వైకుంఠ ఏకాదశికి ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు
x

వైకుంఠ ఏకాదశికి ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు

10 టన్నుల పువ్వులతో టీటీడీ ఆలయాల ముస్తాబు


ఈ నెల వైకుంఠ ఏకాదశి కోసం టిటిడి స్థానిక ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో ఆలయాలను అలంకరించారు. స్థానిక ఆలయాల వద్ద యాత్రికులకు ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో రంగవల్లులు తీర్చిదిద్దారు.


ఆలయాల వద్ద ఉత్తరద్వారం కూడా ఏర్పాటు చేశారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున రెండు గంటల నుంచిమూడు గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాలు జ‌రుగ‌నున్నాయి. ఉద‌యం 3 గంట‌ల నుంచి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేకువజామున 12.05 నుంచి 1.35 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుంచి రాత్రి 8.45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉద‌యం 9 గంటల నుంచి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

శ్రీనివాసమంగాపురంలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుంచి 1.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 1.35 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉద‌యం 6 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.
డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30వ తేదీ వేకువజామున 12.05 నుంచి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబ‌రు 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. 31న వైకుంఠ ద్వాదశి రోజు సందర్భంగా ఉదయం 6 నుంచి 7 గంటల గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగునుంది.
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read More
Next Story