YCP | చిత్తూరులో తోతాపురి మామిడి రైతులను ఆదుకోండి
x

YCP | చిత్తూరులో తోతాపురి మామిడి రైతులను ఆదుకోండి

మామిడికి గిట్టుబాటు ధర ప్రకటనలకు పరిమితం చేయకుండా, ఖచ్చితంగా చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేసింది.


కూటమి ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చేసిన ప్రకటన మాటలకే పరిమితమైందని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు సాగు చేసిన రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజ్జు పరిశ్రమల వద్ద టోకెన్ల పేరుతో నిబంధనలు పెట్టి రైతులను ఫ్యాక్టరీల చుట్టూ తిప్పుతున్నారని ఆయన ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలో తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అమలులోకి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. కొన్ని చోట్ల అతికష్టం మీద ఫ్యాక్టరీలు రూ.6కు కొనుగోలు చేస్తామని చెబుతున్నాయని, ఇదీ కూడా కొన్ని రోజుల ముచ్చటేనన్ని రైతులు దిగాలు చెందుతున్నారన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
"తోతాపురి రకం మామిడి తోటలు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సాగు చేస్తున్నారు. జ్యూస్‌ ఫ్యాక్టరీలు తోతాపురి మామిడికాయలు కొనుగోలు చేయడం లేదు, మాజీ సీఎం జగన్‌ ఉన్నప్పుడు ప్రభుత్వమే ఫ్యాక్టరీలతో కొనుగోలు చేయించింది" అని గుర్తు చేశారు.
ఈ ఏడాది ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని నాగిరెడ్డి చెప్పారు. నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Read More
Next Story