చిన్న రాష్ట్రానికి ధీటుగా రూ. 5,100 కోట్ల బడ్జెట్ అంచనాలతో పాలన సాగించే టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతర శాఖలతో పాలన ఉంటుంది. ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగా తిరుమలలో మఠాలు పోటీగా మారాయి. ఏటా దాదాపు రూ.200 కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని చెబుతున్నారు. వీటిపై టీటీడీ ఈఓ జే. శ్యామలరావు దృష్టి కేంద్రీకరించినట్లు కనిపించడం లేదు. మఠాలను ఈవెంట్ మేనేజిమెంట్ కేంద్రాలుగా మార్చడంతో పాటు ప్రవచనాలు వినిపించాల్సిన చోట వ్యాపారకేంద్రాలుగా మార్చిన వ్యవహారంపై మఠాధిపతులు, పీఠాధిపతులు జోక్యం అనివార్యమైందని భావిస్తున్నారు. కొన్ని మఠాలు లీజుకు కూడా ఇచ్చాశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీటీడీలో 2008 డిసెంబర్ లో కొత్తగా భవానాలు కట్టకూడదనే తీర్మానం చేశారు. గోగర్భం డ్యాంకు సమీపంలో కొండలు పిండి అవుతున్నాయి. అడవిని ఛిద్రం చేసి, యధేచ్ఛగా భవనాలు నిర్మించారు. ఇంకా నిర్మాణంలో కూడా ఉన్నాయి. ఇప్పటికే మఠాలకు ఆ ప్రాంతాల్లో స్థలాలు కూడా కేటాయించారు.
"టీటీడీలో ఈ తరహా తీర్మానాలు చాలాసార్లు చేశారు. అమలులో మాత్రం కనిపించడం లేదు" అని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.
"మఠం అంటే ప్రశాంతత. దైవచింతన. ఆధ్యాత్మికత" ఇవే ప్రధానాంశాలు. మఠాల్లో సేవాభావం కాకుండా, వ్యాపార ధోరణిపై మరోసారి చర్చ తెరమీదకు వచ్చింది. కొందరైతే ఏకంగా రియల్ ఎస్టేట్ తరహా వ్యవహారం సాగించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట వసతి కోసం పాకులాడుతారు. ఇక్కడే తిరకాసు ఉంది.
ఇదిగో సాక్ష్యం..
కడప జిల్లా పుష్పగిరి మఠానికి తిరుమలలో 1997లో టీటీడీ కేటాయించిన స్థలంలో భక్తులు ఇచ్చిన విరాళాలతో 34 గదులతో 2003లో భారీ భవన సముదాయం నిర్మించారు. దాతలకు సంవత్సరంలో కొన్ని రోజులు గదులు కేటాయిస్తారు. మిగిలిన రోజుల్లో సిఫారసు లేదా పూర్వ పరిచయాలతో వచ్చే భక్తులకు గదులు కేటాయిస్తారు. ఇంతవరకు ఫరవాలేదు.
పుష్పగిరి మఠంలో రియల్ ఎస్టేట్ తరహాలో గదులు విక్రయించారు. తెలంగాణ లోని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థతో 2009 జూన్ పదో తేదీ మళ్లీ తిరిగి చెల్లించేందుకు ఆస్కారం లేని విధంగా రూ. కోటితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడు గదులు జీవితకాలానికి కేటాయించారు. అప్పటి నుంచి ఆ గదులు సింగరేణి సంస్థ పరిధిలో ఉన్నాయి. మచ్చుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఆ తరహాలో ఎన్ని మఠాలు, సత్రాల్లో ఒప్పందాలు జరిగాయనేది అంతుచిక్కని రహస్యమే.
ఈ విషయమై వెబ్ సైట్లోని పుష్పగిరి మఠం మేనేజర్ తో మాట్లాడేందుకు 0877 2277419 నంబర్ కు కాల్ చేసినా సమాధానం లేదు. వారి నంబర్లు కొందరికే తెలుస్తాయి. వారికి మాత్రమే సమాధానం ఇస్తారనేది బహిరంగ సత్యం.
