే ఇక్కడ గమనార్హం.
ఏ ఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లోపించిన సాంకేతిక అంశాలను ఇవ్వు శ్యామలరావు వెల్లడించారు." నెయ్యిలో ప్రమాణాలు తగ్గాయి. నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి 'ఎస్ విలువ' 95.68 నుంచి 14.3 రెడ్డు మధ్య ఉండాలి. పరీక్షల్లో
ఎన్డీడిపి కాఫ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ విలువ 20.32 ఉన్నట్లు తేలింది" ఇది చాలా తక్కువ కావడం వల్ల నాణ్యత లేదని గుర్తించి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను బ్లాక్లిస్టులో పెట్టాం. అనేది టీటీడీ ఈవో శ్యామలరావు వివరణ.
ఇంకా ఏమన్నారంటే...
"తిరుమలలో ల్యాబ్ టెస్ట్ లేదు. ఇది ఏర్పాటు చేయడానికి రూ.75 లక్షలు అవుతుంది. దీనికి గుజరాత్ ఎన్డీడీబీ సహకారం అందిస్తుంది" అని చెప్పారు.
ఇందులో కూడా డొల్లతనమే. తిరుమలలో వస్తువుల నాణ్యతా ప్రమాణాలే కాదు. బయటి ల్యాబ్ లో పరీక్షించిన వస్తవులు క్రాస్ చెక్ చెయడానికి కూడా ల్యాబ్ ఉం దనే విషయాన్ని చెప్పలేకపోయారు.
"టీటీడీలో సీనియర్ల సలహాలు తీసుకోకపోవడమే దీనికి కారణం" అని సీనియర్ అధికార ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదంతా గతించిన వ్యవహారం..
రెండు నెలల తర్వాత సీఎం ఎన్ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటి? అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆ నాలుగు ప్రైవేటు డైరీలతో ఒప్పందం జరిగింది. అంటే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేసరికి కూడా అదే ఒప్పందం అమలు జరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టిడిపి కూటమి ప్రభుత్వంలో సమీక్షించారు. చర్యలు తీసుకున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై ఇప్పుడు రాజకీయంగా తెరమీదకు తీసుకురావడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. మొత్తానికి ఎపిసోడ్లో ఈవో శ్యామలరావు అనుసరించిన పద్ధతులు సవ్యంగా ఉన్నప్పటికీ, రాజకీయ కారణాల నేపథ్యంలోనే 48 గంటల పాటు మౌనంగా ఉండడం, నివేదికలో వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు కు అనుకూలంగా మాట్లాడారనే విషయం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి.
( మైసూర్ ల్యాబ్ ఉండగా, గుజరాత్ ల్యాబ్ నివేదిక ఎందుకు తీసుకున్నారు. ఈ అంశాలపై మరో కథనంలో సమగ్ర వివరాలు)


Read More
Next Story