ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ మాటలు చిచ్చురేపాయా?
x

ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ మాటలు చిచ్చురేపాయా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపాయా? అసమ్మతి నేతలు ఏమని లేఖాస్త్రాలు సంధించారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళపై ఎందుకు ఆరోపణలు చేశారు? 25 ఏళ్ల నాటి సీన్ మళ్లీ రిపీట్ అయిందా?


కాంగ్రెస్ పార్టీకీ ప్రత్యేకంగా ప్రతిపక్షం అవసరం లేదని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తుంటారు. నాయకత్వంలో ఎవవరికి ఎవరూ తీసిపోరు. పార్టీ అధికారంలోకి వస్తుందనుకునే సమయంలోరాజకీయ వైరుధ్యంతో ప్రతిపక్షంలోకి నెట్టేసే సమర్ధులకు కొదవలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో గతం తెరపైకి వచ్చింది. విజయవాడ వేదికగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసే ప్రకటనలు వైఎస్ఆర్ కుటుంబానికి ప్రతిబంధకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.


"2029లో కాబోయే సీఎం వైఎస్. షర్మిళ. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆమె వెంట ఉంటుంది" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ కాంగ్రెస్లో మరింత అగ్గి రాజేసినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై గుర్రుగా ఉన్న వైఎస్ఆర్ వ్యతిరేకుల్లో మరింత ఆగ్రహం కలిగించినట్లు కనిపిస్తోంది. కడప ఉప ఎన్నిక వస్తే, గల్లీ, గల్లీ తిరిగి కాంగ్రెస్ ను గెలిపించి, ఢిల్లీ పెద్దలకు బహుమానం ఇవ్వడానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళకు అండగా నిలుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతి సభలో వ్యాఖ్యానించారు. సాధారణంగా ఏ నిర్ణయమైనా ఢిల్లీ ఐఏసీసీలో తీసుకుంటారనేది రాజయాలపై కాస్త అవగాహన ఉన్న వారికి కూడా తెలుసు. ఆయన మాటలు ఏపీసీసీలో మళ్లీ మంటలు రాజేశాయి.


ఏఐసీసీకి లేఖాస్త్రాలు ...
"ఫలితాలు వెలువడి నెల దాటింటి. ఇప్పటి వరకు మీ నాయకత్వంలో సమీక్షలేదు. అందుకు సమయం నిర్ణయించండి" అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోచారెడ్డి రాకేష్ రెడ్డి ఏఐసీసీ ఆంధ్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కు లేఖాస్ర్తం సంధించారు. "కనీసం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో అయిన సమీక్షిద్దాం" అని ఆయన సూచించారు.
ఆ పదాలనే మరో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కూడా వల్లెవేశారు. అవే మాటలతో ఆమె కూడా ఏఐసీసీ ఆంధ్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కు లేఖ రాయడం ద్వారా తమలోని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో కమిటీలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ ఇటీవల రద్దు చేశారు. దీంతో ఆమెను ధిక్కరించినట్లు, పీసీసీ చీఫ్ కాకుండా, నేరుగా ఏఐసీసీ పెద్దలకే లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
ఆగ్రహానికి కారణం అదేనా..
వారి ఆగ్రహానికి కారణాలు కూడా ఉన్నాయనేది పార్టీ వర్గాల సమాచారం. చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు స్ధానాల కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి పట్టుపట్టినా, కాదని, వైఎస్. షర్మిళ టికెట్లు ఇచ్చారు. అలాగే సుంకర పద్మశ్రీ విజయవాడ జిల్లాలోని కొన్ని సీట్లు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చిత్తూరు జిల్లాలో ఆశించిన కొన్ని సీట్లు ఇవ్వలేదనేది వారి ఆగ్రహం, అసంతృప్తికి కారణం అని పార్టీ నేతల ద్వారా తెలిసింది.

