కీర్తించిన నోళ్లు ప్రశ్నించాయా?  వైఎస్ జగన్ ఏమన్నారు?
x

కీర్తించిన నోళ్లు ప్రశ్నించాయా? వైఎస్ జగన్ ఏమన్నారు?

ఓటమి తర్వాత పులివెందులకు వచ్చిన మాజీ సీఎం వైఎస్. జగన్ మొదటిసారి జనంతో కలిశారు. కీర్తించిన నోళ్లు ఏమని ప్రశ్నించాయి. వారికి ఆయన ఏమి సమాధానం ఇచ్చారు.


మాజీ సీఎం వైఎస్. జగన్ కు సొంత ఊరిలో మొదటిసారి ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. మొన్నటి వరకు కీర్తించిన వారు వ్యవతిరేకంగా నినాదాలు చేయడమే కాదు. పనులు చేసిన మా పరిస్థితి ఏమిటని నిలదీశారు. అధికారంలో ఉండగా, తమని పట్టించుకోలేదనే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో స్థానికులే కాదు. వైఎస్ఆర్ సీపీ వర్గాలు కూడా దిమ్మెరపోయాయి.



అధికారంలో ఉండగా జనం కాదు కదా. నాయకులు కూడా వైఎస్. జగన్ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి. సీఎం హోదా పోయాక ఆయన మొదటిసారి పులివెందులకు వచ్చి, జనంతో కలవడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆయనకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఆయన ఊరడింపు మాటలు కూడా స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆశ్యర్యానికి గురి చేశాయంటున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శనివారం ఆయన పులివెందులకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం కూడా పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి, సమస్యలు ఆలకించారు.

పులివెందుల నియోజకవర్గ నేతలతో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడి వెళ్లారు. వారందిరికీ ధైర్య వచనాలు మాత్రమే ఆయన చెప్పారు. 2029 ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ధైర్యంగా ఉండండి అని మాత్రమే అనునయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులతో వైఎస్. జగన్ క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వారి నుంచి ఆయన వినతులు కూడా స్వీకరించారు.


ప్రజాదర్బార్ లో జగన్ ఊరడింపు ...
ఈ నెల ఎనిమిదో తేదీతో అసెంబ్లీ కాలపరిమితి ముగిసింది. అంతకుముందు వరకు వైఎస్. జగన్ సీఎం, ఆపద్ధర్మ పదవిలోనే ఉన్నారు. ఆ విషయం ఆయన మరిచారా? అనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు ఊతం ఇచ్చే సంఘటన పులివెందులతో చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్. జగన్ వస్తున్నారనే సమాచారం ముందుగానే తెలిసింది. దీంతో పులివెందుల మున్సిపల్ మహిళా కౌన్సిలర్లతో పాటు, మండల నాయకులు కొందరు, వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు కూడా క్యాంప్ ఆఫీస్కు వరలివచ్చారు. కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, బాబాయ్, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్. మనోహరరెడ్డితో కలిసి మాజీ సీఎం వైఎస్. జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంలో.. "అభివృద్ది పనులు చేసిన మా పరిస్థితి ఏమిటి?" అని వైఎస్. జగన్ ను ప్రశ్నించారు. "అప్పులు చేసి, వడ్డీలకు డబ్బు తీసుకుని, పనులు పూర్తి చేశాం. వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. బిల్లలు కూడా మంజూరు చేయడం లేదు" అని గుర్తు చేసిన వారంతా ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. దీనికి సమాధానంగా
"బిల్లలు రాకుంటే, కోర్టు ద్వారా అయినా సాధించుకుందాం. భయపడకండి" అని చేసిన వ్యాఖ్యాలతో వారంతా ఏమి మాట్లాడలేకపోయారని సమాచారం. తాను సీఎం కాగానే "పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ సంస్థ "పడా" ద్వారా టీడీపీ కాలంలో చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లలు చెల్లించా అని వైఎస్. జగన్ గుర్తు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు బిల్లులు మంజూరు చేయకుండా, కోర్టు ద్వారా సాధిద్దాం అని చెప్పడం ఏమిటో? అని దిక్కుతోచని స్థితిలో నోరు మెదపలేకపోయారని సమాచారం. మాజీ సీఎం వైఎస్. జగన్ కు ఎదురైన అనుభవాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే అనే చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణం..
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం 1978 నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట. నాలుగు దశాబ్దాలకు పైగానే ఆ కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ కు స్వాగతం లభించింది. శనివారం రాత్రి పులివెందులలోని ఆయన నివాసం వద్ద ఏర్పడిన పరిణామంతో వైఎస్ఆర్సిపి శ్రేణులే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి కూడా పులివెందులకు చేరుకున్న ఆ పార్టీ నాయకులు, పట్టణ ప్రజానీకం కూడా ఉలిక్కి పడ్డారు.
"అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై, ఓడిపోయిన తర్వాత పులివెందుల గుర్తుకు వచ్చిందా"? అని పార్టీ అభిమానులు నిప్పులు చెరిగారు. ఈ హఠాత్పరణామంతో వైఎస్. జగన్ తో పాటు పార్టీ నాయకులు పట్టణ ప్రజలు నివ్వెరపోయారు. వైఎస్ కుటుంబానికి మొదటిసారి ఈ తరహా అనుభవం ఎదురైంది. ఆ తరువాత స్థానిక నేతలు పరిస్థితిని చక్కదిద్దడానికి ఆపసోపాలు పడ్డారు. పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, క్రిస్మస్ కు మాత్రమే రావడం. అప్పుడప్పుడూ వచ్చిన తమను కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని అసంతృప్తి పులివెందుల నాయకుల్లో ప్రగాఢంగా ఉన్నదనే విషయం బట్టబయలైంది...
ఈ సంఘటనతో స్థానిక నాయకులు కూడా షాక్ తిన్నారని చెబుతున్నారు. పులివెందులలో మెజారిటీ తగ్గడమే కాదు. జిల్లాలో అధిక సీట్లు కోల్పోవడానికి కూడా మీరే కారణం అంటూ వైఎస్ జగన్ పై విరుచుకుపడినట్లు తెలిసింది. అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే, కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగతంగా తమకు ప్రయోజనం కలగలేదని విషయంలో కాకుండా పార్టీ ప్రతిష్ట దెబ్బతినిందనే ఆవేదన ఉన్నట్లు కనిపించింది. నియోజకవర్గాన్ని ప్రజలను పట్టించుకొకపోవడం వల్లే ఏ పరిస్థితికి కారణమనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా,
జగన్ జనానికి దూరంగా ఉండడమేనా?
