అవకాశం ఇస్తే.. మహిళలే గెలుపు గుర్రాలు కాలేరా!?
x

అవకాశం ఇస్తే.. మహిళలే గెలుపు గుర్రాలు కాలేరా!?

మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం తగ్గుతోంది. ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారడంతో, పార్టీలు అవకాశాలివ్వలేకున్నాయా? ఈ సమస్యకు మహిళా రిజర్వేషన్ పరిష్కారమవుతుందా..


ఆకాశంలో సగం. అవకాశాల్లో సగం. మహిళా దినోత్సవం, ప్రత్యేక సందర్భాల్లో మహిళలను ఇలా కీర్తిస్తుంటారు. వారు జనాభాలోనే కాదు. ఓటర్లుగా కూడా సగం వంతు ఉన్నారు. అయినా వారి ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గుతోంది. "గెలుపు గుర్రాలకే అవకాశాలంటూ" రాజకీయ పార్టీలు మహిళలకు ఇస్తున్న అవకాశాలు తక్కువ. పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళల విజయావకాశాలను దెబ్బతీస్తున్నారు. ఎన్నికలు అత్యంత ఖరీదుగా మారిన పరిస్థితుల్లో.. ప్రత్యర్థులపై విజయం సాధించే వారి సంఖ్య కూడా తక్కువ అవుతోంది.

ఈ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి 2024 జమిలి ఎన్నికల వరకు మహిళలకు ఇచ్చిన అవకాశాలు, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంఖ్యను పోల్చి చూస్తే, తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. రాయలసీమలోని కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాయలసీమకు చిటికెన వేలులా ఉన్న నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష కూటమి.. మహిళలకు ఇచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే..

టిడిపిలో నో ఛాన్స్

2024: చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, టిడిపి ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదు. అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నగరి అసెంబ్లీ స్థానం నుంచి ఆర్కే రోజా మూడోసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు రెండుసార్లు ఆమె ఓటమి చెందారు. గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి కృపారాణి మొదటిసారి పోటీ చేస్తున్నారు.

వైఎస్ఆర్ సీపీలో నో ఛాన్స్

నెల్లూరు: జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే, కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టిడిపి అవకాశం కల్పించింది. సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ కూడా టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు అసెంబ్లీకి వెళతారనేది ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటుంది.

కడపలో ఒకరే..

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్రాంతం కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బద్వేలు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈమెపై కూటమి బిజెపి అభ్యర్థిగా రోశయ్య పోటీలో ఉన్నారు. టిడిపి ఒక్క మహిళ అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశం కల్పించలేదు. 2009 ఎన్నికల్లో కమలమ్మ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమెకు అవకాశం దక్కలేదు.

2004 ఎన్నికల్లో సీనియర్ నాయకురాలు, రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి కొండూరు ప్రభావతమ్మ ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గతంలో రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి సరస్వతమ్మ మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

"అనంత"లో ఐదుగురికి అవకాశం

జిల్లాలో వైయస్ఆర్సీపీ ఒకరికి మాత్రమే అవకాశం కల్పించింది. టిడిపి నలుగురిని పోటీ చేయించింది. వారిలో.. పెనుకొండలో టిడిపి అభ్యర్థిగా ఎస్. సవితమ్మ, వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా శాసనసభలో మహిళా ప్రాతినిధ్యం ఉంటుంది. సింగనమల అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బండారు శ్రావణిశ్రీ పోటీ చేస్తున్నారు. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీతమ్మతో సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్టపర్తి అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు టిడిపి అభ్యర్థిగా పల్లె సింధూరరెడ్డి పోటీలో ఉన్నారు. సింగనమల, రాప్తాడు, పుట్టపర్తి సెగ్మెంట్లలో అధికార వైఎస్ఆర్సిపి పురుష అభ్యర్థులతోనే పోటీ పడుతున్నారు. పెనుగొండ అసెంబ్లీ స్థానంలో ఇద్దరు మహిళలు కావడం వల్ల వారిలో ఒకరు అసెంబ్లీకి వెళ్లడం ఖాయం. మిగతా మూడు నియోజకవర్గాల్లో టిడిపి నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులలో ఓటర్లు ఎవరిని అసెంబ్లీకి పంపించనున్నారు అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

ముగ్గురికి అవకాశం..

కర్నూలు: జిల్లాలో వైఎస్ఆర్సిపి ఇద్దరికీ, టిడిపి ఓ మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించింది. జిల్లాలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుక, పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి అవకాశం కల్పించింది. పాణ్యం అసెంబ్లీ స్థానం నుంచి గౌరవ చరిత టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురితో టిడిపి అభ్యర్థులుగా ఎమ్మిగనూరులో జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురు మహిళా అభ్యర్థులతో పురుషులే పోటీపడుతుండడం గమనించదగ్గ విషయం. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉన్నందువల్ల ఏ మహిళ అసెంబ్లీకి వెళతారు అనేది ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తేలనుంది.

