పరిగెత్త లేకపోతే లాఠీలతో చితకబాదుతారా?
ఇంతటి అరాచకం నేను చూడలేదు. అందుకే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు వైఎస్ఆర్సిపి కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి గుణశేఖర్ నాయుడు వెల్లడించారు.
"విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నా. ఆ తర్వాత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ఇంతటి అరాచకాలు నా జీవితంలో చూడలేదు. అందుకే అధికార పార్టీకి గుడ్ బై చెబుతున్నాను" అని గుణశేఖర్ నాయుడు ప్రకటించారు.
2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత, ఈవీఎంలను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద భద్రపరిచారు. 14వ తేదీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలించి వస్తున్న టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సంఘటన చూడడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణశేఖర్ నాయుడిపై పారా మిలటరీ దళాలు విచక్షణ రహితంగా లాఠీఛార్జ్ చేశారు. అంతకుముందు తిరుపతి జర్నలిస్టులు కూడా అనేక మంది గాయపడ్డారు. లాఠీ ఛార్జ్ సంఘటనపై కొందరు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
"ఈ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసింది" అని గుణశేఖర్ నాయుడు తన ఆవేదనను పంచుకున్నారు. ‘‘మా బంధువులంతా టిడిపిలో ఉన్నప్పటికీ, వామపక్ష పార్టీల నుంచి తప్పుకున్న తర్వాత నేను నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో చురకైనా కార్యకర్తగా, నాయకుడిగా ఎదిగాను’’ అని గుణశేఖర్ నాయుడు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ముద్ర వేయించుకున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చోటు చేసుకున్న పరిణామాలపై గుణశేఖర్ నాయుడు.. ఫెడరల్‌తో మాట్లాడుతూ..
"టిడిపి అభ్యర్థి పులివర్తి సోదరునికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేశా. కానీ ఆయన రాజకీయాలు ఆయనవి. నా పద్ధతి నాది. ఇలాగే దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న’’ అని గుణశేఖర్ నాయుడు చెప్పారు. "పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద పులివర్తి నాని పై హత్యాయత్నం జరిగిందంట అనే విషయం తెలిసిన వెంటనే ఏమి జరిగిందో తెలుసుకుందామని అక్కడికి వెళ్లానని, ఆ సందర్భంగా పారా మిలటరీ దళాలు పోలీసులు విచక్షణ రహితంగా చేసిన దాడి తనను తీవ్రంగా కలచి వేసింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఐదు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో కూడా నేను వైఎస్ఆర్‌సీపీకి అంకితమైన కార్యకర్తలా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించడంలో నా పాత్ర నిర్వహించా, ఈ విషయం జిల్లాలోని వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులకు కూడా బాగా తెలుసు’’ అని ఆయన గుర్తు చేశారు. ‘‘విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, వామపక్ష పార్టీల్లో పని చేసిన సందర్భంలో ప్రజా సమస్యలపై నేను ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నా. అయితే వైఎస్ఆర్సిపి అరాచక ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు, లాఠీ ఛార్జీ దారుణమైంద’’ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరిపి దోషులు బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఐదేళ్లుగా జరిగిన సంఘటనలు, పాలకుల తీరు, పోలీసుల వ్యవహార సరళి తీవ్రంగా కలచివేసింది. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నా’’ అని ఆయన ఉద్రేకంగా వ్యాఖ్యానించారు. ‘‘తనపై పోలీసుల దాడి తర్వాత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలుస్తారు. ఇంత దారుణానికి వడి కట్టడం ఎంత మాత్రం సమంజసం’’ అని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బుచ్చినాయినిపల్లెకు చెందిన గుణశేఖర్ నాయుడు ఏఐఎస్ఎఫ్‌లో చురుగ్గా పనిచేశారు. పదో తరగతిలో ఎస్‌పిఎల్‌గా, ఇంటర్మీడియట్‌లో విద్యార్థి నాయకుడుగా పనిచేసిన ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ చైర్మన్‌గా కూడా ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత..
కాంగ్రెస్ పార్టీలోకి..
సాధారణంగా కులాలను ప్రామాణికంగా తీసుకుని చాలామంది పార్టీ నిర్ధారిస్తూ ఉంటారు. అభ్యుదయ భావాలతో రాజకీయాల్లోకి వచ్చిన గుణశేఖర్ నాయుడుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా వచ్చాక అమలు చేసిన పథకాలతో స్పందించిన గుణశేఖర్ నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి అత్యంత విశ్వసనీయ భక్తుడిగా ఆయన పనిచేశారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకొని చిత్తూరు జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా కూడా మెరుగైన సేవలు అందించారు. స్వల్ప కాలంలోనే ఆయన డాక్టర్ వైయస్సార్ అనుచరుడిగా ముద్రపడ్డారు. వైయస్సార్ అకాల మరణం తర్వాత గుణశేఖర్ నాయుడు.. వైయస్సార్సీపీలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు. అంతకుముందే వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన సూచనల మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం కోసం మొదటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13వ తేదీ జరిగిన పోలింగ్ లో కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయం కోసం చేసిన కృషిని గుణశేఖర్ నాయుడు ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు.