హైదరాబాద్ తరహా అభివృద్ధి కావాలని... గ్రేటర్ తిరుపతికి పచ్చా జెండా..
x
తిరుపతి నగర కౌన్సిల్ సమావేశంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీ కార్పొరేటర్లు

హైదరాబాద్ తరహా అభివృద్ధి కావాలని... 'గ్రేటర్ తిరుపతి'కి పచ్చా జెండా..

మేయర్ డాక్టర్ శిరీష ప్రతిపాదనకు నగర కౌన్సిల్ ఆమోదం.


గ్రేటర్ తిరుపతి కోసం 63 పంచాయతీలకు బదులు 53 గ్రామాలకే కుదించారు. పది లక్షల జనాభా ఉండే విధంగా సరిహద్దులు నిర్ణయించాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

ఆధ్మాత్మిక కేంద్రం తిరుపతిని గ్రేటర్ స్థాయికి మార్చే ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నగర పాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాలులో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నగర మేయర్ డాక్టర్ శిరీష్ గ్రేటర్ పరిధిలోకి పది పంచాయతీల విలీన ప్రతిపాదనపై తీర్మానం ప్రవేశపెట్టారు.


గతంలో నిర్వహించిన సమావేశంలో 63 పంచాయతీలతో తయారు చేసిన ముసాయిదా ప్రతిపాదన మళ్లీ సమీక్షించారు. 53 పంచాయతీలను విలీనం చేయడం ద్వారా గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకోసం తీర్మానించారు. ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైసీపీ, బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల మధ్య యథావిధిగానే వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి.

తిరుపతి నగర పాలక సంస్థ సమావేశంలో కార్పొరేటర్ల తోపాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎంఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర కమిషనర్ మౌర్య అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

"ప్రభుత్వ ప్రతిపాదనకు పరిపుష్ఠి కల్పించడానికే సవరణ తీర్మానం. మన ప్రతిపాదనలు భవిష్యత్తులో ప్రశ్నార్ధకం కాకూడదు. సరైన నిర్ణయాలు చేయలేదన్న అపవాదు మన మీద రాకూడదు" అని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. మన తిరుపతి నగరం మహానగరంగా ఎందుకు మారాలి? మార్పునకు ప్రామాణికంగా ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలనేది ముఖ్యమని ఆమె అన్నారు.
పది లక్షల జనాభా ఉండాలి..
గ్రేటర్ తిరుపతిలో పది లక్షల మంది జనాభా ఉండే విధంగా సరిహద్దులు గుర్తించాలని వైసీపీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. మంగళవారం చేసిన తీర్మానం ప్రకారం 8.5 లక్షల మందికే ప్రాంతాలు పరిమితం కావడం వల్ల పూర్తిస్థాయిలో మేలు జరగకపోవచ్చని వైసీపీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. దీంతో సభలో కాసేపు రభస చోటుచేసుకుంది.
మొదట ప్రతిపాదించిన ప్రతిపాదనలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సుముఖత చూపకపోవడంతో గ్రేటర్ తిరుపతి తీర్మానంపై నీలినీడలు వ్యాపించాయి. వారి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సవరణతో కూడిన గ్రామాల విలీనం ప్రతిపాదించారు. అందులో గతంలో నిర్ణయించిన పది పంచాతీలు జాబితా నుంచి తొలగించడం, ఆ స్థానంలో మరో పది పంచాయతీలతో సరిహద్దులు నిర్ణయించి, ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్మానించారు.

