
తిరుమలలో మంగళవారం రాత్రి గరుడవాహనంపై విహరిస్తున్న మలయప్ప
పులకించిన తిరుమల.. వైభవంగా పౌర్ణమి గరుడసేవ..
రెండు గంటల పాటు గరుడవాహనంపై విహరించిన మలయప్ప.
తిరుమలలో మంగళవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు రాత్రి ఈ వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనసేవకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో. పౌర్ణమి రోజు కూడా అందుకు ఏమాత్రం తీసిపని విధంగా మలయప్పస్వామివారిని గరుడవాహనంపై ఆశీనులను చేసిన తరువాత మాడవీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమల ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల నుంచి యాత్రికులువాహనసేవలో మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు అత్యంత ఆసక్తి చూపిస్తారు.
తిరుమలలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు సర్వాలంకరణ భూషితుడిని చేసిన మలయప్పస్వామివారిని గరుడవాహనంపై ఆశీనులను చేశారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికుల గోవిందనామ స్మరణల మధ్య వాహనమండపం నుంచి పల్లకీ సేవ ప్రారంభమైంది. రాత్రి తొమ్మది గంటల వరకు గరుడవాహన సాగింది.
మాడవీధుల్లో కళాకారులు వివిధ రకాల కళలు ప్రదర్శిస్తూ, స్వామివారికి నీరాజనాలు అందించారు. వార్షిక, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ చూసే అవకాశం లేని వారికి ప్రతి నెలా పౌర్ణమి రోజు రాత్రి నిర్వహించే ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ ఆస్కారం కల్పిస్తోంది.
తిరుమలలో రాత్రి నిర్వహించిన పున్నమి గరుడవాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి పల్లకి ముందు నడిచారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్, ఆలయ పేష్కార్ రామకృష్ణతో పాటు టీటీటీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో గరుడవాహనం సాగే సమయంలో మలయప్పకు హారతి ఇచ్చిన అర్చకులు, గ్యాలరీల్లోని యాత్రికులకు కూడా ఆ భాగ్యం కల్పించారు.
Next Story