కొండపై మఠాల నేపథ్యం..
తిరుమల కొండపై ఉన్న మఠాలకు చారిత్రక నేపథ్యం ఉంది. వైష్ణవ సంప్రదాయంలోని పీఠాధిపతులకు 2004 వరకు కర్ణాటకలోని మైసూరులోనిపెజావర్, శృంగేరి, హంపి, తమిళనాడులోని కంచి, శ్రీరంగం కడప జిల్లా పుష్పగిరి, అహోబిలం పీఠాధిపతులతో సహా 18 మఠాలు మాత్రమే మఠాలు ఉండగా, ఆ సంఖ్య 33కు చేరింది. ఆ తరువాత రాజకీయ ప్రేరేపిత సిఫారసు నేపథ్యంలో వేలూరు బంగారు అడిగళార్ మఠం కోసం అమ్మ భగవాన్కు కు కూడా మఠం నిర్మాణానికి స్థలం కేటాయించారు. వీటితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా పోటీ పడడం వల్ల ఆ సంఖ్య దాదాపు 50కు చేరింది.
1980కు ముందు వరకు తిరుమలలో మాడవీధుల్లో మాత్రమే ఉన్న ఈ మఠాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు తాత్కాలిక వసతికి విశాలమైన హాళ్లు, ఉచిత అన్నదానం ఉండేది. ఇక్కడ విడిది చేసే పీఠాధిపతులు ధార్మిక ఉపన్యాసాలు, భక్తులకు ఆశీర్వచనాలు అందించే వారు. మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా మాడ వీధుల్లో మఠాలు, నివాసాలను ఖాళీ చేయించారు. మఠాలకు కొండలు తవ్వి స్థలాలు కేటాయించింది. పీఠాధిపతులతో పూజలు, ధార్మిక ఉపన్యాసాలు, శ్రీవారి కీర్తనలు ప్రతిధ్వనించాల్సిన చోట ప్రస్తుతం ఇవన్నీ పక్కదారి పట్టాయి. భక్తుల్లో ఆధ్యాత్మిక పెంచడం అంటుంచి, పూర్తిస్థాయి వ్యాపారంగా మారాయి.
పేరుకే ధర్మప్రచారం...
తిరుమలలో ధర్మప్రచారం కోసం ఏర్పాటు చేసిన మఠాల్లో పీఠాధిపతులు రావడం, ఇక్కడ విడిది చేయడం చాలా వరకు తగ్గింది. వచ్చిన వారు ఒకటి రెండు రోజులకు మించి విడిది చేయడం లేదు. వారంతా ఈ పరిస్థితుల్లో వ్యాపారాత్మక ధోరణి పెరిగిపోయింది. మఠాలు కాస్తా, పక్కా వ్యాపారంగా మారిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు ఉన్న ఈ కేంద్రాలకు మేనేజర్, సూపర్ వైజర్లు, ఈవెంట్ మేనేజర్లు రంగ ప్రవేశం చేశారు.
వ్యాపారమయంగా మారింది..
తిరుమలలో గది దొరకడం చాలా కష్టం. అతికష్టంపై దొరికినా, ఒకరోజుకు మించి ఉందనివ్వరు. అతిథి గృహాలు, మఠాల్లో గది దొరకడం చాలా సులభం. కాకుంటే, పచ్చనోట్ల వద్ద రాజీ పడకూడదు. టీటీడీ విఐపీ గదుల కోసం వెళ్లే వారిని మఠాల వద్దకు వెళ్లండని సిబ్బందే సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మఠాల వెనుక చేరిన ముఠాలు ధర్మప్రచారానికి బదులు ధనార్జన సాగిస్తున్నాయి. తిరుమలలో టీటీడీ ఆధీనంలోని వివిధ కేటగిరీల్లో ఉన్న 7000 గదులు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. దీనికి సమాంతరంగా మారిన సుమారు 50 మఠాల్లో దాదాపు 500 గదుల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గదులు రూ.800 నుంచి 3000 వరకు అద్దె తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శుక్ర, శని, ఆదివారం ఆ అద్దె మరింతగా ఉంటుందనేది స్థానికులు చెబుతున్న మాట.