వైఎస్. జగన్ సీఎం కాకముందు ఒక తరహాలో ఉండడం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక, నాయకులను కలవకపోవడం వంటి అంశాలు ప్రతికూలంగా పరిణమించాయి. చేసేది లేక నాయకులు ఓపిక పట్టారు. పులివెందుల నుంచి వైఎస్. జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. అయితే, 2019 ఎన్నికల్లో పులివెందులలో విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో రాష్ట్రంలో 151 స్థానాలు గెలుచుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. తద్వారా ఆయన సీఎం పీఠం అధిరోహించారు. ఆ తర్వాత పులివెందులకు రావడం తక్కువ అయింది. ఒకవేళ వచ్చినా ఇడుపులపాయకే పరిమితం కావడం. పార్టీ నాయకులను లోపలికి అనుమతించకపోవడం. పులివెందుల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి పరదాల మాటున పర్యటించడం. స్థానికులను దరిదాపుల్లోనికి రానివ్వక పోవడం వంటి అంశాలతో స్థానికులై కాకుండా వైయస్సార్ కుటుంబం కోసం పనిచేసే శ్రమించే నాయకుల్లో కూడా అసంతృప్తి తీవ్రంగా ఉందనే వార్తలు వినిపించేవి.
వైఎస్ఆర్ కాలంలో..
సీఎం హోదాలో వైఎస్ఆర్ పులివెందులకు వస్తే, ధర్మదర్శనం మాదిరి ఉండేది. బారికేడ్ ఎంట్రీ పాయింట్ నుంచి సందర్శకులు, అభిమానులు, అర్జీలతో క్రమపద్ధతిలో వస్తుంటే, చివరిలో నిలబడే డాక్టర్ వైఎస్ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకలరించడమే కాదు. అర్జీలు తీసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం నాకు గుర్తు ఉంది అని రాజంపేట ప్రాంతానికి చెందిన బొజ్జిరెడ్డి రాజశేఖరరెడ్డి గుర్తు చేసుకున్నారు.
"హైదరాబాద్లో ఉన్నా అంతే, ఢిల్లీలో ఉన్నా, తన వద్దకు వచ్చే వారితో మాట్లాడి, పనులు చేసి పెట్టడం, అవసరం ఉన్నా లేకున్నా, దారి ఖర్చులు కేూడా ఇచ్చిపంపే వారు" అని బొజ్జిరెడ్డి రాజశేఖరరెడ్డి గుర్తు చేశారు.
దివంగత సీఎం వైఎస్ఆర్ ఏ పదవిలో ఉన్నా సరే... జనానికి దగ్గరగానే ఉన్నారు. పులివెందుల ప్రాంత వాసులే కాదు. రాష్ట్రంలో విమర్శకులు సైతం చెప్పే మాట అది.
2024 జనవరి 9న నంద్యాల సభలో కొన్ని రోజుల కిందటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. " నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖరరెడ్డి. 1978, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు గుర్తు ఉంటే, మీకు అర్థం అవుతాయి. "మేమిద్దరం దగ్గర స్నేహితులం. రాజకీయ విరోధులం 983 నుంచి. నేను టీడీపీ, ఆయన కాంగ్రెస్." అని గుర్తు చేశారు. "ఆయన (వైఎస్ఆర్) నమ్మినవాడు వైఎస్. వివేకానందరెడ్డి. వారిద్దరు రామలక్మణుల మాదిరి ఉండేవారు. అన్న మాట జవదాటని వ్యక్తి వైఎస్. వివేకా" అని గతాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం వైఎస్. జగన్ చుట్టూ చేరిన కోటరీ జనాన్ని దరి చేరినివ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై స్దానికుడు, జర్నలిస్ట్ శ్రీనివాస రెడ్డి స్పందించారు. " వైఎస్. కుటుంబానికి ప్రధానంగా వైఎస్. జగన్ కు ఈ పరిస్థితి ఎదురుకావడానికి కోటరీ మాత్రమే" అని అన్నారు. "ద్వితీయ శ్రేణి నేతలు అధినేతను కలిసే అవకాశం ఇవ్వరు. ఆయన (వైఎస్. జగన్) కూడా దీనిని పట్టించుకోలేదు" అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో పాసులు తిరస్కరించి..
వైఎస్. జగన్ సీఎం హోదాలో రెండేళ్ల క్రితం కూడా వచ్చినప్పడు కూడా చేదు అనుభవం ఎదుర్కొన్నట్లు స్దానికులు గుర్తు చేస్తున్నారు. సీఎంతో కలవడానికి అంటూ, పాసులు సిద్ధం చేశారు. అవి లేని వారిని లోపలికి అనుమతించమని సూచించారు. ధీంతో దశాబ్దాల కాలంలో వైఎస్ఆర్ కుటుంబం వెంట ఉన్న అనేక మంది సీనియర్లు కినుక వహించారని గుర్తు చేస్తున్నారు. "వైఎస్. రాజశేఖరెడ్డి ఉన్నప్పడు నేరుగా వెళ్లి కలిసేవాళ్లం. ఆయన కూడా అలాగే ఉండే వారు. ఇప్పుడు ఈ పాసులు ఏంది?" అని సమావేశానికి వెళ్లకుండా పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో కూడా మాజీ సీఎం వైఎస్. జగన్ సతీమణి వైఎస్. భారతిరెడ్డికి కూడా వేంపల్లె మండలంలో కూడా చేదు అనుభవం ఎదురైంది రైతు పాసుపుస్తకాలపై రైతుల ఫొటో కాకుండా, జగన్ ఫొటో ముంద్రించడం ఎందుకు? ఈ విషయం ఆయనకు చెప్పండి అని ఒక వ్యక్తి నిలదీయడం వైరల్ అయింది. ఆ తరువాత కూడా ఆ కుటుంబం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోలేదనే భావం వ్యక్తం అవుతోంది. ఈ పర్యవసానాల కారణంగానే వైఎస్ఆర్ కుటుంబానికి ఈ తరహా పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు.
Read More
Next Story