2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పాతర వేసి, డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. ఆ తరువాత మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, ఎన్. రఘువీరారెడ్డి కాంగ్రెస్ నావను కష్టంగా లాక్కుని వచ్చారు. పదేళ్ల తరువాత ఆంధ్ర ప్రాంత ప్రజలు శాంతించడం, కుటుంబ కలహాల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిళా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఊపు వచ్చింది.
2024 ఎన్నికల ముందు వైఎస్. షర్మిళ పీసీసీ సారధ్య బాధ్యతలు చేపట్టడంతో కొనఊపిరితో ఉన్న పార్టీకి జీవం వచ్చినట్లు కాంగ్రెస్ వాదుల్లో ఆశలు చిగురించాయి. స్టార్ డం ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డిని అభిమానించే వారు, పాతతరం నేతలు కూడా కొత్త ఉత్సాహం నింపుకున్నారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టగానే వైఎస్. షర్మిళ రాష్ర్టంలో సుడిగాలి పర్యటన సాగించి, పార్టీకి పునరుజ్జీవం పోశారు. "రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదం" వదలకుండా, స్వయాన అన్న వైఎస్. జగన్ సారధ్యం వహిస్తున్న అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీని ఇరకాటంలో పడేశారు. ఇందుకు అన్నివర్గాలు ఆమెకు సహకారం అందించాయి. రాయలసీమలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వగలిగారు. మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి ఎన్. రాఘవీరారెడ్డి బాధ్యతలు తీసుకుని కఠోరంగా శ్రమించినా, ఆధిపత్యం చాటినా ఓటమి ఎదురైంది. ఇదిలావుంటే, సార్వత్రిక ఎన్నికల తరువాత యథావిధిగానే కాంగ్రెస్ సంస్కృతి బయటికి వచ్చింది.
"పీసీసీ సారధిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే దారుణ ఫలితాలు వచ్చాయి" అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు డబ్బు కూడా చేతులు మారిందంట. అందరూ చెప్పకుంటున్నారు" అని కూడా ఆయన ఘాటు ఆరోపణలు చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా కొందరు కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళపై ఆరోపణలు సంధించారు.
"అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారు. ఇందులో అపసవ్య పోకడలు చోటుచేసుకున్నాయి. సమర్ధులకు టికెట్లు ఇవ్వలేదు. డబ్బు చేతులు మారింది. పార్టీ ఫండ్ కూడా మింగేశారు. వీటన్నింటిపై వాస్తవాలు బయటికి తీసి, నిజమైన కాంగ్రెస్ వాదులకు అండగా నిలుస్తూ, నిజనిర్ధారణ కమిటీ వేయండి. " అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ కేసీ, వేణుగోపాల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై షోకాజ్ నోటీస్ అందుకున్న వారిద్దరు కూడా వ్యంగ్యంగానే స్పందించడం గమనార్హం.

కడప పార్లమెంటు స్థానం నుంచి సిట్టంగ్ ఎంపీ, సోదరుడు వైఎస్. అవినాష్ రెడ్డితో పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళ రెడ్డి పోటీ చేశారు. ఆమెకు 1,41,039 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి 5,42,448 లభించాయి. సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి 6,05,143 ఓట్లు సాధించారు. దీంతో ఆయన 62,695 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ వైఎస్. షర్మిళ పోటీలో లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది అనే మాటలతో పాటు, ఓట్ల చీలక వల్ల వైఎస్ఆర్ సీపీ అభ్యర్థికి లాభించింది అనే విషయం స్పష్టమైంది.

ఏపీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళపై లేఖాస్త్రం సంధించిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేశారు. ఆయన కోసం ప్రత్యేకంగా పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళ ప్రచారానికి రావడంతో జనంతో కిక్కరిసింది. అయినా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాకేష్ రెడ్డికి కేవలం 4,551 ఓట్లతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో పత్తా కనిపించని కాంగ్రెస్ తాజా సార్వత్రిక ఎన్నికల్లో జీవం పోసుకుంది. అందుకు కొన్ని నిదర్శనాలు..

