శుక్రవారపు తోట పిలుస్తోంది.. కనువిందు చేస్తున్న ప్రదర్శన
x
తిరుచానూరు అమ్మవారి ఆలయం సమీపంలోని శుక్రవారపు తోటలో ఫల, పుష్ప ప్రదర్శన

'శుక్రవారపు తోట' పిలుస్తోంది.. కనువిందు చేస్తున్న ప్రదర్శన

తిరుచానూరులో బొమ్మలు చెబుతున్న చరిత్ర ఇలా ఉంది...


వారంలో ప్రతి రోజుకు ఓ పేరు ఉన్నట్లే ఓ తోటకు కూడా వారం పేరు ఉంది. ఇదేమిటా అనుకుంటున్నారా..?! అందమైన పూలమొక్కలు, అరటి, పండ్ల తోటలతో నిండి ఉండే ఈ ఉద్యానవనానికి శుక్రవారపు తోట అని పేరు. ప్రకృతికి మరింత అందం తెచ్చే విధంగా ఈ శుక్రవారపుతోటలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన కనువిందు చేస్తోంది.



అలుమేలు మంగమ్మగా పిలిచే తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఈ అందమైన తోటకు మరింత కళ వచ్చింది. ఈ పుష్కరిణిలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి చరిత్రను ఆవిష్కరించే దృశ్యాలు కళ్లకు కట్టినట్టు వివరించే విధంగా ఏర్పాటు చేశారు.

చారిత్రక ఘట్టాల తోపాటు బలరామకృష్ణుల పోరాట పటిమ, పద్మావతీ అమ్మవారి ఆలయ నమూనా ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఆకాశరాజు పొలం దున్నే సమయంలో పద్మావతీ అమ్మవారి సాక్షారం వంటి దృశ్యాలు నాటి చరిత్రను కళ్లకు కట్టేలా కళాకారులు తీర్చిదిద్దారు.

టీటీడీ ఉద్యాన విభాగం శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి. వీరబ్రంహ్మం ప్రారంభించారు.

తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఫలపుష్పాల ప్రదర్శన కనువిందు చేస్తోంది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ వేళ ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంటోంది.

ఈ పేరు ఎందుకు వచ్చింది..?

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న తోటను శుక్రవారం తోటగా పేరు. ఈ పేరు రావడం వెనుక కూడా చారిత్రక నేపథ్యం ఉంది. ప్రతి శుక్రవారం నిత్య కళ్యాణం తర్వాత పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని పల్లకిపై ఊరేగింపుగా ఆలయానికి దక్షిణ దిక్కులో ఉన్న వివిధ రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలతో ఆహ్వానం గా ఉండే తోటలోనికి తీసుకొని వెళ్లడం ఆనవాయితీ.

ఈ తోటలో ఉన్న పురాతన మండపంలో అమ్మవారిని ఆశీనులను చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి విగ్రహానికి పసుపు, చందనం, కుంకుమ, పంచామృతాలతో తయారు చేసిన ద్రవ్యాలతో అభిషేకం చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు.

వందల సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయడం ఆచారంగా నిర్వహిస్తారు. ఆ తరువాత అమ్మవారిని సేద తీరుస్తారు. విశాలమైన తోటలో నిర్వహించే అమ్మవారి అభిషేక ఉత్సవానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అందులో మహిళలే ఎక్కువ ఉండడం ఇక్కడ ప్రత్యేకత.

ఆకట్టుకునే పుష్కరిణి

పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలోని ఈ శుక్రవారపు తోటలో శ్రీకృష్ఱదేవరాయలవారి కాలంలోనే అనేక కట్టడాలు నిర్మించారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించే ఈ తోట ఆవరణలోనే నాలుగుకాళ్ల మండపం ఒకటైతే, దీనికి సమీపంలోనే అద్భుత కోనేరు కూడా ఆకట్టుకుంటుంది.

నాలుగు దిక్కుల నుంచి గ్రానైట్ రాళ్లతో పుష్కరిణిలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మెట్లు (Steps) కనువిందు చేస్తాయి. ఈ పుష్కరిణిలోనే ఒకవైపు ఆలయం కూడా కనిపిస్తుంది.నీటితో కోనేరు నిండేతే ఆ ఆలయం కూడా నీటితో నిండిపోతుంది. ఈ పుష్కరిణిలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి చరిత్రను ఆవిష్కరించే దృశ్యాలు కళ్లకు కట్టినట్టు వివరించే విధంగా ఏర్పాటు చేశారు.

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తరహాలోనే ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనతో పాటు ఆలయ చారిత్రక నేపథ్యం వివరించే విగ్రహాలు, నమూలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

సీతారామలక్షణుల వనవాసం వంటి ఘట్టాలతో రామాయణాన్ని ఇక్కడ శుక్రవారపు తోటలో చరిత్రను వివరిస్తోంది.

ఈ ప్రదర్శన క్షేత్రంలో టీటీడీ శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన ఇది.

ఆయుర్వేద ప్రదర్శన ఆకట్టుకుంటోంది. సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బంది చారిత్రక విశేషాలు యాత్రికులకు వివరిస్తున్నారు.
Read More
Next Story