BREAKING | ఆటో బోల్తా పడి అల్లాడిన విద్యార్థులు
x

BREAKING | ఆటో బోల్తా పడి అల్లాడిన విద్యార్థులు

ఎదురుగా వస్తున్న వాహనం. రోడ్డుపై గోతుల్లో అదుపు తప్పిన ఆటో బోల్తా పడింది. ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.


సాయంత్రం బడి వదిలారు. విద్యార్థులంతా ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. రోడ్డుపై ఉన్న గుంతల వల్ల అదుపుతప్పిన ఆటో కాలువలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వద్ద శనివారం సాయంత్రం జరిగింది.

ఆదివారం ఎలాగూ బడి ఉండదు. ఇంకాసేపట్లో ఇంటికి చేరుతాం. అని మాటల్లో మునిగి ఉన్నారు. ఆటో బోల్తా పడడంతో విద్యార్థుల నుంచి హాహాకారాలు మిన్నంటాయి. గాయాల బాధ తట్టుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు విద్యార్థులను కాపాడడంతో పాటు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి, ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. తంబళ్లపల్లె నుంచి ములకలచెరువుకు సమీపంలోని చిన్నేరు ప్రాజెక్టు వద్ద ఆ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.

ఈ సంఘటన వివరాలివి.
తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లెకు చెందిన రెడ్డిశేఖరనాయుడు తన ఆటోలో రోజూ విద్యార్థులను తంబళ్లపల్లె సమీపంలోని మోడల్ స్కూల్ కు తీసుకుని వస్తాడు. తిరిగి సాయంత్రం వారిని గుండ్లపల్లి పంచాయతీలోని అనేక గ్రామాలకు ఇళ్లకు చేరవేస్తుంటాడు. అదేవిధంగా..
తంబళ్లపల్లె వద్ద ఉన్న మోడల్ స్కూల్ నుంచి విద్యార్థులను శనివారం సాయంత్రం ఆటోలో ఎక్కించుకున్న రెడ్డిశేఖరనాయుడు గుండ్లపల్లెకు బయలుదేరాడు. మార్గమధ్యలోని చిన్నేరు ప్రాజెక్టు బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు యత్నించాడు. రోడ్డుపై ఉన్న గుంతల్లో కుదుపులకు గురైన ఆటో పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో..
ఎనిమిది మందికి గాయాలు
ఆటో బోల్తా పడిన ఘటనలో గుండ్లపల్లి సర్పంచ్ మౌలాలి కుమారుడు మహమ్మద్ నవీద్(11) అదే గ్రామానికి చెందిన లాస్య (12), లిఖిత్ (14), మలిగివారిపల్లికు చెందిన అఖిల్ కుమార్ రెడ్డి (14), దిగువపల్లికు చెందిన హర్షిత (11), పూర్ణిమ (14), యస్మిత (13), మౌనిక (18) తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులకు తల, మోకాళ్లు, శరీరంపై తీవ్రమైన గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను హుటాహుటిన తంబళ్లపల్లె సీహెచ్సీకి తరలించారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన మహమ్మద్ నవీద్, లిఖిత్ ను మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. కానీ, వారు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం.
కన్నీరు మున్నీరు

తమ పిల్లలు ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలి వచ్చారు. దీంతో పిల్లలతో పాటు వారి రోదనలు కూడా కలిచి వేశాయి. తంబళ్లపల్లెలో కొందరు ఆటో డ్రైవర్లు మద్యంమత్తులో ఆటోలు నడపడం వల్లే ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. తాజా ఘటనలో కూడా ఆటో డ్రైవర్ స్థితిని అనుమానిస్తున్నారు.
Read More
Next Story