కడప అసెంబ్లీ స్థానంలో వైఎస్. షర్మిళ వ్యూహాత్మకంగా వ్యవహరించి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆఫ్జల్ ఖాన్ ను రంగంలోకి దించారు. ఆయనకు లభించిన 24,150 ఓట్లతో వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ సీఎంషేక్ అంజాద్ బాషా ఓటమికి బాటలు పడ్డాయి.

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్సీ రిజర్వు సెగ్మెంట్ లో వైఎస్ఆర్ సీపీలో టికెట్ లభించక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తొగూరు ఆర్థర్ 7,949 ఓట్లు సాధించారు. మడకశిరలో అత్యధికంగా 17,380 ఓట్లు సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడాడు.

చిత్తూరు జిల్లా పూతలపట్టులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు అభ్యర్థి ఎం.ఎస్. బాబుకు 2,820 ఓట్లు లభించాయి.
రాష్ట్రంలో, జాతీయస్ధాయిలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపునకు ఇబ్బంది లేని రీతిలో ఓట్ల శాతం పెరిగిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
తిరుపతి పార్లమెంట్ స్ధానానికి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ కు 65,118 ఓట్లు లభించాయి. ఎమ్మెల్యేలు అంతా ఓడినా వైఎస్ఆర్ సీపీ నుంచి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్లతో విజయం సాధించారు.


ఈ పరిస్థితుల్లో... రాజుకున్న అగ్గి
విజయవాడ వేదికగా జరిగిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సీనియర్లు హాజరయ్యారు. మొదటి నుంచి వైఎస్ఆర్ ను వ్యతిరేకించే వారు మినహా, అందరూ హజరయ్యారు అందులో ప్రత్యేకంగా తెలంగాణ మంత్రివర్గం మొత్తం హాజరైంది. వైఎస్. షర్మిళ నాయకత్వానికి మద్దతు పలికారు. ఏఐసీసీ ప్రతినిధిగా హాజరైన నేత కూడా గొంతు కలిపారు. దీనిని పరిశీలించిన పార్టీలోని ఒకవర్గం మాత్రం అగ్గిమీదగుగ్గిలం అవుతోంది. తమ ఆగ్రహాన్ని లేఖల రూపంలో ఏఐసీసీకి సంబంధించినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళ పార్టీని బలోపేతం చేయడానికి వేసే అడుగులపైనే పార్టీ పరిస్థితి ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
1999 ఎన్నికల్లో అప్పటి ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఆరే. ధావన్ చేసిన వ్యాఖ్యలు అప్నట్లో కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు బలంగా ఉన్నాయి. ప్రచారం మంచి జోరు మీద ఉంది. ఆర్.కే ధావన్ తో కలిసి పీసీసీ సారధిగా డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో "ఏపీ సీఎం అభ్యర్థి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి" అని చేసిన ప్రకటనతో మొత్తం తిరగబడింది. పార్టీలో వైఎస్ఆర్ వ్యతిరేకవర్గం ఒక్కటైంది. గెలిచే స్థానాలు కూడా కోల్పోయి. 26 సీట్లకు పరిమితమైంది. దీంతో టీడీపీ సారధిగా రెండోసారి ఎన్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేకపోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిళ నాయకత్వాన్ని పటిష్టం చేయాలనే ఆలోచన ఉండవచ్చు. కానీ, నిత్యం మండుతూ ఉండే కాంగ్రెస్ లోని గ్రూప్ రాజకీయాలు పార్టీ మనుగడకు ముప్పుగానే వెంటాడుతున్నాయనేది చరిత్ర చెప్పే సత్యం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎలా సాగిస్తారనేది వారి సమీక్షలతో మాత్రమే వెల్లడికావాలి.
Read More
Next Story