అది ఎలాగంటే...
దాతల సహకారంతో చాలా వరకు మఠాలు, సత్రాలు నిర్మించారు. వారు లేదా సంబంధీకులు వస్తున్నట్లు అక్కడి మేనేజర్లకు సమాచారం ఇస్తారు. ఆ మేరకు సంపన్న యాత్రికులకు వసతి కల్పించడంతో పాటు శ్రీవారి దర్శన టికెట్ కూడా ఏర్పాటు చేస్తారు. టీటీడీ వసూలు చేసే అద్దెకు, సత్రాలు, మఠాల మేనేజర్లుగా చెప్పుకునే వారు వసూలు చేసే మొత్తానికి సంబంధమే ఉండదనేది బహిరంగ రహస్యం. అంతేకుకుండా, రద్దీ సమయాల్లో కూడా టీటీడీ గదులు లేకపోవడం ఆసరాగా చేసుకుని, మఠాల వైపు మళ్లిస్తున్నారు. ఈ తరహాలో అత్యంత ఖరీదైన గదులు, దర్శనం కల్పించ సదుపాయాల ద్వారా ఆయా కేంద్రాల్లో ఉన్న వారు ఏటా టీటీడీకి ఏటా రూ.ప 200 కోట్లు గండికొడుతున్నారనే అభిప్రాయపడుతున్నారు.
జనసేన తిరుపతి జిల్లా నేత కిరణరాయల్ మాట్లాడుతూ, "స్వయంగా తనకే ఆ పరిస్థితి ఎదురైంది" అని గుర్తు చేశారు. "ఈ వ్యవహారాలు తిరుమలలో నిత్యకృత్యంగా సాగుతున్నా, టీటీడీ విజిలెన్స్ విభాగం ఎందుకు స్పందించడం లేదో..? అర్థంకాదు. టీటీడీ అధికారలుు కూడా పట్టించుకోరు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే..
ఈవెంట్ కేంద్రాలుగా మఠాలు
భగవత్ ఆరాధన జరగాల్సిన చోట గదుల కేటాయింపు, ఫంక్షన్ హాళ్లుగా మార్చిన చోట ఈవెంట్ మేనేజర్లు కూడా రంగ ప్రవేశం చేశారు. వారి ద్వారా మఠాల్లో కల్యాణాలు నిర్వహిస్తున్నారు. ఒక వివాహం జరిపించాలంటే రూ. 30 వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. పూలతో అలంకరించడానికి దాదాపు రూ.50 వేలు, పెళ్లి భోజనం ఏర్పాటుకు రూ.1.50 లక్షలుగా నిర్ణయించారనే విషయం బహిరంగ రహస్యం. ఆ మేరకు వారికి అనుమతి ఉందని చెబుతున్నారు. ఇది ఎవరు మంజూరు చేశారు? అనేది మాత్రం చెప్పడం లేదు. ఎక్కడో దూరప్రాంతాల్లో ఉండే పీఠాధిపతులకు ఇవన్నీ తెలియకుండానే జరుగుతున్నాయా? అనేది కూడా చర్చకు తెరతీసింది. ఇంతజరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రాణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పీఠాధిపతులు ఈ మఠాల్లో ఎక్కువ రోజులు మకాం వేయడానికి తిరుమలకు వస్తే మినహా, ఈ తరహా వ్యవహారాలకు తెరపడే అవకాశం ఉండదని అంటున్నారు.
ఒకో కార్యక్రమానికో రేటు..
