"మదనపల్లె" చెబుతున్న పాఠం.. మరో సంస్కరణ అవసరం..!
జాతీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పడంలో ఆ కాలేజీ వేదికైంది. ఈ చెట్టు కూడా సాక్ష్యంగా నిలిచింది. రాయలసీమలో జరిగిన అనేక ఘటనలు దేశంలో సంస్కరణలకు బీజం వేశాయి. ఆ పట్టణంలో జరిగిన ఘటన భూ,పరిపాలలో సంస్కరణ అనివార్యమంటోంది. పోరాటానికి మేము సిద్ధమని కొందరు అంటున్నారు.
దేశంలో అనేక సంస్కరణలకు రాయలసీమలో జరిగిన సంఘటనలు ఆస్కారం కల్పించాయి. జాతీయోద్యమం మరింత ఉధృతం కావడానికి జణగణమన అధినాయక జయహే జాతీయగీతం ఉద్యమాన్ని ఊర్రూతలూగించింది. ఇంకొన్ని సంఘటనలు దేశ భద్రత, ఎన్నికల విధానంలో సంస్కరణలకు బీజం వేసేలా చేశాయి. మించో.. చెడో అనేది పక్కన ఉంచితే దేశచరిత్రలో ఈ ప్రాంతం చెరగని స్థానంలో నిలిచింది.
మదనపల్లె బీటీ కాలేజీ
జాతీయగీతం ఆంగ్లంలోకి అనువాదం కావడంతో పాటు స్వరకల్పనకు వేదిక అయింది. ఈ గీతాన్ని సంస్కృత పదాలతో బెంగాలీ భాషలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రాశారు. దేశపర్యటనలో అలసిన ఆయన విశ్రాంతి కోసం మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ (బీటీ) కాలేజీలో బస చేశారు. గుల్ మొహర్ చెట్టుకింద కూర్చున్న ఆయన జాతీయ గీతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో పాటు, విద్యార్థులతో కలిసి ఆలపించి, ఆ తరువాత స్వరకల్పన చేశారు. మదనపల్లె పట్టణంలో ఈ పచ్చారిచెట్టు కూడా అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. అనేక ప్రాంతాల వారికి ఈ చెట్టు ల్యాండ్ మార్క్ కూడా. ఇపుడు ఈ విషయాలు ప్రస్తావించడానికి మదనపల్లెలో జరిగిన ఘటన భూ, రెవెన్యూ పరిపాలనా వ్యవహారాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. దీనికిముందు గత చరిత్రను స్పర్శిద్దాం..
ఖాజీపేట ఘటన.. కడపలో ఆగిన ఎన్నిక
ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థి మరణించిన ఎన్నికల ప్రక్రియ ఆగదు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ పరిస్థితి రావడానికి కడప జిల్లాలో జరిగిన సంఘటన ఎన్నికల సంస్కరణలకు అవకాశం కల్పించింది.
1991: కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్. రాజశేఖరరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా సీ. రామచంద్రయ్య పోటీ పడ్డారు. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముందు రోజే ఎన్నిక ఆగింది. ఖాజీపేట మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి పోలంకి వెంకటసుబ్బయ్య అనుమానాస్పద స్థితిలో పొలాల్లో శవమై కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే అప్పటి జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం (డాక్టర్ వైయస్సార్ తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు) కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. అదే రోజు రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కడప ఎన్నిక ఆగిపోయింది.
సంస్కరణ: కేంద్ర ఎన్నికల సంఘం దీర్ఘదృష్టితో ఆలోచన చేసింది. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులను హత్య చేయించడం లేదా, సహజ మరణమైనా ఎన్నికల ప్రక్రియ ఆగకుండా చర్యలు తీసుకుంది. అభ్యర్థి మరణించినాఎన్నిక ఆగదని ఆదేశాలు జారీ చేసింది.
మరణించినా... గెలిచారు..