ఈ విషయాలపై ఐద్వా తిరుపతి జిల్లా అధ్యక్షురాలు సాయిలక్ష్మి ఏమంటున్నారంటే... " మహిళలకు అన్ని రంగాలతోపాటు రాజకీయ పదవుల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే పరిష్కారం" అన్నారు. 1996 నుంచి ఈ అంశం నలుగుతూనే ఉంది. "మినహా చట్టం చేయడంలో మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా ముందడుగు వేయడం లేదు. మీరన్నట్లు.. ఓటర్లలో సగం వంతు మహిళలే ఉన్నారు. అయినా ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిణించడమే జీర్ణించుకోలేని విషయమని" సాయి లక్ష్మి వ్యాఖ్యానించారు.

" మహిళలకు పదవులు ఇస్తే వారి భర్తలు పెత్తనం చెలాయిస్తారు" అనే మాటలు కూడా వింటున్నాం. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడంలో మహిళలను మించిన వారు లేరు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. పదవులు వరకు వచ్చేసరికి ఎందుకు మహిళలపై అపవాదు" ఈ పద్ధతి మారాలి. రాష్ట్ర విభజన అంశాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించిన పాలకులకు.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంలో ఆ చిత్తశుద్ధి ప్రదర్శించే ఔదార్యం ఎందుకు లేదు? అని సాయి లక్ష్మి సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో ప్రధానంగా అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతోంది. మహిళలు పోటీ చేసే చోట రాజకీయ పార్టీలు పురుషులను కూడా రంగంలోకి దించుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే ఈ పరిస్థితి ఉండదు కదా అని సాయిలక్ష్మి విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా..

తగ్గిన ప్రాతినిధ్యం

2019 ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు, నెల్లూరు జిల్లాలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే చాలా తగ్గిపోయింది. నెల్లూరు జిల్లా నుంచి ఒక్కరు కూడా లేరు. కడప జిల్లా బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి డాక్టర్ సుధా ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మిగతా తొమ్మిది స్థానాల్లో అంత పురుషులే పోటీ చేశారు. అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్సిపి నుంచి విజయం సాధించారు. మిగతా 12 నియోజకవర్గాల్లో పురుష అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. చిత్తూరు జిల్లాలో నగరి అసెంబ్లీ స్థానం నుంచి ఆర్కే రోజా రెండోసారి విజయం సాధించారు. ఇలా ప్రతి ఎన్నికకు మహిళ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తోంది.

తగ్గిన ప్రాధాన్యత

2014 సార్వత్రిక ఎన్నికల్లో విజేతల తీరును పరిశీలిస్తే రెండు జిల్లాల్లో అసలు ప్రాతినిధ్యం లేదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 62 అసెంబ్లీ స్థానాలు ఉంటే, నెల్లూరు, కడప జిల్లాలోని 20 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం వహించలేదు. ఆ దిశగా అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం స్పష్టమవుతోంది.

ఇదే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నుంచి ఆర్కే రోజా వైఎస్ఆర్సిపి, చిత్తూరు స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా డీకే సత్యప్రభ గెలుపొందారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి శోభా నాగిరెడ్డి వైఎస్ఆర్సిపి, పాణ్యం స్థానం నుంచి గౌరు చరిత రెడ్డి గెలుపొందారు. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పరిటాల సునీతమ్మ, సింగనమల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి యామిని బాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిద్దరు కూడా రాజకీయంగా, ఆర్థికంగా సమర్థులు కావడం వలన ఇది సాధ్యమైంది అనేది అందరికీ తెలిసిందే.

మహిళలకు అవకాశాలు ఎక్కువ ఉండాలని అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీ మహిళా సంఘం నాయకురాలు గాయత్రి దేవి మాట్లాడుతూ.. " మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని మనసు, ఉదార స్వభావం, విస్తృతమైన అవగాహన పార్టీల అధ్యక్షులకు ఉండాలి" అని అభిప్రాయపడ్డారు. " రాజకీయాలు వ్యాపారమయంగా మారిన ఈ పరిస్థితుల్లో.. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ పరిస్థితిని చక్కగా మహిళలకు కూడా అవకాశాలు ఇవ్వాలి అనే అభిప్రాయం స్వచ్ఛందంగా కలగాలి" అని గాయత్రీ దేవి అభిప్రాయపడ్డారు. "సమాజం, హక్కులు, అవకాశాల కోసం పనిచేసే వారు ఎవరనేది.. ఆయా పార్టీల నాయకులకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తే, రాజకీయ రంగంలో కూడా మహిళలు రాణించడానికి అవకాశం ఉంటుంది" అని గాయత్రీ దేవి విశ్లేషించారు.

ఇద్దరే ఎంపీ అభ్యర్థులు

రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో రెండు పార్లమెంటు స్థానాల నుంచి మాత్రమే మహిళలు పోటీలో ఉన్నారు. వారిలో కడప ఎంపీ స్థానం నుంచి పిసిసి అధ్యక్షురాలు వైఎస్. షర్మిల రెడ్డి స్వయానా సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి పై పోటీ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి బైరెడ్డి శబరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మిగతా 8 స్థానాల్లో పురుషులే పోటీలో ఉండడం గమనార్హం. అధికార వైఎస్ఆర్సిపి ఎవరికి అవకాశం కల్పించలేదు. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి బుట్టా రేణుక వైఎస్ఆర్సిపి నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె ఆ పార్టీకి దూరమయ్యారు. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ వైఎస్ఆర్ సీపీలోకి వచ్చిన ఆమె, ప్రస్తుతం ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

Read More
Next Story