పుంగనూరు కోటలో తిరుగుబావుటా...  పెద్దిరెడ్డి ఆధిపత్యానికి గండి పడిందా..!
x

పుంగనూరు కోటలో తిరుగుబావుటా... పెద్దిరెడ్డి ఆధిపత్యానికి గండి పడిందా..!

కొన్ని రోజుల కిందటి వరకు వెన్నంటి ఉన్న వారంతా ఎదురు తిరిగారు. మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అవుతున్నట్లు ప్రకటించారు. విజయం సాధించినా, సొంత ఊరికి వెళ్లలేని స్థితిలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై పెద్ద పిడుగుపడినట్లుగా మారింది.


చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయ ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగలింది. పుంగనూరు మున్సిపాలిటీలో 31 మంది కౌన్సిలర్లు ఉండగా, చైర్మన్ సహా 19 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. తామంతా టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు.


"వైఎస్ఆర్ సీపీలో పదవులు ఇచ్చారు. అధికారం మాత్రం ఇవ్వలేదు" అని

మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు కౌన్సిలర్లు అమ్ము, మనోహర్ వ్యాఖ్యానించారు. "పదవుల కోసం తండ్రీ, కుమారుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ ఒకమాట. ఢిల్లీలో మరోమాట చెబుతున్నారు. అని విమర్శించారు.
పుంగనూరును తన సామ్రాజ్యంగా మార్చకున్న పెద్దిరెడ్డికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, పట్టుమని 15 రోజులు కూడా గడవకముందే.. గట్టి దెబ్బ కొట్టినట్లు భావిస్తున్నారు.
గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే. సీఎం ఎవరైనా సరే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజకీయ ప్రాపకానికి ఎదురులేదనేది చరిత్ర చెప్పే సత్యం. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో ప్రధానంగా...
"2024 ఎన్నికల వేళ వైనాట్ 175" అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్. జగన్ సహా కింది స్థాయి నేతల వరకు నినదించారు. అందులో "వై నాట్ కుప్పం" అనే మాటలు కూడా ప్రతిధ్వనించాయి. ఇందుకోసం, జిల్లాలో టీడీపీకి గండి కొడతాం. కుప్పంలో ఆ పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడును ఓడిస్తాం. అని పెద్దిరెడ్డి టార్గెట్ చేయడంతో పాటు వైఎస్ఆర్ సీపీ యంత్రాంగాన్ని మోహరించారు.
సీన్ కట్ చేస్తే..
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తరువాత 11 సీట్లకే వైఎస్ఆర్ సీపీ పరిమితమైంది. అందులో చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో మిగతా 12 స్థానాల్లో కుప్పం నుంచి ఏడోసారి టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు, మిగిలిన 10 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో..
సొంత ఊరికి వెళ్లలేక..
ప్రస్తుతం రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం కాదు కదా, స్వగ్రామానికి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల కొద్ది రోజులు ఓపిక పట్టాలని పోలీస్ యంత్రాంగం కూడా సూచించినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా...
పెద్దిరెడ్డికి గట్టిదెబ్బ
వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకోని అనుభవం ఎదురైంది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు 19 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. పుంగనూను టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)ని రొంపిచర్ల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కలిశారు. తామంతా చల్లా బాబు సారధ్యంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించడం రాజకీయవర్గాల్లోనే కాదు. తిరుగుబాటు బావుటా ఎగరవేసిన వారిలో రామకృష్ణమరాజు, జె. నరసింహులు, యువకుమారి, మమత, ప్రధానంగా కౌన్సిలర్ రహంతుల్లా జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వి. కాళీదాస్ మొదలియార్, ఖాన్ నూర్జహాన్, కసురున్నీసా, మనోహర్, హర్షద్ అలీ, రేష్మా, మహ్మద్ గౌస్ ఉన్నారు. ఈ పరిణామంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించుకున్న కోటకు బీటలు వారినట్లుగా మారింది. ఇంకొందరు కూడా టీడీపీలో ఇంకొన్ని రోజుల్లో టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది.
మున్సిపల్ చైర్మన్ అలీంబాషా సహా కౌన్సిలర్లు మాట్లాడుతూ "పుంగనూరులో ఎలాంటి అభివృద్ధి లేదు. వైఎస్ఆర్ సీపీలో మాకు పదవులు ఇచ్చారు. మినహా, అధికారాలు లేవు" అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనాన్ని ప్రశ్నించారు. అందుకే వైఎస్ఆర్ సీపీని వీడుతున్నట్లు కూడా చెప్పారు.


కుటుంబ పాలన సాగనివ్వం
టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు మాట్లాడుతూ, "పుంగనూరు నియోజకవర్గమే కాదు. జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సామ్రాజ్యంగా మారింది. ఇక ఆ తరహా పాలన సాగినివ్వం" అని అన్నారు. "ఎన్నికల ముందు వరకు ఎన్డీఏ కూటమిని, బీజేపీని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ప్రకటించడం ద్వారా ఊరికో మాట మాట్లాడుతున్నారు " అని చల్లా బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. పుంగనూరులో "పెద్దిరెడ్డి కుటంబ పాలన" సాగనిచ్చే ప్రసక్తి లేదని చల్లా బాబు హెచ్చరించారు.
రాజకీయ వ్యూహంలో చతురుడు
వాస్తవానికి పుంగనూరు, అంతకుముందు పీలేరు అసెంబ్లీ స్దానాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తన అవసరాలకు అనుగుణంగా రాజకీయంగా పావులు కదపడంలో ఆయనది ప్రత్యేక శైలి. అదే ఆయనను జిల్లా స్థాయి నేతగా ఎదగడానికి నిచ్చెనలా మారింది. జిల్లాలో ఆయనకు రాజకీయ మొదటి శత్రువు సీఎం. ఎన్. చంద్రబాబు నాయుడే. ఆ తరువాత సారా అంగళ్ల నిర్వహణలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంతో వివాదాలు ఏర్పడ్డాయి. ఇవి మినహా ఆయనకు రాజకీయ శత్రువులు లేరని విషయం జగద్వితం. వారిద్దరితో పెద్దిరెడ్డికి రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ జిల్లాలో తన రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో చతురత పాటించారు. పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు ఇలా ఏ నియోజకవర్గానికి వెళ్లినా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తన సామాజికవర్గం నుంచి కాకుండా, ఎస్సీ, బీసీ, మైనారిటీ, బలిజలకు మాత్రమే ప్రాధన్యత ఇవ్వడం ద్వారా ఆ వర్గాలకు చేరువ అయ్యారు.
కుప్పంను టార్గెట్ చేయడం, టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి వంటి ఘటనలు జిల్లాలోనే కాదు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించాయి. ఈసారి ఎన్నికలు, ఆ తరువాత మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫోకస్ పెట్టడానికి దారి తీశాయని భావిస్తున్నారు. అందుకు నిదర్శనం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషా సహా కౌన్సిలర్లు తిరుగుబాటు చేసేలా కూటమి ప్రభుత్వం పరోక్షంగా ప్రేరేపించేలా చేశాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.
Read More
Next Story