2014: సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి భూమా శోభనాగిరెడ్డి పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 23వ తేదీ నంద్యాల నుంచి ఎన్నికల ప్రచారం అనంతరం రాత్రి 10.30 గంటలకు ఆళ్లగడ్డకు వాహనంలో బయలుదేరారు. దీపగుంట గ్రామ సమీపంలో రోడ్డుపై రైతులు ఆరబోసిన గడ్డిలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పింది. గాయపడిన ఆమెను నంద్యాల ఆసుపత్రికి, తరువాత హైదరాబాద్ తరలించారు. ఏప్రిల్ 24వ తేదీ 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.
అయినా ఆగని ఎన్నిక
కడప ఘటన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నిక ఆగలేదు. పోలింగ్ నిర్వహించడానికే ఎన్నికల సంఘం ముందుకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి 92, 108 మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత మళ్లీ నిర్వహించిన ఉపఎన్నికలో శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ విజయం సాధించారు.
టెలికాంలో సంస్కరణలు
2003 అక్టోబర్ 1 : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారు. రోడ్డుమార్గంలో ఆయన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి టోల్ గేట్ దాటి కొద్ది దూరం వెళ్ళాక చంద్రబాబునాయుడు లక్ష్యంగా అమర్చిన క్లే మోర్ మైన్ లను న్నక్సలైట్లు (మావోయిస్టులు) పేల్చారు. చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు తునాతునకలైంది. ఎన్ చంద్రబాబుతో పాటు అప్పటి పుత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి గాయపడ్డారు. పోలీసులు రంగంలో దిగారు సంఘటన జరిగిన రోజు సమీప ప్రాంతాల నుంచి సెల్ ఫోన్ కాల్స్ డేటా పరిశీలించారు. ఆ తర్వాతే..
సిమ్ కార్డుకు... ఆధార్
ఆ సంఘటన జరిగే వరకు సెల్ కంపెనీలు కూరగాయల మాదిరి సిమ్ కార్డులు జారీ చేశాయి. ఆ సిమ్ కార్డులో వాడుతున్న వ్యక్తులను విచారణ పేరు పిలిపించి వేదన గురి చేశారు అప్పటికే ఒకో నంబర్ చాలామంది చేతులు మారింది దీంతో కొన్ని రోజులపాటు అమాయకులు కూడా అకారణంగా వేధింపులు గురయ్యారు. ఈ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం, టెలికాం మంత్రిత్వ శాఖ పగడ్బందీ చర్యలు తీసుకుని సిమ్ కార్డ్ జారీకి ఆధార్ కార్డు ఉండాలని సంస్కరణ తీసుకొచ్చింది.
అలిపిరి బాంబు పేలుళ్ల ప్రకంటనలు చిత్తూరు జిల్లా మదనపల్లె వరకు వ్యాపించాయి.
అందుకు ప్రధానంగా ఈ ప్రాంతంలో గతంలో మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉండది. మాజీ నక్సల్స్ కూడా ఉండేవారు. వారికి ఆశ్రయం కల్పించారనే సందేహంతో బాబ్ జాన్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. "ప్రస్తుతం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దగ్ధం ఘటన" తరువాత మళ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 22ఏ భూములు, అసైన్డ్ పట్టాల కొనుగోలు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఫుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి అనుచరుడిగా ముద్రపడిన ఆయనను పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. ఇప్పడు ఈ సంఘటనల ప్రస్తావన తీసుకుని రావడానికి కూడా రాయలసీమలో భాగమైన మదనపల్లె ఘటన ఆస్కారం కల్పించింది.
రెవెన్యూలో ప్రక్షాళన అవసరం
మదనపల్లె ఆసియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఇందులో ఆరు నియోజకవర్గాల రెవెన్యూ రికార్డులు ఉంటాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో అవి మూడు సెగ్మెంట్లకు పరిమితమైనా, రికార్డులు ఇక్కడే ఉన్నాయి. కొత్త డివిజన్లకు ఇంకా పూర్తి స్థాయిలో చేరినట్లు లేవు. ఇందులో 21 ఏ, జమిందారీ, ఈానాం, అసైన్డ్, వివాదాస్పద అటవీ భూముల ఆక్రమణ ఫైళ్లు ఈ నెల 20వ తేదీ శనివారం రాత్రి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాదు. దేశంలో చర్చనీయాంశమైంది. రాష్ర్ట ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుని విచారణ సాగిస్తోంది.
