తిరుమల మలయప్ప రథంపై అలరించనున్న బంగారు గొడుగు
x
శ్రీవారిరథంపై బంగారు గొడుకు (ఫైల్)

తిరుమల మలయప్ప రథంపై అలరించనున్న బంగారు గొడుగు

మంగలికట్ట నుంచి తీసుకుని వెళ్లడం వెనుక ఆసక్తికర కథనం.


తిరుమలలో మలయప్పస్వామి వారు బుధవారం విహరించే రథంపై నాయీ బ్రాహ్మణులు సమర్పించే బంగారు గొడుగు ఆచ్ఛాదన ఇవ్వనుంది. మంగలికట్ట (కల్యాణకట్ట) నుంచి ఈ రోజు (మంగళవారం) సాయంత్రం బంగారు గొడుగును శ్రీవారికి సమర్పించనున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నుంచి ఈ ఆచారం ఉన్నట్లు చారిత్రక నేపథ్యం. బ్రిటీషర్ల తోపాటు ఆ తరువాత మహంతులు, ప్రస్తుతం టీటీడీ పాలక మండలి కూడా ఈ ఆచారం, సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

తిరుమలలో బుధవారం ( అక్టోబర్ ఒకటో) తేదీ ఉదయం రథోత్సవం జరగనుంది.

విశ్వదేవుడు..
తిరుమలలో వేల సంవత్సరాలుగా కొసాగుతున్న సంప్రదాయాల్లో వేకువజామున సుప్రభాత వేళ శ్రీవారి దర్శనం మొదట సన్నిది గొల్లకు దక్కుతుంది. అదే సమయంలో రాత్రి పవళింపు సేవ సమయంలో నాయీబ్రాహ్మణుల నాదస్వర సంగీతం వింటూ స్వామివారిని విశ్రమింప చేస్తారు. గుంటూరుకు చెందిన షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడు23 గ్రాములు ఉన్న బంగారు పుష్పాలు 108 సమర్పించారు. 1984 నుంచి ప్రతి మంగళవారం ఆయన పేరిట శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవ ప్రారంభించారు. కుమ్మర్లు చేసే మట్టి కుండలను దీపావళి ఆస్థానం నిర్వహించడం సంప్రదాయం. గిరిజనుల ఆరాధ్యదైవంగా భావించే హథీరాంజీబాబా మఠం నుంచి శ్రీవారికి సుప్రభాత సేవలో వెన్న, ఇతర ప్రసాదాలను నివేదిస్తారు. ఇలా... ప్రతి కులానికి తిరుమల క్షేత్రంలో సేవలు అందించే ఆచారాలు కనిపిస్తాయి.
తిరుమలలో మంగళవారం సాయంత్రం తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలో స్థాపన చేసే బంగారు గొడుగును శ్రీవారి రథంపై అలంకరించమని కోరుతూ టీటీడీ అధికారులకు సమర్పించనున్నారు.
రేపు రథోత్సవం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్ని వాహన సేవలు ప్రధానమైనవే. అందులో బంగారురథం, తరువాత కొయ్యరథం ఊరేగింపు మరింత కనులపండువగా నిర్వహిస్తారు. అందులో బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు రథంపై ఊరేగనున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రథోత్సవం నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాడవీధుల్లోని సిమెంట్ మార్గంలో ఇసుక పోసి, రథాన్ని ముందుకు సాగించనున్నారు. ఈ రథం పైభాగంలో మలయప్పకు బంగారు గొడుగు ఆచ్ఛాదనగా ఉంచుతారు.
బంగారుగొడుగు నేపథ్యం ఇదీ..

మంగలికట్ట (కల్యాణకట్ట)లో బంగారు గొడుగు స్థాపనలో అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి పూజలు, చిత్రంలో నాయీబ్రాహ్మణులు, పంతులుగారి వంశీకులు (ఫైల్)

తిరుమలలోని కల్యాణకట్ట (తలనీలాలు సమర్పించే ప్రదేశం) లో నాయీబ్రాహ్మణులే యాత్రికులకు సేవలు అందించే విషయం తెలిసిందే. ఇక్కడి కల్యాణకట్ట సిబ్బంది అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మంగళవారం ఛత్రం (గొడుగు) స్థాపన చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి టీటీడీ అధికారులకు అప్పగిస్తారు.
పంతులు వంశస్తులు
తిరుమల శ్రీవారి క్షేత్రంలో మొదట నాయీ బ్రాహ్మణులు యాత్రికులు తీసేందుకు పంతులుగారి వంశీకులు వసతి కల్పించారనేది చారిత్రక కథనం. ఆ మేరకు కల్యాణకట్టలో ఛత్రస్థాపన చేయించడం ద్వారా ఆ వంశస్థులు గొడుగు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
"శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగుతున్నది" అని అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చరిత్రను ఉటంకించారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులుగారి వంశస్థు ఈ ఆచారం పాటించే హక్కు దక్కించుకున్నారు. మొదట చెక్కతో చేసిన గొడుగు సమర్పించే వారు. తిరుమలలో 1946వ సంవత్సరం పంతులు గారి వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించారు. ఆ తరువాతి వరకు కూడా చెక్క గొడుగు వాడే వారు. 1952 తరువాతే బంగారు గొడుగు వాడుతున్నట్లు తిరుమల వ్యవహారాలు తెలిసిన వారు చెబుతున్నారు.
మంగలి కట్టలో స్థాపన
తిరుమలలోని పాత కల్యాణకట్టలో బంగారుగొడగుకు స్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పూజలు చేసిన తరువాత నాయీ బ్రాహ్మణులతో కలిసి పంతులుగారి వంశీకులు గొడుకు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో పంతులుగారి వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహించి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి రథానికి బంగారు గొడుగు ప్రతిష్టించే ఆచారం కొనసాగుతోంది. శివరామయ్య కొడుకు రామనాథన్ 40 సంవత్సరాలుగా బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుంచి నాలుగుమాడవీధుల్లో మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి రథానికి సమర్పించడం ఆనవాయితీ పాటిస్తున్నారు. తిరుమలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read More
Next Story