దడ పుట్టిస్తున్న ఒంటరి ఏనుగు
x

దడ పుట్టిస్తున్న ఒంటరి ఏనుగు

కుప్పం ప్రాంతంలో ఒంటరి ఏనుగు బెడద తీరడం లేదు. పొలం వద్ద ఉన్న ఓ రైతును తొక్కి చంపేసింది. అటవీ శాఖ కూడా వెంటనే స్పందించింది.


మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం ప్రాంతంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. మంద నుంచి దారితప్పిన ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తోంది. కాపలా ఉన్న రైతుల ప్రాణాలు తీస్తోంది. తాజాగా ఓ రైతును ఒంటరి ఏనుగు తొక్కి చంపేసింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల అడవులు కూడా విస్తరించి ఉంటాయి. మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలోని రామసముద్రం, శాంతిపురం, గుడుపల్లి మండలాలన్నీ దట్టమైన అటవీ ప్రాంతానికి చెంతనే ఉంటాయి. ఈ అడవులకు సమీపంలోనే ఆయా ప్రాంతాల రైతుల పంటపొలాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలతో పాటు, ఆహార ఉత్పత్తుల పంటలు కూడా సాగు ఎక్కువగా ఉంటుంది. దీంతో,

కుప్పంకు సమీపంలో ఉన్న తమిళనాడు ప్రాంతం నుంచి ఏనుగులు పంట పొలాల పై దాడులకు దిగుతూ ఉంటాయి. ఇటువైపు నుంచి వాటిని మళ్ళిస్తే కర్ణాటక అటవీ ప్రాంతంలోకి వెళ్తాయి. ఆ రాష్ట్ర రైతులు లేదా అటవీ శాఖ అధికారులు వీటిని దారిమల్లిస్తే మళ్లీ కుప్పం ప్రాంతం వైపు వస్తుంటాయి. దశాబ్దాల కాలంగా ఏనుగుల బెడద నుంచి రైతులు పొలాలను, తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది రైతుల ప్రాణాలు ఏనుగుల దాడుల్లో కోల్పోయారు.


తాజాగా.. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. ఈ ఒంటరి ఏనుగు కుప్పం నియోజకవర్గం లోనే కాకుండా, సమీపంలోని పలమనేరు నియోజకవర్గం వీ.కోట ప్రాంతంలో కూడా పంటలను ధ్వంసం చేస్తోంది. సాగులో ఉన్న పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు రామకుప్పం మండలం పిఎంకె తండ వద్ద రెడ్డు నాయక్ కాపలా ఉన్నారు. తండాకు సమీపంలోని సాకలినత్తంకొండ వద్ద పొలం వద్ద వున్న నాయక్ పై ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఆయన పొలం వద్దే ప్రాణాలు కోల్పోయారు.

" రెడ్డు నాయక్ పొలం వద్దకు వెళుతూ ఉండగా, అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు దాడి చేయడంతో మరణించాడు" అని పీఎంకే తండావాసులు తెలిపారు. వారం క్రితం తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు వల్ల పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ మదపుటేనుగు దాడిలోనే తమ గ్రామవాసి చనిపోయారు అనే విషయాన్ని వారు స్పష్టం చేశారు.

అటు తమిళనాడు, ఇటు కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు ఆంధ్ర లోకి చొరబడకుండా గతంలో కందకాలు తవ్వారు. అలాగే ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఫెన్సింగ్ వైర్లలో సాధారణ విద్యుత్ ప్రవహిస్తుంది. ఇవన్నీ ఎప్పుడో ధ్వంసమై మూలనపడ్డాయి. ఈ పరిస్థితుల్లో పొరుగునే ఉన్న రాష్ట్రాల దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల రాకను నివారించడంలో మూడు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నట్టే కనిపిస్తోంది. అందుకు ప్రధానంగా ఆయా అటవీ ప్రాంతాల్లో ఆహారం, నీటి కొరత ఏర్పడినప్పుడు ఏనుగులు ఇలా కుప్పం ప్రాంతంలో పంట పొలాల పై దాడి చేస్తున్నట్లు భావిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరాన్ని కుప్పం ప్రాంత రైతులు కోరుతున్నారు.

వెంటనే పరిహారం

ఒంటరి ఏనుగు దాడిలో మరణించిన రెడ్డు నాయక్ కుటుంబానికి అటవీ శాఖ అధికారులు అండగా నిలిచారు. పరిహారం కూడా చెల్లించారు. "ఏనుగు దాడి చేసిన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాం" అని రామకుప్పం ఫారెస్ట్ రేంజ్ అధికారి జయశంకర్ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్'ప్రతినిధికి చెప్పారు. "బాధిత కుటుంబానికి రూ. పది లక్షల చెక్కు అందించాం" అని ఎఫ్ ఆర్ ఓ జయశంకర్ చెప్పారు. ఘటన సమాచారం తెలుసుకున్న చిత్తూరు డిఎఫ్ఓ, ఐఎఫ్ఎస్ అధికారి భరణి కూడా వచ్చారని ఆయన తెలిపారు. అధికారులతో కలిసి ఏనుగు దాడిలో మరణించిన రెడ్డు నాయక్ కొడుకు సజ్జు నాయక్ కు పరిహారం చెక్కు అందించామని ఎఫ్ ఆర్ వో జయశంకర్ వివరించారు. రెడ్డు నాయక్ భార్య కూడా అనారోగ్యంతో ఇటీవల మరణించడం వల్ల, వారి కొడుకుకు పరిహారం చెక్కు అందించినట్లు ఆయన వివరించారు.

ఏనుగు దాడిలో మరణించిన వారికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా రు. 5 లక్షలు మాత్రమే చెల్లించేది. వన్యమృగాల దాడుల్లో మరణించిన వారికి పరిహారం మొత్తాన్ని రూ 10 లక్షల కు ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. ఎఫ్ ఆర్ ఓ జయశంకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Read More
Next Story