Flamingo festival: సూళ్లూరుపేటలో పక్షుల పండుగ
విదేశీ వలస పక్షులు సందడి చేశాయి. ఈ దేవతా పక్షులకు జిల్లా అధికారులు పండుగ చేశారు
సంక్రాంతి తర్వాత వెంటనే సూళ్లూరుపేటకు మరో పండుగ వచ్చింది. పక్షుల పండుగ నేపథ్యంలో పట్టణంతోపాటు సమీప గ్రామాలు సందడిగా మారాయి. ఆటపాటలతో పిల్లలు సందడి చేశారు. గ్రామీణ కళలను జానపద కళాకారులు వేషాలతో ప్రతిబింబించారు
వలస పక్షులు రెక్కలు విప్పి ఆకాశంలో విహరిస్తున్నాయి. ఇంకొన్ని నీటిలో ఆహారం కోసం అన్వేషిస్తూ కనిపించాయి. వాటిని చూస్తున్న పిల్లలు నేలపై నాట్యం చేస్తూ ఆనందంతో గంతులు వేశారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ప్రారంభ వేడుక శనివారం ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లాంఛనంగా ప్రారంభించారు. పక్షుల విహారాన్ని ఆస్వాదిస్తూ తెల్లటి దుస్తులు ధరించిన బాల బాలికలు నెమలికి నడకలు నేర్పినట్లు నాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విదేశీ పక్షులకు విడిదిగా ఉన్న నేలపట్టు పర్యావరణ, పక్షి ప్రేమికులతో సందడిగా మారింది.
పక్షుల పండుగ ప్రారంభ సూచికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. పల్లెల జీవనాడిని చాటి చెప్పే జానపద కళారూపాలతో ఆకట్టుకున్నారు. అధికారుల తో పాటు పట్టణంలోని ప్రజలు విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ బి వెంకటేశ్వర్ తో సహా అధికారులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ ఆవిష్కరించారు.
ఆట పాటలతో సందడి
సంస్కృతి, సంప్రదాయం, జీవవైవిద్యం ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తున్న పక్షుల పండుగలో పిల్లలే కాదు. పెద్దలు కూడా రెక్కలు తొడిగిన ఆనందంతో ప్రకృతిని ఆస్వాదిస్తూ, పక్షుల పండుగలో మమేకమయ్యారు.
విదేశీ వలస పక్షులకు నిలయమైన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు పక్షుల విడిది కేంద్రం వద్ద శనివారం సాయంత్రం వరకు సందడిగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పక్షుల ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షులను తమ కెమెరాలు బంధించేవారు కొందరైతే. నింగి నేలపై ఉన్న పక్షుల కదలికలను గమనిస్తూ పిల్లలు ఆనంద పారవశ్యానికి లోనయ్యారు.
Next Story