తిరుమల శ్రీవారి లడ్డూలకు విపరీతంగా డిమాండ్
x
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. పోటు వద్దకు నందినీ నెయ్యి తీసుకుని వెళుతున్న ట్యాంకర్లు.

తిరుమల శ్రీవారి లడ్డూలకు విపరీతంగా డిమాండ్

జూలై నెలలో 1.24 కోట్ల లడ్డుల విక్రయం, నాణ్యత పెరగడంతో ఎగబడుతున్నభక్తులు


.తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) సంస్థ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. లడ్డు నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమయిన సిబ్బందిని నియామకాలు జరపడం, భక్తులందరికి లడ్డులు లభ్యమయ్యేందుకు అటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టిటిడి అధికారులు చెప్పారు.

తిరుమల అన్నదానసత్రంలో పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

ఈ ఏడాది జూలై నెలలో 125, 10,330 లడ్డులను తయారు చేసింది. ఇందులో 1,24,40,082 లడ్డూల విక్రయం జరిగింది. ఫలితంగా టిటిడికి రు. 62.2 కోట్ల ఆదాయం లభించింది.

"తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు ప్రాథాన్యం ఇస్తున్నారు. అందువల్లే రికార్డు స్థాయిలో లడ్డూల తయారీ పెరిగింది.విక్రయాలు పెరిగాయి" అని పోటు ఏఈఓ మునిరత్నం అభిప్రాయపడ్డారు.
సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున లడ్డుల విక్రయం జరుగుతుంది. కానీ జూలై లో ఎలాంటి ఉత్సవాలు లేకపోయినా లడ్డు డిమాండ్ పెరిగింది. విక్రయాలు పెరిగాయి.
కర్నూలుకు చెందిన యాత్రికురాలు అనిత మట్టాడుతూ,
"తిరుమలకు నా చిన్నప్పటినుంచి వస్తున్నాం. మేము 15 లడ్లు తీసుకున్నాం. గతంలో తీసుకుంటే కొంచెం నాణ్యత నాణ్యత లోపం ఉండేది. ఇప్పుడు లడ్డు తింటుంటే ఇంకా రెండు లడ్లు తినాలనిపించేస్తుంది అంత రుచికరంగా ఉన్నాయి" అని అనిత వ్యాఖ్యానించారు.
కఠిన నిర్ణయాలతో...
ఇటీవలి కాలంలో ముఖ్యంగా లడ్డు కల్తీ నెయ్యి వివాదం తర్వాత దేవస్థానం బోర్డు చెయిర్మన్ బిఆర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. శ్యామల్ రావు అనేక సంస్కరణలు కఠినంగా అమలు చేయాల్సి వచ్చింది. ఫలితంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లడ్డులు లభ్యమవుతున్నాయి. ఈ సంస్కరణలో భాగంగా లడ్డులు తయారుచేసే వారి సంఖ్య పెంచడం జరిగింది. కొత్తగా 80 మందిని నియమించడంతో ఇపుడు లడ్డుల తయారీలో 1150 మంది ఉన్నారు. వీరిలో 700 మంది బ్రాహ్మణ ‘పోటు’ వంటవారు ఉన్నారు. లడ్డుల అమ్మకానికి 209 మంది ఉన్నారు. మిగతావారంతా ట్రే లు కడిగే వారు, అన్ లోడిండ్, లోడింగ్ సిబ్బంది, వంటగ్యాస్ మేనేజ్ చేసేవారు. లడ్డుల కల్తీ వివాదం తర్వాత క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అదనపు కార్యనిర్వహణాధికాకి సిహెచ్ వెంకయ్య చౌదరి, సహాయ కార్యనిర్వహణాధికారి ఏ. మునిరత్నం ప్రత్యేకంగా నిఘా పెట్టడం కూడా క్వాలిటీ పెరిగేందుకు కారణమయింది.
“క్వాలిటీ పెరగాలని ఈ మధ్య పోటు సిబ్బంది, లడ్డుల తయారీ విధానం, వాడే సరుకుల మీద, వాటి మిశ్రమాల మీద ఎక్కువ నిఘా పెడుతున్నారు. దీనివల్ల చాలా క్రమశిక్షణ పెరిగింది. క్వాలిటీ, ప్రొడక్షన్ పెరిగేదుకు కారణమయింది,’ అని పోటు వర్గాలు అంగీకరించాయి.
లడ్డుల క్వాలిటీ పెరిగేందుకు మరొక కారణం ముడిసరుకుల నాణ్యత పరిశీలించేందుకు, ముఖ్యంగా నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం. 2025 జూలై 22 న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత పరీక్షలకు రూ. 75 లక్షల విలువయిన యంత్రాలు ఏర్పాటు చేశారు. దీనితో కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్, గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ పై టీటీడీ ఆధారపడటం ఆగిపోయింది.
గత ఏడాది శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారనే ప్రకంపనల నేపథ్యంలో సంస్కరణలకు బాటలు పడ్డాయి. రోజుకు 4.50 లక్షల లడ్డూల తయారీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నాణ్యమైన నెయ్యి కొనుగోలును టీటీడీ తిరిగి ప్రారంభించింది. తిరుమలలో నెయ్యి నాణ్యత పరీక్షకు రూ. 75 లక్షలతో ల్యాబ్ (Testing lab) ఏర్పాటు చేశారు.
శ్రీవారి లడ్డు, అన్నప్రసాదాల తీయారీకి టెండర్ల ద్వారా కొనుగోలు చేసే బియ్యం, పప్పులు, చక్కెర, కలకండ, పచ్చ కర్పూరం, జీడిపప్పు ఇతర ముడిసరుకుల నాణ్యత పరీక్షలకు మరో యంత్రం ఏర్పాటు చేశారు. లడ్డూ ప్రసాదాలకు రేషనలైజేషన్ విధిస్తూ, కియోస్క్ యంత్రాలు కూడా అందుబాటులో ఉంచారు. తిరుమల పోటులో రోజుకు ఆరు లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉంది. దీంతో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి పెంచారు.
2024 జూన్ 16న టీటీడీ ఈఓగా సీనియర్ ఐఎఎస్ అధికారి జే. శ్యామలరావును నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత నాణ్యమైన నెయ్యి వినియోగంపై దృష్టిసారించారు. ఒకపక్క కల్తీ నెయ్యి వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగినా, లడ్డూ ప్రసాదం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. దీని వెనక ఆయన కృషి ఉంది.

