
తాగి.. ఊగి.. వేధించి.. తిరుపతిలో దారితప్పిస్తున్న మద్యం..
పెచ్చుమీరుతున్న ఆగడాలు. డ్రోన్ పోలీసింగ్ తో నిఘా.
తిరుపతి టెంపుల్ టౌన్ లో మద్యం మత్తులో ఉన్న వారి ఆగడాలు పెరిగాయి. మద్యం షాపులు ఉన్న ప్రదేశాల్లో నియంత్రణ లేకుండా పోయింది. బహిరంగంగా మద్యం తాగడంపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా, తిరుపతిలో వరుసగా జరుగుతున్న సంఘటనలు యాత్రికులనే కాదు. స్థానికులను కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. యాత్రికుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటు కూడా ఈ పరిస్థితికి కారణం అవుతోంది.
"తెల్లవారకముందే దుకాణాలు తెరవడం అనర్థాలకు ఆస్కారం కల్పిస్తోంది. సమయపాలన పాటించడం లేదు" అని వైసీపీ డిప్యూటీ మాజీ మేయర్ భూమన అభినయరెడ్డి కూడా గతంలో నిరసనలకు దిగారు. ఇదిలావుంటే..
ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడి
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజుకు సగటున లక్ష మంది రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు టీటీడీ శ్రీనివాసం సముదాయం, అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటుంది. బ్రాందీషాపుల వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. తరచూ పోలీస్ పెట్రోలింగ్ ఉంటున్నా, ఫలితం లేని పరిస్థితి.
పెట్రేగుతున్న వీధిరౌడీలు..
మద్యం అనేక అనర్థాలకు మూలం అనే మాట స్పష్టంగా కనిపిస్తోంది. మద్యం మత్తులో రోడ్డపై వెళ్లే వారిని కూడా ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితి ఆర్టీసీ బస్టాండు, కపిలతీర్థం రోడ్డు, అలిపిరి బైపాస్ తోపాటు అలిపిరి సమీప ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. నగరంలో రెండు రోజులకు కిందట పట్టపగలే చైన్ స్నాచర్లు పెట్రేగారు. ఐదు చోట్ల మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్లారు. సీసీ టీవీల్లో అవి రికార్డయ్యాయి. సీసీ కెమెరాలు ఉండడం వల్ల పోలీసులు స్పందిస్తున్నారు. అయినా, కొన్ని ప్రాంతాల్లో జరిగే సంఘటనల కారణంగా శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతున్నాయి. ఆ కోవలోనే..
తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తులతో స్వైరవిహారం చేశాడు. విక్టరీ వైన్స్ ప్రాంతంలో ఈ ఘటన భయానక వాతావరణం కల్పించింది. చేతిలో కత్తి పట్టుకున్న యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించింది. ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బైక్ తీసే వరకు కత్తి పట్టుకున్న యువకుడి ఆగడాలు శృతిమించాయి. ముగ్గురు యువకులు అక్కడి నుంచి మెల్లగా జారుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
సీసీ కెమెరాలతో అడ్డంగా బుక్
తిరుపతి నగరం సీసీ కెమెరాలో నిఘాలో ఉందని మరిచిపోతున్నారు. ఆగడాలకు పాల్పడుతున్న వ్యక్తులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆదివారం సాయంత్రం నగరంలోని విక్టరీ వైన్స్ వద్ద కత్తులతో యువకుడి స్వైరవిహారం చేయడాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గమనించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పందించారు. కత్తులతో వీరంగం సృష్టించిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పోలీసులకు చిక్కిన కత్తి వీరవిహారం చేసిన యువకుడు
తిరుపతి నగరంలోని అలిపిరి బైపాస్ ప్రాంతం వీధి రౌడీలకు అడ్డాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజా సంఘటనతో మరోసారి వెల్లడైంది.
తిరుపతి నగరం లీలా మహల్ సర్కిల్ వద్ద వారం కిందట జరిగిన సంఘటనతో పోలీసులు ఘాటుగానే స్పందించారు.
ఆకతాయిలకు కరకంబాడి మార్గంలో నడిరోడ్డుపైనే కోటింగ్
దారిన వెళుతున్నతల్లీకూతురిని వెధించిన వీధిరౌడీలకు రోడ్డుపైనే కోటింగ్ ఇచ్చారు. ఆకతాయిలకు బుద్ధి చెప్పడంలో స్థానికులే కాదు. ఆటో డ్రైవర్లు కూడా సహకారం అందించారు.
తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఏమంటున్నారంటే..
"నగరంలో బహిరంగ మద్యం తాగకుండా నివారించడానికి 40 మంది ప్రత్యేక పోలీసు బృదంతో డ్రోన్ పోలీసింగ్ ఉంది. సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా అసాంఘిక కలాపాలకు చెక్ పెడుతున్నాం" అని ఎస్పీ సుబ్బారాయుడు చెబుతున్నారు.
జనవాసాల మధ్య వద్దు..
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు తొలగించాలని సీపీఐ నేతలు చాలా సార్లు నిరసనకు దిగారు.
"తాత్కాలిక ఉపశమన చర్యలు మినహా గట్టిచర్యలు తీసుకోవడం లేదు" అని సీపీఐ నేత మురళీ నిరసన వ్యక్తం చేశారు. జనవాసాలు, పాఠశాలలకు సమీపంలో మద్యం దుకాణాలు మరొ ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మురళీ డిమాండ్ చేశారు.
తిరుపతిలో యాత్రికులు సంచరించే ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ విభాగంతో పాటు సివిల్ పోలీసులు రంగంలోకి దిగితే మినహా ప్రయోజనం ఉండే వాతావరణం కనిపించడం లేదు.
"యాత్రిక నగరం అలిపిరి బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేయకూడదు" అని గతంలో తొడా చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్న టీటీడీ టాస్క్ ఫోర్స్ సమావేశాల్లో తీర్మానించారు. బైపాస్ రోడ్డుకు కాస్త దూరంలో అనేక సంవత్సరాల నుంచి బార్లు రోడ్డు పక్కనే ఉన్నాయి. యజమానులు మారుతున్నారు. మినహా స్థలం మాత్రం మారడం లేదు. అందులో ప్రధానంగా కేటీ. రోడ్డు, కరకంబాడి మార్గం, తిరుచానూరు వెళ్లే మార్గంలోని టీటీడీ కల్యాణ మండపాల సమీపంలో ఉన్న బార్ల వల్ల కూడా ఇబ్బంది తప్పడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
దీనిపై వైసీపీ నేత, డిప్యూటీ మాజీ మేయర్ భూమన అభినయరెడ్డి ఏమంటారంటే...
"పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యం ముంచెత్తుతోంది. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు" అని అభినయ్ వ్యాఖ్యానించారు. ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు.
"భక్తులు తిరుపతిలో అడుగుపెట్టగానే మందుబాబులు, మద్యం బాటిల్స్ ప్రత్యక్షమవుతున్నాయి. గుడులు, బడులు తెరవకనే వైన్ షాపులు తెరుచుకుంటున్నాయి" అని ఘాటుగా కామెంట్ చేశారు.
నిఘా ఉంది...
యాత్రికుల భద్రత, పరిస్థితి అదుపు తప్పకుండా సీసీ కెమెరాలతో నిఘా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ జోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు చుట్టుపక్కలే కాకుండా, సమీపంలోని పెద్దకాపు లేవుట్ లో పది సీసీ కెమెరాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికి మరో పది సీసీ కెమెరాలు వంద మీటర్లకు ఒకటి ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుబ్బారాయుడు గుర్తు చేశారు. ఇటీవల తిరుపతి నుంచి బదిలీ అయిన ఎస్పీ హర్షవర్థనరాజు అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
జీవకోనకు వెళ్లడానికి ప్రధానద్వారంగా ఉన్న కరకంబాడి మార్గంలో (ఇది లీలా మహల్ సర్కిల్ కు కూత వేటు దూరంలో ఉంటుంది) తల్లీకూతుళ్లను వేధించిన యువకులకు పోలీసుల వారం కిందట రోడ్డులోనే కోటింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే అంటే జీవకోన మార్గంలో 40 ప్రదేశాల్లో 124 సీసీ కెమెరాలతో నిఘా ఉంది.
"నగరంలో యాత్రికులే కాకుండా, స్థానికులకు ఎలాంటి సమస్య లేకుండా భద్రత కల్పిస్తున్నాం" అని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు చెప్పారు.
Next Story