
TTD } ఆ.. అన్యమతస్తులను సాగనంపండి.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
2018లోనే పడిన పునాది. 29 మంది TTD ఉద్యోగులకు సంకటం. 2024 డిసెంబర్ 21 ఉత్తర్వుల మాటేమిటి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఇతర మత ఉద్యోగులను తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2018 సంవత్సరంలో పడిన ఈ పునాది ఆరేళ్ల తరువాత టిటిడిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 40 మంది హిందూయేతర ఉద్యోగులు ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో 29 మంది మాత్రమే సర్వీసులో ఉండగా, ఇటీవల ఏడుగురిని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. టీటీడీ బోర్డు సూచన, సిఫారసు మేరకు వారందరికీ ప్రభుత్వం ఓ ఆఫర్ ఇచ్చింది.
"స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తే సర్వీసు కాలానికి సంబంధించిన అన్ని చెల్లింపులు ఒకేసారి పూర్తి చేస్తాం. లేదంటే ప్రభుత్వంలోని ఇతర శాఖలకు బదిలీ చేస్తాం" అని తేల్చి చెప్పింది.
టీటీడీలో ఈ వ్యవహారం 2018లో టీడీపీ ప్రభుత్వంలోనే పునాది పడింది. వైసీపీ ప్రభుత్వంలో స్తబ్దతగా ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ తెరమీదకు తీసుకుని రావడం ద్వారా దళితుల ఉద్యోగుల్లో అన్యమంత ఆచరిస్తున్నవారిపై ఫోకస్ పెట్టారు.ఈ విషయం మళ్లీ చర్చిద్దాం.
టీటీడీ బోర్డు సిఫారసుతో..
టీటీడీ పాలక మండలి ఈ సంవత్సరం నవంబర్ నెలలో చేసిన సిఫారసు ఆ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవి అమలు చేయడం సాధ్యమేనా అనే సందేహం కూడా తెరపైకి వచ్చింది. కారణం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అన్యమత ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై పీటముడి పడిందని భావిస్తున్న తరుణంలో తాజా ఆదేశాలతో కలవరం బయలుదేరింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తమకు అనుకూలంగానే ఉన్న విషయాన్ని కూడా బాధిత ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
"ఇది అంత సులువైన విషయం కాదు. ఉద్యోగ నియామకాలు జరిగినప్పుడు ఏమి చేశారు? సర్టిఫికెట్లు పరీశీలించిన తరువాత, ఎస్సీలు అని నిర్ధారణ అయిన తరువాతే కదా, ఆదేశాలు ఇచ్చారు" అని టీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
చైర్మన్ పక్కా అజెండా..
టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను సాగనంపడానికి తన అజెండా అమలు చేస్తానని చైర్మన్ పదవి చేపట్టడానికి ముందే బిఆర్. నాయుడు 2024లో తన విధానం ప్రకటించారు. టీటీడీలో అమలు చేయాల్సిన కార్యక్రమాల అజెండాను కూడా ముందుగానే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన తరువా ఆయన ఆదేశాలతో టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం దర్యాప్తు కూడా చేసింది.
టీటీడీ ఉద్యోగుల కోసం తిరుమల, తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్, పరిపాలనా భవనం వెనుక ఉన్న అధికారుల నివాసాలు, ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్న ఉద్యోగుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్న ఉద్యోగులను కూడా విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఆ మేరకు టిటిడి పాలకమండలికి విజిలెన్స్ విభాగం ఈ సంవత్సరం ప్రారంభంలోనే నివేదిక అందజేసింది.
40 మంది ఉన్నట్లు నిర్ధారణ
టీటీడీలో హిందువేతర ఉద్యోగులు దాదాపు 40 మంది ఉన్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అభిప్రాయాన్ని గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి కూడా వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి టీటీడీలో గుర్తించిన అన్యమత ఉద్యోగులను తన కార్యాలయానికి పిలిపించిన టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు చర్చించారు.