భూ, పరిపాలనా వ్యవహారాల్లోని అపసవ్య విధానాన్ని ఈ సంఘటన ఎత్తిచూపింది. భూముల సబ్-డివిజన్లు, మ్యుటేషన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. త్వరగా సమస్య పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారు. పట్టాభూముల టైటిల్ డీడ్లలో పేర్లు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. ప్రతి కార్యాలయంలో పేరుకుపోతున్న అర్జీలేఅందుకు నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ. రమేష్ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు.
"భూ పరిపాలన, రెవెన్యూ వ్యవస్ధల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది" అని గుర్తు
చేశారు. "రాష్ట్రంలో పరిస్థితులు మారాలంటే, కీలకమైన భూ పరిపాలన, రవెన్యూ వ్యవస్థను సంస్కరించాలి. భూ ఆక్రమణలకు అవకాశం కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం స్వాగతించతగినది" అన్నారు.
సమస్యల పరిష్కారానికి పిల్ వేస్తా...
స్వతహాగా మదనపల్లెలో న్యాయవాది, మాజీ, ఎమ్మెల్సీ ఎన్. నరేష్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే...
"అన్నదమ్ముల జాయింట్ భూములు సబ్ డివిజన్ చేయడానికి అనవసరంగా కాలయాపన చేస్తున్నారు. 1బీ లేకుండా రిజిస్ట్రేషన్లు జరగవు. సిటిజన్ చార్జ్ నామమాత్రంగా మారింది. పనులు చేయడం లేదు" అని నరేష్ కుమార్ రెడ్డి ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. రైతుల భూ వివాదాలు పరిష్కారం కావడం లేదు. వివాదాలతో కోర్టుకు వెళ్లే వారి సమస్యలు కూడా ఆలస్యం అవుతున్నయి.రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు" అని నరేష్ అభిప్రాయపడ్డారు.
"ఈ సమస్యలు అన్నీ చూసిన తరువాత, మదనపల్లె ఘటన బాధ్యత గుర్తు చేసింది. రాజకీయాలు పక్కన ఉంచి, ఇక రైతుల సంక్షేమం, పారదర్శక విధానాలు, సంస్కరణల కోసం న్యాయస్థానంలో పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ పిటిషన్లు) దాఖలు చేస్తా" అని నరేష్ అంటున్నారు.
ఇది దారుణం
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాయంలో రికార్డులు కాల్చడం దారుణం. దీనిని ఖండిస్తున్నా అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ అన్నారు. ఆ కార్యాలయం వద్ద ఇటీవల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..
"పాతకాలం వ్యవస్ధ అమలులోకి తీసుకురావాలి. నా స్నేహితుడు (వైఎస్. రాజశేఖరరెడ్డి) కుమారుడు (మాజీ సీఎం వైఎస్. జగన్) రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అని నిప్పులు చెరిగారు. రికార్డుల దగ్ధం వెనుక ఎంతపెద్ద వాళ్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడంగల్, జమాబందీ లేకుండా చేశాడు. ఇది పిచ్చిపని. సర్వే వ్యవస్థ ఉంటే, డ్రోన్లు వాడడం ఏమిటి? సర్వే రాళ్లపై నీ బొమ్మలు (వైఎస్.జగన్) ఏంటి పిచ్చోడా?" అని కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు.
రికార్డుల దగ్ధంపై చురుగ్గా విచారణ జరుగుతోంది. ఎంతమందిని ఇందులో పాత్రధారులు, సూత్రధారులను గుర్తిస్తారు? భూ, రెవెన్యూ పరిపాలనలో ఎలాంటి సంస్కరణలు తీసుకుని వస్తారనేది వేచిచూడాలి.
Next Story