
దేవుని కడప:19 నుంచి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
సన్నాహాలు చేస్తున్న టీటీడీ.
కడప నగరానికి సమీపంలోని దేవుని కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 వ నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
టీటీడీ అనుబంధ ఆలయంగా ఉన్న దేవుని కడపలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు టీటీడీ యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.
శ్రీవారి కల్యాణోత్సవం
కడప నగరానికి సమీపంలోని శ్రీలక్షి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300 చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
వాహన సేవలు
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల వాహనసేవలకు కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పల్లకీపై విహరిస్తూ, యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