ఇంటర్నెట్ లో తిరుమలలోని మఠాలు ఉన్నట్లు చూపించడం వరకే ఫరవాలేదు. ధార్మిక ప్రవచనాల వివరాలకు బదులు గదులు అందుబాటులో ఉన్న విషయంతో పాటు, వివాహం చేయించడానికి ఫీజు ఎంత చెల్లించాలి? గదుల అద్దె ఎంత? వంటి వివరాలు బాహాటంగా దర్శనం ఇస్తున్నాయి. అనేక ప్రైవేటు వెబ్ సైట్లు కూడా ఆ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తిరుమల కొండపై ఉన్న మఠాలు, సత్రాల్లో ఇద్దరు వ్యక్తుల హవా విపరీతమైనట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై
తిరుమలలోని కంచి మఠం మేనేజర్ ను సంప్రదించడానికి ఫోన్ నంబర్ 0877 2277379కు ఫెడరల్ ప్రతినిధి కాల్ చేశారు. "మేనేజర్ లేరు. నేను ఇక్కడ పనిచేస్తా" అని సమాధానం ఇచ్చారు. "డోనర్లకు మాత్రమే గదులు ఇస్తాం. ఇతరులకు కాదు" అని చెప్పిన ఆయన మిగతా విషయాలు మాట్లాడడానికి నిరాకరించి, ఫోన్ కట్ చేశారు.
ఆనంద నిలయాన్ని మించిన ఎత్తులో...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఆలయానికి చుట్టూ శేషాచలం కొండలు విస్తరించి ఉంటాయి. శ్రీవారు కొలువైన మూలవిరాట్టుపై ఆనందనిలయాన్ని మించిన ఎత్తులో అతిథి గృహాలు, మఠాలు వెలిశాయి. అందులో పాపవినాశనానికి వెళ్లే మార్గంలోని గోగర్భం డ్యాం సమీపంలో కొండపై రిలయన్స్ సంస్థ అతిధి గృహం ఉంటే, దానిని మించి విశాఖ శారదాపీఠం భవనాలు ఆరు అంతస్తులతో నిర్మిస్తున్నారు. కేటాయించిన స్థలాన్ని మంచి, వరదనీటి ప్రవాహం కాలువను కూడా ఆక్రమించి, చదును చేయడం వివాదాస్పదంగా మారింది.
"అక్రమంగా నిర్మిస్తున్న శారదమఠం భవనాలు కూల్చాలి. లేదా స్వాధీనం చేసుకోవాలి" అని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. "వ్యాసరాజమఠం ద్వారా కూడా దాదాపు రూ. వంద కోట్లకు పైగానే టీటీడీకి గండి పడుతోంది" అని కూడా ఆయన ఆరోపించారు.
శ్రీకాకుళంలోని ఏ.పీ. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, "విశాఖ శారదాపీఠం పీఠాధిపతి తిరుమలకు రావాలి" అని డిమాండ్ చేశారు. "అక్రమ భవనాల నిర్మాణంపై చర్యలు తీసుకోకుంటే, ఆమరణదీక్షకు కూడా వెనుకాడం" అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సాధు సంపత్తులను రంగంలోకి దించి, తిరుపతిలో నిరసనలకు దిగుతామని టీటీడీ యంత్రాంగానికి అల్టిమేటం ఇచ్చారు. కాగా..
తిరుమలలో విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న మఠం నిర్మాణాలపై టీటీడీ స్పందించింది. "5000 చదురపు అడుగుల్లో మఠం నిర్మాణానికి 30 ఏళ్లు లీజుకు ఇస్తూ, 2005 ఫిబ్రవరిలో పాలక మండలి తీర్మానించింది. పక్కనే ఉన్న 4,817 చదరపు అడుగుల స్థలం మఠం అధికారులు వాడుకుంటున్నారు. 2019లో దానిని క్రమబద్ధీకరించి, అదనపు గదుల నిర్మాణానికి అనుమతించిన అంశం ప్రభుత్వానికి నివేదించాం" అని టీటీడీ ప్రజాసంబంధాల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అశం " రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉంది" అని స్పష్టం చేసింది.