టీడీపీలోకి 'గల్లా' రీఎంట్రీ: బంపర్ ఆఫర్ సిద్ధం?
పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీలోకి రీఎంట్రీకి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు స్వాగతంతో పాటు బంపర్ ఆఫర్ కూడా దక్కనున్నట్లు తెలుస్తోంది.
'గల్లా' కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్ కానుంది. గత ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తన్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మిడియాలో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. తాజాగా వైఎస్ఆర్ సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మందిలో పది మంది వరకు పార్టీలు మారడానికి సంసిద్ధం అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వారిలో ఇద్దరు ముందస్తుగానే తమ పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధం అయ్యారని సమాచారం. దీంతో వారిలో ఒకరి స్థానాన్ని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు అవకాశం ఇవ్వడానికి కూడా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు.
ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాజీ సీఎం వైఎస్. జగన్ కు అత్యంత సన్నిహితుల్లో మోపిదేవి వెంకటరమణ కీలకమైన నేత. ఆయనతో పాటు నెల్లూరు జిల్లాలో టీడీపీలో అరంగేట్రం చేసి, వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామా చేయడానికి సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఆ మేరకు సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు నుంచి కూడా మాట తీసుకున్నట్లు సమాచారం. దీంతో వారిద్దరి స్థానంలో టీడీపీ కూటమి మరో ఇద్దరికి అవకాశం కల్పించే దిశగా కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. అందులో ఖాళీ అయ్యే స్థానంలో టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను నామినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
జయదేవ్ పేరు ఖరారు? మరో సీటు..?
వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ స్థానం వదులుకునే మోపిదేవి వెంకటరమణకు ఎంఎల్సీగా అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసినా, పదవిలో కొనసాగాలనే బీద మస్తానరావుకు ప్రతిపాదనపై చర్చలు కొలిక్కి రాలేదని అంటున్నారు. రెండు స్థానాలు ఖాళీ అయితే, ఒక స్థానంలో గల్ల జయదేవ్ కు బెర్త్ ఖరారైనట్లు చెబుతున్నారు. మరో స్థానంలో చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన వర్ల రామయ్యా? లేదా జనసేనాని అన్న కొణిదెల నాగబాబుకా? వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా వుండగా,
బాబు నోట జగన్ మాట
2019లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్. జగన్ చెప్పిన మాటలు ప్రస్తావనర్హం. "టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామ చేయాలి. వారినే పార్టీలో చేర్చుకుంటాం" అని ప్రకటించారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, టీడీపీ నుంచి విజయం సాధించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సీపీతోనే అంటకాగారు. మినహా, వారి పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జిగానే కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా "పదవులకు రాజీనామా చేసిన తరువాతే టీడీపీలోకి అవకాశం ఉంటుంది" అని ప్రకటించారు. వారిని మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీ ద్వారా లభించిన పదవులను ఎంతమంది త్యజిస్తారనేది వేచి చూడాలి. ఇప్పటివరకు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల నుంచి చేరిన చైర్మన్లు, కౌన్సిలర్లు ఎవరు పదవులకు రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఆచరణలో ఇది సాధ్యమా? అనేది కూడా చర్చనీయాంశం.
"గల్లా" రీఎంట్రీ వెనుక...
చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా కుటుంబం రాజకీయంగా గుర్తింపు ఉంది. పారిశ్రామికంగా బలమైన కుటుంబం. అంతేకాకుండా, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి పాతూరి రామచంద్రనాయుడు సీఎం చంద్రబాబుకు రాజకీయ గురువు కూడా. సీఎం చంద్రబాబే స్వయంగా ఈ మాటలు అనేకసార్లు చెప్పారు. విషయంలోకి వస్తే, రాష్ర్టంలో పెట్టుబడులకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం కీలకంగా ఉంటుంది. గల్లా ఫుడ్స్, అమరాన్ బ్యాటరీలతో పాటు పారిశ్రామికంగా పరిపుష్టి కలిగిన కుటుబం. రాజకీయంగా కూడా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1989 నుంచి వరుసుగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించారు. టీడీపీ తన రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగిన కొడుకు గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గల్లా జయదేవ్, అంతకుముందు ఆయన తల్లి అరుణకుమారి రాజకీయంగా అస్ర్తసన్యాసం చేశారు.
2019లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రాజకీయంగా వేధింపులకు పాల్పడింది. రేణిగుంట సమీపంలోని అమరాన్ ఫ్యాక్టరీ భూములు స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమ విస్తరణ చేయకుండా, ఓ యూనిట్ తెలంగాణకు తీసుకుని వెళ్లారు. రాజకీయంగా పరిస్థితులు అనుకూలంగా లేని వాతావరణంలో గల్లా కుటుంబం సైలెంట్ అయ్యింది.
తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గల్లా కుటుంబ వారసుడిగా మాజీ ఎంపీ జయదేవ్ యాక్టివ్ అయ్యారని సమాచారం. వారికి వ్యాపారపరంగా ఎన్ని అవసరాలు ఉన్నాయో, టీడీపీకి కూడా పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమైంది. పార్టీకి అనడం కంటే రాష్త్ర ప్రయోనానికి ఉపయోగపడే పెట్టుబడులు సాధించడం, పారిశ్రామీకరణ కోసం గల్ల కుటుబం మద్దతు కూడా సీఎం చంద్రబాబు కోరుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీని వీడుతున్న రాజ్యసభ సభ్యుల ద్వారా గల్లా జయదేవ్, అలాగే టీడీపీకి కూడా కాలం కలిసొచ్చింది.
రానున్న ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనేది వేచిచూడాలి. వైఎస్ఆర్ సీపీని వీడే రాజ్యసభ సభ్యులు ఎందురు ఉంటారు? టీడీపీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది వేచి చూడాలి.
Next Story