
తిరుమలలో గరుడవాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామివారు
తిరుమల:కనువిందు చేసిన కార్తీక పౌర్ణమి గరుడసేవ
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో దర్శనిమచ్చిన మలయప్ప.
పౌర్ణమి తోపాటు కార్తీకమాసంలో వచ్చిన పౌర్ణమి వల్ల యాత్రికులకు తిరుమలలో కనువిందైన దర్శనం దక్కింది. పండువెన్నెల పరుచుకునే వేళ బుధవారం రాత్రి శ్రీవారి క్షేత్రంలో మలయప్ప స్వామివారి గరుడవాహనంపై విహరిస్తూ యాత్రికులకు దర్శనం ఇచ్చారు. ప్రతి నెలా పౌర్ణమి రోజు స్వామివారికి గరుడ పౌర్ణమి నిర్వహించడం ఆనవాయితీ.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవతో సగం వంతు ఉత్సవాలు ముగిసినట్లు భావిస్తారు. ఆ రోజు తిరుమల ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరించే స్వామివారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఆ ఉత్సవానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతి నెలా పౌర్ణమి రోజు రాత్రి మలయప్పస్వామి వారికి గరుడవాహన సేవ నిర్వహించడం పరిపాటి.
తిరుమలలో బుధవారం రాత్రి రాత్రి 7 గంటలకు కార్తీకపౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వాహనమండపంలో మలయప్ప స్వామివారిని సర్వాలంకార భూషితుడిని చేశారు. గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. వాహన మండపం వద్ద తెరపైకి తీయగానే గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం పులకించింది. అక్కడి నుంచి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ మలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
గరుడవాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి,చిన జీయర్ స్వామి, ఆలయ పేష్కార్ రామకృష్ణ, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Next Story

