
'అలిపిరి' చుట్టూ.. కేంద్రీకృతమైన వివాదం..
కేసులకు భయపడను. విచారణకు మళ్లీ వస్తా వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన.
ఆధ్యాత్మిక రాజధాని రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. వైసీపీ, టీడీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. తాజాగా అలిపిరి సమీపంలోని శనైశ్ఛరుడి విగ్రహం వద్ద రాజకీయ రచ్చ తుట్టె కదిలింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం నుంచి తిరుపతిలో మొదలైన రాజకీయ వివాదాల పరంపర కొనసాగుతోంది.
"మనోభావాలు రెచ్చగొట్టారనే ఆరోపణలపై" టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని విచారణకు రావాలని తిరుపతి నగరం అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల వెంటనే రాలేను. 23వ తేదీ హాజరవుతానని వైసీపీ నేత భూమన పోలీసులకు సమాధానం ఇచ్చారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ పాలక మండలి సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి ఘాటైన ఆరోపణ చేశారు.
"బ్రహ్మోత్సవాల కోసం సీఎం నారా చంద్రబాబు తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్నారు. అలజడి సృష్టించడానికే భూమన ఆ రోజు ఎంచుకున్నారు" అని భానుప్రకాషరెడ్డి ఆరోపించారు.
ఇంతకీ సమస్య ఏమిటి?
అలిపిరికి సమీపంలోని పాత తనిఖీ కేంద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న శనైశ్చర విగ్రహం వద్ద ఆరుబయట పడి ఉంది. మూడు రోజుల కిందట అక్కడికి వెళ్లిన వైసీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పూజలు చేశారు.
"హిందూ దేవతామూర్తులకు అపచారం జరుగుతోంది. టీటీడీ పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది" అని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ గా స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులు హిందువుల మనోభావాలు రెచ్చగొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నట్టుగా అదేరోజు అలిపిరి పోలీసులకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గోవిందరాజులు ఫిర్యాదు చేశారు. దీంతో
పోలీసులకు ఫిర్యాదు
అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ డిప్యూటీ ఈఈ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు తిరుపతి నగరం అలిపిరి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డిపై 196(1)(a),197(1),299,352,353(2),356(2) r/w 356(1) BNS సెక్షన్ష కింద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి, విచారణకు రావాలని భూమనకు అలిపిరి ఎస్ఐ అజిత బుధవారం సాయంత్రం నోటీసులు అందించారు. 18వ తేదీ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. దీనిపై భూమన స్పందిస్తూ
"ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల 18వ తేదీ (గురువారం) హాజరు కాలేను. 23వ తేదీ విచారణకు వస్తా" అని భూమన అలిపిరి పోలీసులకు సమాధానం ఇచ్చారు. అంతకుముందే ఆయన వైసీపీ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
కేసులకు భయపడను
"నన్ను అరెస్టు చేస్తారని విన్నాను. నేను కూడా స్వచ్ఛమైన హిందువునే. ఏమి చేసుకుంటారో చేసుకోండి. ఎన్నికేసులైన పెట్టుకోండి. భయపడే ప్రస్తక్తి లేదు" అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు. కిరస్తానీని అంతకంటే కాదు. స్వచ్ఛమై హిందువును. హైందవ ధర్మ పరిరక్షణకు మాట్టాడుతూనే ఉంటా. మీ మమాదిరి (కూటమి నేతలు) ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసే వాడిని కాదు" అని భూమన టీడీపీ కూటమి నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
"స్వామీజీల నుంచి విషయం సంగ్రహం చేసి, మాట్లాడే వ్యక్తిని, నోటికి వచ్చినట్లు మాట్లాడను" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శనైశ్చరుడి విగ్రహానికి శంఖుచక్రాలు ఉంటాయా? మీ ఇష్టమైంది చేసుకోండి. ఎన్నికేసులైనా పట్టి, జైలులో పెట్టండి. అయినా, నేను హైందవ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా. రాజకీయాల కంటే, హిందూధర్మం కాపాడడమే నాకు కర్తవ్యం" అని స్పష్టం చేశారు.
అలజడికి కుట్ర
తిరుమలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అరోపణలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
"నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులతో భూమన పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. సీఎం నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు" అని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
వివాదానికి కారణం ఏమిటి?
తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరికి సమీపంలోనే పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు. 23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు. దీంతో పీఠం ఒక చోట, శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం ఇక్కడే వదిలేసి స్థపతులు వెళ్లిపోయారు. దీంతో విగ్రహం అక్కడే ఉండిపోయింది.
ఆ విగ్రహం కథేమిటి?
తిరుమలలో ఆలయాల పునరుద్ధరణతో పాటు నడకదారిలో రాతిమెట్ల వంటి పనులు టీటీడీ నిర్వహించింది. దీనికోసం తమిళనాడు నుంచి కూడా కొందరు శిల్పులను తీసుకుని వచ్చారు. అలిపిరికి సమీపంలో భూదేవి కాంప్లెక్స్ సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కనే టీటీడీ శిల్ప కళాశాల వద్ద వర్క్ షాపు ఏర్పాటు చేశారు. దీనికితోడు ప్రస్తుతం శనైశ్ఛర విగ్రహం పడి ఉన్న ప్రదేశం మూడునెలల కిందటి వరకు రాళ్లు, రప్పలు ముళ్లపొదలతో నిండి ఉండేది. దీనిని వాహనాలు పార్కింగ్ కోసం చదును చేయడం వల్ల ఆ విగ్రహం అందరి దృష్టిలో పడింది. ఇదిలావుంటే 1970 నుంచి ఈ ప్రదేశంలో తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు విగ్రహాలు చెక్కేవారు. వారిలో కన్నన్ ఆచారి కూడా ఒకరు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి శనైశ్ఛరుడి విగ్రహం తయారీకి రూ. రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తరువాత శిల్పి, ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి రోజుల వ్యవధిలోనే అకాల మరణాలకు గురయ్యారు. అసంపూర్తిగా ఉన్న విగ్రహం, పీఠం సమీప ప్రదేశాల్లోనే పడేశారు. సీఎం నారా చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి ఘటన నేపథ్యంలో ఇక్కడి వారందరినీ ఖాళీ చేయించారు. దీంతో ఆ విగ్రహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయాలను ఆ శిల్పి వద్ద పనిచేసిన గురుస్వామి అసలు విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా..
అలిపిరి వద్ద పడి ఉన్న విగ్రహం విష్ణుమూర్తిది కాదని టీటీడీ శిల్ప కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇది శనైశ్చరుడి విగ్రహమే అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే..
"రెండు సంవత్సాల కిందటే ఈ విగ్రహాన్ని గుర్తించాం" అని వెంకటరెడ్డి చెప్పారు.
"అది విష్ణుమూర్తి విగ్రహం అనుకున్నాం. దోషాలు లేకుంటే కాలేజీలోకి తరలిద్దామని పరిశీలించాం. విగ్రహాన్ని పరిశీలిస్తే, అది విష్ణుమూర్తిది కాదని తేలింది" అని వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు.
దీంతో కూటమి నేతలకు మంచి బలం దొరికినట్టుగా మారింది. ఈ విగ్రహంపై టీటీడీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన ప్రకటనను సమర్థించుకోవడానికి ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Next Story