Flamingo Festival | పులికాట్ సరస్సు వద్ద జనవరిలో సందడే.. సందడి..
x
సూళ్లూరుపేట సమీపంలోని నేలపట్టు విదేశీ పక్షుల విడిది కేంద్రం.

Flamingo Festival | పులికాట్ సరస్సు వద్ద జనవరిలో సందడే.. సందడి..

రాష్ట్ర పండుగను తలపించేలా విదేశీ అతిథి పక్షుల ఉత్సవాల నిర్వహణకు సన్నాహలు.


సూళ్లూరుపేట (Sullurpet) అంటే మనకు గుర్తుకు వచ్చేది శ్రీహారికోట రాకెట్ ప్రయోగ కేంద్రం. ఆ ప్రాంతంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంటుంది. ఇక్కడ 2026 జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. నేలపట్టు అనేది విదేశీ పక్షుల విడిది కేంద్రం. పులికాట్ సరస్సు పరివాహక ప్రాంత పల్లెలు వలస పక్షులకు నిలయం. ఈ ప్రాంతంలో వాటిని దేవతా పక్షులుగా పరిగణిస్తారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్ అధికారులతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుక తేదీలతో పాటు, ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. నెలకు ముందుగానే ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు, బాధ్యతల వికేంద్రీకరణపై కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర అధికారులకు సూచనలు చేశారు.


అటవీశాఖ కన్సర్వేటర్, ఎస్వీ జంతుప్రదర్శనశాల క్యూరేటర్ సెల్వం, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, తిరుపతి జిల్లా అటవీ శాఖాధికారి సాయిబాబా, సూళ్లూరుపేట డివిజన్ అటవీశాఖాధికారి హారిక, రెవెన్యూ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, మండలాల తహసీల్దార్లు, మున్సిపాలిటీ, రెవెన్యూ, వ్యవసాయ, ఫిషరీస్, DRDA శాఖల అధికారులు హాజరయ్యారు.

వేల కిలోమీటర్ల ప్రయాణం...
విదేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సైబీరియన్ పక్షులు (Siberian birds ) తరలివస్తాయి. శీతాకాలం ముగిసే వరకు అక్కడే విడిది చేస్తాయి. ఆ పక్షులను వేటాడితే అధికారులు కాదు. ఆ గ్రామ ప్రజలే సహించరు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు సమీపంలోని నేలపట్టు, పులికాట్ సరస్సు వద్ద విడిది చేయడానికి వచ్చే విదేశీ వలస పక్షులు రావడం, వాటి సందడితో వాతావరణం హృద్యంగా ఉంటుంది.
2001 నుంచి పక్షుల పండుగ..
సూళ్లూరుపేట (Sullurpet) అంటే మనకు గుర్తుకు వచ్చేది శ్రీహారికోట వద్ద ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రం. ఆ ప్రాంతం అంతా పులికాట్ సరస్సు విస్తరించి ఉంటుంది. నేలపట్టు అనేది విదేశీ పక్షుల విడిది కేంద్రం. ఇక్కడి పక్షుల సందడి, పరిశోధనలు సాగుతున్న నేపథ్యంలో పక్షుల పండుగ 2001 నుంచి ప్రారంభమైంది. ఇక్కడికి వస్తున్న పక్షులు, పరిశోధనలు, పక్షి ప్రేమికులు, ఔత్సాహికుల ఉత్సాహం వంటి కథనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ ప్రదేశాలు పర్యాటకానికి కూడా అనుకూలంగా మలచడం ద్వారా ఆహ్లాదంగా సేద తీరడానికి అనువైన వాతావరణాన్ని కూడా కల్పించారు. రెవెన్యూ పర్యవేక్షణలో అటవీ శాఖ, పర్యాటకశాఖ, నీటిపారుదల శాఖలను కూడా సమన్వయం చేయడం ద్వారా ఈ ఏడాది జనవరిలో పక్షుల పండుగ ఘనంగా నిర్వహించారు.
2026 జనవరిలో...
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ సారధ్యంలోనే ఈ సంవత్సరం జనవరిలో కూడా మూడు రోజుల పాటు పులికాట్ సరస్సు వద్ద పడవ ప్రయాణం, నేలపట్టు వద్ద పక్షుల సందర్శన, సూళ్లురుపేటలో సాంస్కృతిక వైభవం అట్టహాసంగా నిర్వహించారు.
2026 జనవరిలో మళ్లీ అదే తరహాలో నేలపట్టు, పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించారు. అధికారులతో ఆయన మాట్లాడారు.
"పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మాదిరే ఫ్లెమింగ్ ఫెస్టివల్- 2026 జనవరిలో నిర్వహిద్దాం. ఫ్లెమింగో ఫెస్టివల్‌ మైక్రో ప్లాన్ ( Flamingo Festival Micro Plan) సిద్ధం చేయండి" అని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. పక్షుల పండుగకు తేదీలు ఖరారు చేయడం తోపాటు గతానికి ఏమాత్రం తీసిపోని విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. పర్యాటక కేంద్రాల వద్ద సదుపాయాలు, వేదికల ఏర్పాటు, పులికాట్, నేలపట్టు ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై బ్లూప్రింట్ సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచనలు చేశారు.
నేలపట్టు ఎక్కడ ఉంది?

నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని నేలపట్టు సమీపంలోని పక్షుల విడిది కేంద్రంలో ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరిలో నిర్వహించనున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో నేలపట్టు విదేశీ పక్షులకు కేంద్రం ఉంది. నేలపట్టు గ్రామం వద్ద చెరువులేనే కాకుండా, పులికాట్ సరస్సు విస్తరించిన నీటి పరీవాహక ప్రాంతంలో కూడా విదేశీ పక్షుల సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో విదేశీ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి, ఆహారం సంతానోత్పత్తి కోసం వచ్చే పెలికాన్ పక్షులకు దక్షిణ ఆసియాలోని అతి పెద్దదిగా నేలపట్టు విడిది కేంద్రంగా మారింది.
రాష్ట్ర ఉత్సవంగా ఉండాలి..
సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్, నేలపట్టు వద్ద నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ఉత్సవంగా నిలబెట్టే విధంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యాటక, అటవీ శాఖాధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ శాఖలతో మిగతా ప్రభుత్వ విభాగాల అధికారులు తమ సిబ్బందిని సమన్వయం చేయాలన్నారు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ కార్యాచరణ ప్రణాళిక త్వరగా తయారు చేయాలన్నారు.
ప్రమోషనల్ వీడియా..
పక్షుల పండగ నిర్వహణపై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ గుర్తు చేశారు. జిల్లాలోని వారికే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి తెలిసేలా ఆకర్షణీయమైన ప్రమోహసనల్ వీడియా, టీజర్ కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు ప్రత్యేకంగా సూచన చేశారు.
ఏ దేశాల పక్షుల వస్తాయంటే..

నేలపట్టు పక్షుల విడిది కేంద్రానికి, బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటిక్ ఆ ప్రాంతాల నుంచి కూడా శీతాకాలంలో పక్షులు వలస వస్తుంటాయి. నేల పట్టుకు చేరుకునే ఫ్లెమింగోతోపాటు పెలికాన్, సైబీరియన్ కొంగలతో పాటు విదేశీ పక్షులను ఈ ప్రాంతంలో విశిష్ట అతిథులుగా ప్రేమించడమే కాదు. వాటి రాక కోసం దొరవారిసత్రం మండలంలోని గ్రామాల ప్రజలు శీతాకాలం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.
మూడు రోజుల పండుగ..
2026 జనవరిలో నేలపట్టు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మూడు రోజులపాటు విదేశీ పక్షులు విడిది చేసే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి నిలయంగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం తో పాటు ఇదే నియోజకవర్గంలోని తడ మండల కేంద్రాల్లో కూడా పక్షుల పండుగతో కొత్త కళ సంతరించుకోనుంది. ఈ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ ఐదు ప్రాంతాల్లో నిర్వహించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప షార్ సమీప రహదారి, బీవీ పాలెం పులికాట్ సరస్సు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సూళ్లూరుపేట, శ్రీ సిటీ ప్రాంతాల్లో నిర్వహించారు.
మత్స్య శాఖ అధికారులు పులికాట్ సరస్సు (Pulicat Lake )వద్ద బోటు ప్రయాణానికి ఏర్పాటు చేసింది. అక్కడ బోట్లు, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. గతానికి ఏమాత్రం తీసిపోకుండా, జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలను మరింతగా మమేకం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
Read More
Next Story