ఆ ఊహే సాధ్యం కాదు..
టిటిడితో సంబంధం లేని తిరుపతిని ఊహించుకోలేం. శ్రీవారి భక్తుల రాకపోకలు, వసతుల కల్పన కూడా కీలకం. స్థూలంగా ప్రస్తుత నగరంపై ఒత్తిడి తగ్గాలి.. తగ్గే ఒత్తిడి విలీన ప్రాంత అభివృద్ధికి దోహదం చేయాలి అని మేయర్ డాక్టర్ శిరీష వ్యాఖ్యానించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
"గ్రేటర్ హైదరాబాద్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. దివంగత సీఎం వైఎస్ఆర్ గ్రేటర్ హైదరాబాద్ చేసినప్పుడు కోర్ హైదరాబాదుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, 10 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఐటెక్ సిటీకి కిలోమీటర్ల దూరంలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నిర్మాణం చేశారు" అని గుర్తు చేశారు.
యాత్రికులకు సదుపాయాల కోసం..
తిరుపతి నగరంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న శ్రీవారి భక్తుల రాకపోకలు తమిళనాడు నుంచి పుత్తూరు వైపు, కర్ణాటక నుంచి చంద్రగిరి వైపు, ఏపీ నుంచి శ్రీకాళహస్తి వైపు మార్గాలు ఉన్నాయనే విషయాన్ని మేయర్ శిరీష గుర్తు చేశారు. భవిష్యత్తులో అందుకు అనుగుణంగా వారికి సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అందుకు అనుగుణంగా ఉండాలన్నారు.
"నగర పాలక సంస్థకు ప్రధానంగా భూమి సమస్య ఉందనీ, నగర పరిధిలో టిటిడి, మఠం భూములే ఉన్నాయన్నారు. గ్రేటర్ తిరుపతిలో వీలైనంత ప్రభుత్వ భూమి అందుబాటులోకి వచ్చే విధంగా ఆలోచించాలి" అని అన్నారు.
గ్రేటర్ పరిధి..
తిరుపతి నగరానికి నాలుగు వైపులా విస్తరణ ఉండాలి. చంద్రగిరి వైపు కల్యాణి డ్యామ్ వరకు రామచంద్రపురం మండలం రాయలచెరువు వరకు ఉండాలి. కల్యాణి డ్యామ్ మన నీటి సరఫరాకు కీలకం. అలాంటి డ్యాం నగర పరిధిలో లేకుంటే క్లిష్ట సమయంలో నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. రామాపురం వద్ద వెస్ట్ మేనేజ్ మెంట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డాయో అందరికీ తెలుసు అదే విధంగా రాయలచెరువు నగర పరిధిలోకి వస్తె భవిష్యత్తు నీటి సరఫరాకు ఎంతో ప్రయోజనం ఉంటుందని మేయర్ శిరీష వివరించారు.
"తిరుపతి ఎయిర్ పోర్టు కు సమీపంలో ఉండటం, ఉద్యోగులకు వడమాలపేట మండలం అంజెరమ్మ కనం వద్ద ఐదు వేల మంది కి ఇళ్ల స్థలాలు టిటిడి ఇచ్చింది. ఇదే ప్రాంతంలో మిగిలిన వారికి ఇచ్చే ఆలోచన ఉన్నది. దాదాపు 10 వేల మంది తో టైన్ షిప్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. మరో వైపు తమిళనాడు భక్తులు రాకపోకలు జరిగే ప్రాంతం కాబట్టి అక్కడి వరకు విస్తరణ, ఐఐటీ పరిధి వరకు మన సరిహద్దులు ఉండాలి" అని గ్రేటర్ తిరుపతిపై వివరణ ఇచ్చారు. ఈ మొత్తం ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్, వెస్ట్ స్టేషన్, చంద్రగిరి, తిరుచానూరు, రేణిగుంట, ఏర్పేడు రైల్వేస్టేషన్లు నగర పరిధిలోకి వస్తాయి. రాయలచెరువు, మల్లిమడుగు, కల్యాణి డ్యామ్, విస్తారంగా చెరువులు, ప్రభుత్వ భూమి మనకు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు.
మేయర్ ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి విస్తరణ ప్రతిపాదనపై సభ్యులు సానుకూలంగా స్పందించడంతో కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు.
జనాభా 10 లక్షలకు పెంచండి
గ్రేటర్ తిరుపతి కోసం చేసిన తీర్మానంలో జనాభా 7.6 లక్షలకు చేరుతుందని వెల్లడించారు. ఈ సంఖ్య 10 లక్షలు ఉండాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీనివల్ల తిరుపతి అభివృద్ధికి నిధులు ఎక్కువ వస్తాయనే విషయాన్ని ప్రస్తావించారు. ఎక్కువ గ్రామాలు ఉండడం వల్ల నగర పరిధి పెరగడం, కేంద్రం నుంచి మరిన్ని నిధులు, పథకాలు సాధించే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. తిరుపతి, పరిసర గ్రామాలన్నీ అభివృద్ధి వలయంలోకి రావాలని డిమాండ్ చేశారు.
Read More
Next Story