"శ్రీవారి కొలువులో ఉంటూ అన్యమతాన్ని ఆచరించడం తప్పు.స్వచ్ఛంద పదవీ విరమణ చేయండి" అని కూడా నాయుడు సూచించారు. దీనికి అన్యమత ఉద్యోగులనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సుముఖత వ్యక్తం చేయలేదు. తమ చర్యల వల్ల న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో టీటీడీ పాలకమండలి చైర్మన్ ప్రత్యామ్నాయ సూచన చేశారు. ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తామని కూడా నాయుడు చెప్పారు.
ఉన్నది 29 మందే..
టీటీడీలో అన్యమత ఉద్యోగులు 42 మందిని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వారిలో రిటైర్మెంట్లు, కొందరు చనిపోయిన కారణంగా 29 మంది మాత్రమే ఉన్నట్లు బాధిత ఉద్యోగుల ద్వారా తెలిసింది. గత నెలలో కూడా మరో ఏడుగురికి అన్యమతస్తుల ముద్ర వేసి, నోటీసులు జారీ చేసినట్లు కూడా బాధితుల ద్వారా తెలిసిన సమాచారం. కాగా,
మొదటి దశ చర్యలు
టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి తప్పించారు. వారిలో చాలామందిని టిటిడి అనుబంధ విభాగాల్లోని కార్యాలయాల్లో సేవలు అందించే విధంగా విధులు కేటాయించారు. దేవస్థానంలో పనిచేస్తున్న ఇతర మత ఉద్యోగులను ఎలాగైనా సరే సాగనంపడానికే పాలకమండలి కట్టుబడి ఉందనే విషయం స్పష్టమైంది.
నలుగురి సస్పెన్షన్
టిటిడిలో పనిచేస్తూ అన్ని మతాన్ని ఆచరిస్తున్న వారిపై అధికారులు మొదటిసారి వేటు వేశారు. ఈ సంవత్సరం మే 29వ తేదీ నలుగురు అధికారులు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత గుర్తించిన ఉద్యోగుల తీరుపై నిఘా పెట్టారు. వారి నుంచి ఎటువంటి మార్పు కనిపించకపోగా, టీటీడీ ప్రతిపాదించిన విధానంపై సుముఖంగా లేకపోవడం తో ఆ ఉద్యోగులను టీటీడీ నుంచి తప్పించాలని నిర్ణయాన్ని అమలు చేయాలని సంకల్పించారు.
"టీటీడీ పెద్దల ప్రతిపాదన మేరకు స్వచ్ఛంద పదవీ విరమణకు బర్డ్స్ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు స్టాఫ్ నర్సులు దరఖాస్తు చేశారు. వారిద్దరినీ సస్పెండ్ చేయడం దారుణం" అని టీటీడీ ఉద్యోగుల సంఘం మాజీ కోశాధికారి చెప్పారు.
ప్రభుత్వానికి బోర్డు తీర్మానం
టీటీడీలో పనిచేస్తున్న ఈ సంవత్సరం మే 20వ తేదీ జరిగిన పాలకమండలి సమావేశంలో మొదటి చర్చించారు.
"29 మంది అన్యమత ఉద్యోగులతో స్వచ్ఛంద పదవి విరమణ చేయించాలని తీర్మానించారు. వారికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తామని" కూడా ప్రకటించారు. ప్రస్తుత టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడుతో కలిసి అప్పటి టిటిడి కార్యనిర్వహణాధికారి జే. శ్యామలరావు మీడియాకు ఈ విషయాలు చెప్పారు. తమ ప్రతిపాదనకు ముందు వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని జూన్ నెలలో నిర్వహించిన బోర్డు మీటింగ్లో చర్చించారు.
ప్రభుత్వానికి సిఫారసు
టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులపై చర్యలకు పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్లు ప్రచారం జరుగుతోంది.
"అన్యమత ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించండి. వారి సర్వీస్ కాలానికి జీతభత్యాలు ఒకేసారి చెల్లిస్తాం. లేదంటే, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తాం" అని నిర్ణయం తీసుకుని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఆదేశాలు మళ్లీ ప్రకంపనలు సృష్టించాయి.
