
'టీటీడీ బర్డ్ ' ఆస్పత్రికి డాక్టర్ జగదీష్ మళ్ళీ వచ్చారు..
బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా డాక్టర్ జగదీష్ నియమితులయ్యారు. టీటీడీ ఈవో ఆ మేరకు జారీ చేశారు.
తిరుపతి కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక విద్యాసంస్థల తో పాటు ఆసుపత్రులు కూడా నిర్వహిస్తోంది. అందులో అత్యంత కీలకమైనది బాలాజీ వికలాంగుల, శస్త్ర చికిత్స, పునరావాస కేంద్రం 'బర్డ్ ' (Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled BIRRD) ఆసుపత్రి ఒకటి.
ఈ ఆస్పత్రి డైరెక్టర్ గా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గూడూరు జగదీష్ నియమితులయ్యారు. టీటీడీ ఈఓ జె. శ్యామలరావు డాక్టర్ జగదీష్ ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలకు రూ. రెండు లక్షల వేతనంతో ఏడాది పాటు డైరెక్టర్ హోదాలో సేవలు అందించడానికి ఏప్రిల్ ఒకటో తేదీ టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అందుకున్న డాక్టర్ జగదీష్ శుక్రవారం అమరావతిలో సీఎం ఎన్. చంద్రబాబును మర్యాదపూర్తకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
"బర్డ్ ఆస్పత్రి ప్రారంభించిన తొలినాళ్లకు ఏమాత్రం తగ్గకుండా సేవలు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తా" అని డాక్టర్ జగదీష్ సీఎం చంద్రబాబుతో చెప్పారని సమాచారం. అందుబాటులోని సాంకేతిక పరిజ్ణానంతో రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా బర్డ్ ఆస్పత్రి ప్రతిష్ఠను మరింత ఇనుమడింప చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు.
బర్డ్ ఆస్పత్రిలో విశేష సేవలు
టిటిడి ఆధ్వర్యంలో వికలాంగుల సేవ కోసం 1994లో బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి 20 ఏళ్ల పాటు డాక్టర్ జగదీష్ వర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా విశేష సేవ అందించారు. సచ్చుబడిన రోగుల ఎముకలకు జీవం పోశారు. తనకు వైకల్యం ఉందనే విషయాన్ని కూడా రోగులు మరిచిపోయే విధంగా, నయం చేయడం ద్వారా లక్షలాది మంది వైకల్యాన్ని నయం చేశారనే రికార్డు బర్డ్ ఆస్పత్రి చరిత్రలో నమోదైంది. దీనికోసం
ఆస్పత్రిలో కీలకమైన ఆపరేషన్ నిర్వహించడం తోపాటు కృత్రిమ అవయవాల తయారీ వంటి పరిశోధన కేంద్రం స్థాయికి బర్ఢ్ ఆసుపత్రిని తీర్చిదిద్దరంలో ఆయన విశేష కృషి చేశారు. ఆసియా దేశాల్లోనే బర్డ్ ఆసుపత్రికి ఒక కీర్తిప్రతిష్టలను సాధించడంలో డాక్టర్ జగదీష్ చేసిన కృషి అపారమైనదని చెప్పడంలో సందేహం లేదు.
వైకల్యం, ప్రమాదాలకు గురైన వారికి ఇక్కడ అందుతున్న వైద్య సేవలు దేశవ్యాప్తం చేశాయి. డాక్టర్ జగదీష్ టీటీడీ బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన నాటి నుంచి డైరెక్టర్ గానే కాకుండా, ఒక డాక్టర్ గా స్వయంగా ఆయనే ఆపరేషన్లు నిర్వహించడం. పరిపాలన వ్యవహారాలను కూడా చక్కదిద్దడానికి శ్రద్ధ తీసుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు ఆర్థోపెడిక్ డాక్టర్ గా గూడూరు జగదీష్ వికలాంగుల పురావాసం, సమాజ సేవకు తన పనితీరును అంకితం చేశారు. మొత్తం మీద ఆయన బర్డ్ ఆస్పత్రిలో పేదల డాక్టర్ అనే పేరు సంపాదించుకున్నారు.
విశ్వవైద్య బంధు
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ డాక్టర్ జగదీష్ ను విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారంతో మారిషస్ లోని ఫీనిక్స్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గుణం పురస్కారం అందించారు. డాక్టర్ జగదీష్ ఉచిత వైద్య శిబిరాలు అనేక దేశాల్లో నిర్వహించడంతోపాటు బర్డ్ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను విశ్వవ్యాప్తం చేశారు. అంతర్జాతీయ జర్నల్ లో కూడా డాక్టర్ జగదీష్ పరిశోధనలు ప్రచురితం అయ్యాయి.
"1.83 లక్షల మందికి శాస్త్ర చికిత్సలు నిర్వహించడం తనకు పూర్తి సంతృప్తి కలిగించింది" అని డాక్టర్ జగదీష్ ఆ సందర్భంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా,
2019 మే నెలలో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. బర్డ్ ఆస్పత్రిని ప్రపంచ దేశాలలో మేటిగా నిలిపిన ఆయన సేవలు కొనసాగించడానికి ఆనాటి ప్రభుత్వం, పాలకమండలి సుముఖత వ్యక్తం చేయలేదు. దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీంతో ఆయన తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
స్వచ్ఛంద సేవ
నాలుగు దశాబ్దాలుగా ఈ రంగంలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా జగదీష్ ఉద్యోగ విరమణ తర్వాత వికలాంగుల సేవకే తన సమయాన్ని వెచ్చించారు. నిరక్షరాస్యత, అవగాహన లేమి వంటి సమస్యలతో పేదలు ప్రకాశం జిల్లాలో కీళ్లు ఎముకల సంబంధిత వ్యాధులతో ప్రజల బాధపడుతున్నారని డాక్టర్ జగదీష్ తెలుసుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత స్వయంగా ఆయనే రోగుల వద్దకు వెళ్లే అవకాశం తీసుకున్నారు. అందులో భాగంగా,
ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు ఎక్కువగా ఉండే కరేడు గ్రామాన్ని డాక్టర్ జగదీష్ ఏడాదిన్నర కిందట దత్తత తీసుకున్నారు. లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ జగదీష్ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రతి నెల నాలుగు రోజులపాటు ఆ గ్రామంలో డాక్టర్ జగదీష్ రోగులకు అందుబాటులో ఉంటున్నారు. కీళ్లు, ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చే దాదాపు 70 మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నారు. రోగులకు ఉచితంగా పరికరాలతో పాటు మందులు కూడా అందించడానికి డాక్టర్ జగదీష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనేది అక్కడి నుంచి అందిన సమాచారం. తిరిగి ఐదేళ్ల తరువాత ఆయన బర్డ్ ఆస్పత్రికి డైరెక్టర్ గా నియమితులు కావడం కూడా పేదల సేవలకు ఊపిరి పోయడమే అని భావిస్తున్నారు.
Next Story