Tirumala | తిరుమల : రథసప్తమికి ఎన్ని లక్షల మంది వచ్చారో తెలుసా..?
సూర్య జయంతి ప్రశాంతంగా ముగిసింది. పోలీస్ యంత్రాంగం కీలకంగా వ్యవహరించింది.
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం ప్రశాంతంగా ముగిసింది. సూర్యజయంతి (రథసప్తమి) కి యాత్రికులు పోటెత్తారు. సాధారణ రోజుల్లో లక్ష మందికి తక్కువ కాకుండా యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏడువాహనాలపై ఒకే రోజు దర్శనం ఇచ్చిన మలయప్పస్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి కూడా యాత్రికులు భారీగా తరలివచ్చారు.
"ఒకే రోజు తిరుమలకు 2.50 లక్షల మంది యాత్రికులు వచ్చారు" అని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ప్రకటించారు.
వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించడం. పదుల సంఖ్యలో యాత్రికులు గాయపడిన సంఘటన టీటీడీ యంత్రాంగానికి చేదుపాఠం నేర్పింది. దీంతో రథసప్తమి సందర్భంగా హైరానా పడ్డారు. ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ చర్యలు తీసుకోవడంలో టీటీడీ, విజిలెన్స్, పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేసింది. దీంతో నాలుగు మాడవీధుల్లో యాత్రికులు ప్రశాంతంగా మలయప్పస్వామి పల్లకీ సేవలను ప్రశాంతం చూడగలిగారు.
శ్రీవారి దర్శనంలో..
రథసప్తమి సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. సాధారణ యాత్రికులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించారు. దీంతో వీఐపీల సమయంలో కూడా సాధారణ యాత్రికులు 73,599 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి 3.21 కోట్ల రూపాయల ఆదాయం కూడా లభించింది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ ఆదాయం తక్కువే. ఎందుకంటే, శ్రీవారి వాహనసేవలు జరిగే సమయంలో యాత్రికులు మాడవీధుల్లో పల్లకీసేవ చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. కాగా,
గ్యాలరీల్లో ఉన్న యాత్రికుల వద్దకు టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, పాలక మండలిసభ్యులు పలకరించారు. వారికి అందుతున్న సేవలపై వాకబు చేశారు. గ్యాలరీల్లోని యాత్రికులు ఉదయం నుంచి రాత్రి వరకు అంటే వాహన సేవలు ముగిసే వరకు 3,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలతో పాటు మంచినీరు, పాలు, మజ్జిగ, టీ, కాఫీలు అందించారు. ఈ కార్యక్రమాలను టీటీడీ అధికారులు పర్యవేక్షించారు. దీనికోసం ప్రత్యేకంగా బాధ్యతలు వికేంద్రీకరించారు.
తిరుమలలో తొక్కిసలాటకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఇక్కడ రద్దీ నియంత్రణకు అవసరమైన ఓ ప్రత్యేక వ్యవస్థ, శాశ్వత వసతులు కల్పించడమే దీనికి కారణం. అయినా, పోలీసుశాఖ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజిలెన్స్ సిబ్బందికి మించి, వ్యవహరించారనడంలో సందేహం లేదు.
రద్దీ నియంత్రణలో...
తిరుమలలో రద్దీ నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దీనికోసం అనంతపురం రేంజ్ డిఐజి డాక్టర్ షేమోషీ స్వయంగా పర్యవేక్షించారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధనరాజు మాడవీధుల్లో కళాకారులు, ప్రముఖులు, పాలక మండలి సభ్యులు మినహా సాధారణ యాత్రికులు ప్రవేశించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి యాత్రికులను నాలుగు ప్రధానగేట్లు వాటికి పక్కనే ఉన్న నాలుగు చిన్న ద్వారాల నుంచి ప్రవేశించే విధంగా తీసుకున్న జాగ్రత్తలు మరింతగా ఫలించాయి. తిరుమలలో గతానికి భిన్నంగా అధికారులు సమన్వయంతో పనిచేయడానికి అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటరావు, శ్రీ రామకృష్ణ (తిరుమల), ట్రైనీ ఐపీఎస్ అధికారి బి.హేమంత్, డీఎస్పీ శ్రీలత మహిళా పోలీసులు, సీఐలు బందోబస్తు పర్యవేక్షించారు. వారిని తిరుపతి ఎస్పీ హర్షవర్థనరాజు పర్యవేక్షించారు.
"యాత్రికుల మధ్య తోపులాట లేకుండా 1,400 పోలీసులు, అధికారులతో ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్థనరాజు తెలిపారు. "ఈ వేడుకల్లో సుమారు 1.5 లక్షల మంది యాత్రికులకు పోలీస్ శాఖ నుంచి సేవలు అందించాం" అని ఎస్పీ చెప్పారు.
ఆయన ఇంకా ఏమిచెప్పారంటే..
భక్తుల భద్రత కోసం యాంటీ సబటేజ్ చెక్ (Anti-sabotage check)చేశాం. ప్రిస్కింగ్ , క్రౌడ్ కంట్రోల్ (Crowd control), ట్రాఫిక్ నియంత్రణ (Traffic control)క్రమబద్ధీకరణ వంటి చర్యలు తీసుకున్నాం. అని ఎస్పీ హర్షవర్థన్ చెప్పారు. "పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఇతర శాఖల సమన్వయం వల్లే ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం" అని ఆయన వివరించారు.
ఈ ఉత్సవాల్లో Geo-tagging విధానాన్ని అమలు చేయడం వల్ల పిల్లలు తప్పపోయిన వెంటనే వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలా 11,740 మంది పిల్లలకు జియోట్యాగింగ్ చేశారు. ఈ పద్ధతిని గూడూరు పట్టణ సీఐ జే. శ్రీనివాస్ సారధ్యంలో పర్యవేక్షించారు.
ఇదే సాక్ష్యం
తిరుమలలో మంగళవారం 12.30 గంటలకు ఫైర్ స్టేషన్ వద్ద కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గక సమీపంలోని తలియ గ్రామానికి చెందిన జి సవిత తప్పపోయింది. రోధిస్తున్న ఆమెను గుర్తించిన పోలీసులు భర్త భగవరాజు వద్దకు చేర్చారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయడానికి అవసరమైన వ్యవస్థ ముందస్తుగానే సిద్ధం చేయడం వల్ల సాధ్యమైంద.
"తిరుమలో ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం డీస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు. తిరుపతి, ఘాట్ రోడ్లు, తిరుమలలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేసి చేశారు" అని ఎస్పీ హర్షవర్థనరాజు వివరించారు.
మినీబ్రహ్మోత్సవంలో అత్యంత కీలకమైన శ్రీవారి పుష్కరిణి వద్ద చక్రస్నానం ఘట్టంలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేని విధంగా లైఫ్ గార్డ్స్, రోప్ పార్టీల ద్వారా క్రౌడ్ కంట్రోల్ చేశారు.
Next Story