మోహన్ బాబు రూటే సపరేటు..?
x

మోహన్ బాబు రూటే సప'రేటు'..?

సినీరంగంలోనే కాదు. విద్యా వ్యవస్థలోనూ మంచు మోహన్ బాబు శైలి విలక్షణమైనది. ఆయన ప్రైవేటు వర్సిటీపై తల్లిదంద్రుల కమిటీ ఏమని ఫిర్యాదు చేసింది.


విలక్షణ నటనకు మారుపేరు మంచు మోహన్ బాబు. సంచలన వ్యాఖ్యలు చేయడంలో కూడా ఏమీ తీసిపోరు. ముక్కుసూటిగా వ్యవహరించే మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)పై తల్లిదండ్రుల కమిటీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్రప్రధాన్ తో పాటు ఏఐసీటీఈకి కూడా ఫిర్యాదు చేశారు. అందులో..



"కన్వీనర్ కోటాలో సీటు తీసుకున్న వారి నుంచి నిర్ణీత ఫీజులుకు మించి వసూలు చేస్తున్నారు" అని ఆరోపించారు. "బలవంతపు ఫీజులు కూడా రుద్దుతున్నారు" అని అందులో ప్రస్తావించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మోహన్ బాబు యూనివర్సిటీ అధికార ప్రతినిధులు ఎవరూ స్పందించడం లేదు.

"విద్యార్థులతో బలవంతంగా యూనిఫాం కొనుగోలు చేయిస్తున్నారు. డే స్కాలర్స్ కూడా కచ్చితంగా మెస్ లోనే భోజనం చేయాలి" అనే నిబంధన పెట్టారని తల్లిదండ్రుల కమిటీ ఆరోపించింది. మాట వినకుంటే, బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారు" అని కూడా ఘాటుగా ఆరోపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మోహన్ బాబు వర్సిటీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం (ఎంబీయూ) తిరుపతికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం. 1992 లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను 2022 జనవరి నుంచి మోహన్ బాబు విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇది అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి, ఇంజినీరింగ్, లిబరల్ ఆర్ట్స్ అండ్ బేసిక్ సైన్సెస్, అగ్రికల్చర్, పారామెడికల్, కామర్స్, మీడియా, ఫిల్మ్-అకాడమీ ఆధారిత ఫోకస్డ్ కోర్సులలో అకడమిక్ ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్సిటీ ఛాన్సలర్ గా డాక్టర్ మంచు మోహన్ బాబు, వీసీగా నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ గా కే. సారధి, ప్రొ వైస్ ఛాన్సలర్ గా మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు.

ఈ వర్సిటీగా రూపాంతరం చెందకముందు కూడా.. ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరు ఉంది. అడ్మిషన్ల దరఖాస్తులో ఇక్కడ కులం కాలం ప్రస్తావన ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే విలువలను ఈ సంస్థ పాటిస్తోంది. రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారనే మంచి పేరు ఉంది. కాగా, మొదటిసారి ఆరోపణలకు గురైందని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫిర్యాదు సారాంశం ఇది
మోహన్ బాబు విశ్వవిద్యాలయం (ఎంబీయూ) ఇంజినీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటా సీటుకు ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
కన్వీనర్ కోటా కింద ఇంజనీరింగ్ ఫీజు 1,03,000
బిల్డింగ్ ఫీజు రూ. 37,000 కచ్చితంగా చెల్లించాలి.
వర్సిటీలో బిల్డింగ్ లేకుండానే యూజీసీ ఏఐసీటీ ఏపీహెచ్ఆర్సీ కళాశాల, యూనివర్సిటీ కి ఏలా అనుమతించింది? మేమెందుకు ఆ ఫీజుల చెల్లించాలి? ఫీజు ఇలా వసూలు చేయమని ఏ చట్టం చెబుతోంది? అని ప్రశ్నించారు.

కచ్చితంగా చెల్లించాల్సినవి
ఐటీ ఫీజు రూ. 8000
బస్సు ఫీజు రూ. 26,000
యూనిఫామ్ ఫీజు రూ. 10,500
డే స్కాలర్ మెస్ ఫీజు రూ. 20,000
ఏడాదికి మొత్తం రూ. 2,05,000
ఇదే పరిస్థితి అన్ని ప్రైవేటు యూనివర్సిటీ లు, కాలేజీల్లో ఉంది. ఇదెక్కడి న్యాయం? ఈ యూనివర్సిటీలకు యూజీసీ ఎలా అనుమతి ఇచ్చిందో సమాధానం చెప్పాలి అని కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 -24లో గుర్తింపు పొందిన నాలుగు యూనివర్సిటీలకు ఒక రకమైన ఫీజు, పాత ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకరకమైన ఫీజు ఏమిటని ప్రశ్నించారు.

ఒక్కో కాలేజీకీ ఒకో ఫీజా?
ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజు లు ఒకో కాలేజీకి ఒకో రకంగా వసూలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. కనిష్ట రుసుం రూ. 43 వేలు, గరిష్టంగా రూ. లక్ష సిఫార్సు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మెజార్టీ కాలేజీలు రూ. 43 వేల ఫీజు కేటగిరీ కిందకు వస్తాయి అని కూడా అందులో గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కన్వీనర్ కోట ద్వారా అనుమతి పొందిన కొత్త, ప్రైవేటు వర్సిటీలకు, ఇంజినీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల మధ్య ఫీజులు నిర్ణయం, భారీ వ్యత్యాసం ఉందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

అంతా బిజీ
ఈ వ్యవహారంపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం అధికార ప్రతినిధులు నోరు మెదపడం లేదు. యూనివర్సిటీ వీసీ లేదా రిజిస్ట్రార్తో మాట్లాడాలని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి రెండు రోజులుగా ప్రయత్నించారు. ఫోన్ 0877 2504888 నంబర్ కు కాల్ చేస్తే, రిసెప్షనిస్ట్ ప్రశ్నలవర్షం కురిపించారు.

"ఎవరు కావాలి? ఏమి మాట్లాడాలి? అనే ప్రశ్నల నుంచి వీసీగారు ఉర్లో లేరు. రిజిస్ట్రార్ గారు మీటింగ్ లో బిజీగా ఉన్నారు. రేపు (గురువారం) కాల్ చేయండి. మీడియా వ్యవహారాలు చూసే, తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ రవిచంద్రబాబుతో మాట్లాడతారు" అని సమాధానం వచ్చింది. ఆమె చెప్పిన సమయానికి కాల్ చేస్తే, గురువారం ఉదయం సమాధానం లేదు. మోహన్ బాబు యూనివర్సిటీ అధికారులతో మాట్లాడడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వర్సిటీపై వస్తున్న ఆరోపణలపై కూడా యాజమాన్యం స్పందించిన దాఖలాలు లేవు. దీనిపై సంస్థ వ్యవస్థాపకుడు మంచు మోహన్ బాబు స్పందనతో ఆరోపణలకు తెరపడే అవకాశం ఉంది.
Read More
Next Story