పునాది ఎప్పుడు పడింది..?
2018లో టీడీపీ ప్రభుత్వ కాలంలోనే అప్పుడు, ఇప్పుడు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఉండగానే ఈ విషయం తెరమీదకు వచ్చింది. 2018లో అన్యమత ఉద్యోగులను గుర్తించడం తోపాటు వారికి నోటీసులు జారీ చేశారు. 2020లో ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి పింఛన్ సెటిల్ చేయని కారణంగా కోర్డును ఆశ్రయించారు. దీంతో 2022లో ఆయనకు బెనిఫిట్స్ చెల్లించాలని కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో ఆ తరువాత అన్యమత ఉద్యోగుల సమస్య నలుగుతూనే ఉంది.
"టీటీడీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పదోన్నతులకు పదోన్నతి కల్పించడం, పింఛన్ల మంజూరు చేయకుండా ఆపిన విషయంలోనే హైకోర్టులో కేసు నడుస్తోంది" అని బాధిత ఉద్యోగులు చెప్పిన సమాచారం.
2024లో మళ్లీ కుదుపు
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు అన్యమత ఉద్యోగులను తప్పించే వ్యవహారంపై దృష్టి నిలిపారు.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు చర్యలు తీసుకుంటా" అని కూడా నాయుడు పలుసార్లు ప్రకటించడం గమనార్హం. ఆరు నెలల కిందట టీటీడలో ఉద్యోగులను తప్పించే వ్యవహారంపై దృష్టి సారించి 42 మందిని గుర్తించారు. వారిలో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొందరు చనిపోవడంతో ప్రస్తుతం 29 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా మరో ఏడుగురికి టీటీడీ నోటీసులు జారీ చేయడం వల్ల ఆ సంఖ్య 36కు చేరింది.
"స్వచ్ఛంద విరమణ చేస్తారా? లేక ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలా? అనే ప్రతిపాదన ఉంచారు. దీనికి బాధిత ఉద్యోగుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఈ తలనొప్పి ఎందుకు అని భావించిన బర్డ్స్ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు స్టాఫ్ నర్సులు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేస్తే, ఆమోదించకుండా, సస్పెన్షన్ వేటు వేయడం తీవ్ర చర్చకు దారితీసింది. మిగతా వారు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు.
2024లో ఉద్యోగులను తప్పించే విషయంపై టీటీడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రధాన కారణం హైకోర్టులో దీర్ఘకాలంగా ఉద్యోగుల పదోన్నతులు, పింఛన్ల సెటిల్మెంట్పై విచారణ సాగుతోంది. దీంతో ఆ పిటిషన్ కు అనుబంధంగా టీటీడీ కౌంటర్ వేసిందని బాధిత ఉద్యోగులు వివరించారు.
ప్రభుత్వం జారీ చేసిన ఆ ఆదేశం సమీక్షించిందా?
టీటీడీలో పనిచేసే ఉద్యోగుల్లో అన్యమతానికి చెందిన వారిని ప్రభుత్వ శాఖల్లోకి తీసుకోండని పాలక మండలి సిఫారసు చేసింది. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ ఇచ్చిన సమాధానం..
"టీటీడీ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పరిధిలోకి రారు. వారిని ఆలయాలు, అనుబంధ కార్యక్రమాల్లో కాకుండా విద్య సంస్థలు, ఆస్పత్రుల కార్యాలయాల్లో సేవలు వినియోగించుకోండి" అని రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట స్పష్టమైన సూచనలు చేసినట్లు బాధిత ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తాజాగా, వారందరినీ సాగనంపడం లేదా ప్రభుత్వ శాఖల్లోకి పంపించాలనే నిర్ణయం వెలువడిందనే అంశంపై కలకలం రేగింది.
హైకోర్టులో విషయంపై విచారణ సాగుతుండగా, టీటీడీ సిఫారసు, ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయగలరా? అనేది ప్రస్తుతం టీటీడీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Next Story

