చంద్రగిరి కోటలో ఝల్లుమన్న జానపదం..
x
కాంతులు విరిజిల్లుతున్న చంద్రగిరి కోట

చంద్రగిరి కోటలో ఝల్లుమన్న జానపదం..

మురిసిన మహిళా పార్లమెంటేరియన్లు. పసందైన ఆతిథ్యం. చిత్రాలు చెప్పే కథ.


తిరుపతికి సమీపంలోని చారిత్రక చంద్రగిరి కోట ఆదివారం రాత్రి విద్యుత్ కాంతులు విరజిమ్మింది. మహిళా పార్లమెంటరీ ప్రతినిధులకు చంద్రగిరి కోటలోకి ఆదివారం రాత్రి అపూర్వ స్వాగతం లభించింది. జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు కనువిందు చేశారు. పసందైన విందుతో ఆతిథ్యం ఇచ్చారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపదగా ఉన్న కళారూపాలతో కళాకారులు పార్లమెంటరీ ప్రజాప్రతినిధులకు కనువిందు చేశారు.

చంద్రగిరి కోటలో ఆదివారం రాత్రి...

చంద్రగిరి కోటలో తిరుపతి సదస్సుకు వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన డెలిగేట్లకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఆతిథ్యం ఇచ్చారు. ఇందులో భాగంగా చంద్రగిరి కోట విశేషాలను తెలుపు సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని సభ్యులకు ప్రదర్శించారు.

పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాను స్వాగతిస్తున్న ధింసా కళాకారులు

తిరుపతిలో రెండు రోజుల పార్లమెంట్‌, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ సదస్సు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షనత జరిగిన ఈ సదస్సును పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.

చంద్రగిరి కోటలో సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ ఆర్. రఘురామకృష్ణమరాజు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ప్రజాప్రతినిధులు

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు మాట్లాడారు. మధ్యాహ్నం తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి సభ్యులు మహిళా సాధికారతపై బృందాలుగా ఏర్పడి సాయంత్రం వరకు అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు సాగించారు. ఈ తీర్మానాలు కూడా ఆమోదించారు. చర్చలతో సుదీర్ఘ సమయంపాటు పాల్కన్న పార్లమెంటరీ ప్రజాప్రతినిధుల మొదటి రోజు సదస్సు సాయంత్రం ముగిసింది.

పసందైన కార్యక్రమాలు
ఒకరోజు మొత్తం అనేక అంశాలపై చర్చల్లో మహిళా ప్రజాప్రతినిధులు మునిగితేలారు. వారందరికీ తిరుపతికి సమీపంలోని చంద్రగిరి కోటలో పసందైన విందును అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు ఇచ్చారు. దీనికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా తిరుపతి జిల్లా యంత్రాంగం వసతులు కల్పించింది. దీనికోసం ముందస్తుగానే తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జానపద కళలతో స్వాగతం

రాజులు ఏలిన నాటి చంద్రగిరి కోట వారసత్వ సంపదగా నిలిచింది. రాజుల కాలంలో కవులు, కళాకారులకు ప్రాధాన్యత ఉండేది. దానికి తగినట్టే తిరుపతి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మహిళా పార్లమెంటేరియన్లతో పాటు పార్లమెంటు స్పీకర్ ఓంబిర్లా, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ ఆర్. రఘురామకృష్ణమరాజు, ప్రజాప్రతినిధులను కోటలోకి ధిమ్సా జానపద కళాకారులు నృత్యాలతో సాదరంగా ఆహ్వానం పలికారు.

వేదికపై కుంభకోయ, గంగజాతర నృత్యం, కూచిపూడి నృత్యాలతో కళాకారులు ఆహూతులను అలరించారు. దీంతో చంద్రగిరి కోట కళరూపాలతో కళకళలాడింది. ‘’మహిళా సాధికారతపై పార్లమెంటు, శాసనసభ కమిటీల జాతీయ సదస్సు" లో భాగంగా ఆదివారం రాత్రి చంద్రగిరి కోటలో ప్రతినిధుల కోసం జిల్లా కలెక్టర్ వి. వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్. మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి వారితో పాటు శ్రీకాళహస్తి, చిత్తూరు ఎమ్మెల్యే లు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, గురజాల జగన్మోహన్ ,తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ రఘువంశీ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి,శ్రీకాళహస్తి ఆర్డిఓలు రామ్మోహన్ ,భాను ప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ రీజన్ డైరెక్టర్ రమణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికారులు, సిబ్బంది, జిల్లా అధికారులు హాజరయ్యారు.
Read More
Next Story