లడ్డూ కేంద్రంలో టీటీడీ ఈఓ జే. శ్యామలరావు పరిశీలన (ఫైల్)

"తిరుమల శ్రీవారి పోటులో శుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చాం. నిత్యం పర్యవేక్షణ, నాణ్యమైన నెయ్యి వాడకం, దిట్టం (లడ్డూ తయారీలో వాడే పదార్థాల పట్టిక) అమలు చేస్తున్నాం. అదనపు సిబ్బందిని కూడా నియమించాం" అని చెప్పారు. లడ్డూ విక్రయాలు పెరగడంపై టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఏమంటున్నారంటే..
"తిరుమలలో రోజూ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి కూడా అదే పనిచేస్తున్నారు. పోటు, లడ్డూ కౌంటర్ల తనిఖీ, అన్నప్రసాదాల తయారీపై దృష్టి సారించడం వల్ల, లడ్డూల విక్రయాలు పెరిగాయి" అని పోటు ఏఈఓ మునిరత్నం వివరించారు. ఇలా అన్ని పై నుంచి లడ్డుల తయారీ మీద నిఘా తీవ్రమయింది.
2024 సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 14 లక్షల లడ్లు (ఒకటి రూ. 50) యాత్రికులు కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు 16 లక్షల లడ్డూలు విక్రయించారు.
లడ్డూల తయారీ వివరాలు పరిశీలిస్తే..
2021 మార్చి 21 వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి టీటీడీకి నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేసేది. ఆ తరువాత జరిగిన టెండర్లలో ఎల్-1 స్థాయి నుంచి ఎల్ఎల్-3 పడిపోయినా టీటీడీకి రోజుకు అవసరమైన 500 లీటర్ల నెయ్యిలో 20 శాతం అందించి, ఆ తర్వాత టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. దీంతో మిగతా ప్రయివేటు సంస్థలకు ఆ టెండర్ దక్కడం, కల్తీ ప్రకంపనలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయినా సెప్టెంబర్ నెలలో రోజుకు మూడు లక్షల వరకు లడ్డూ విక్రయాలు జరిగాయి.
లడ్డూ దిట్టం (Laddu Dittam)
తిరుమలలో కల్యాణోత్సవాలు ప్రారంభమైన 1940 నుంచి లడ్డూ తయారీ ప్రారంభమైంది. దీనికి ప్రత్యేక ప్రామాణికాలు పాటిస్తున్నారు. 1950లో 5,100 లడ్డూల తయారీకి వినియోగించే 803 సరుకులతో "దిట్టం"( (quality and quantity check list) సిద్ధం చేశారు. యాత్రికుల రద్దీ వల్ల మొదట 2001లో ఈ దిట్టం సవరించారు. ఆ మేరకు ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకలు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ - 8 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు వినియోగించారు.
2004 వరకు తిరుమలలో పోటు (వంటశాల)లో 45 వేల లడ్డూలు తయారీ సామర్థ్యం మాత్రమే ఉండేది. ఇన్ని దీనికి మూడు వేల నుంచి నాలుగు వేల లీటర్ల నెయ్యి అవసరం అయ్యేది.
దిట్టం ప్రకారం 700 గ్రాములున్న ప్రతిపెద్ద లడ్డులో 23.5 గ్రాముల జీడిపప్పు, 12.5 గ్రాముల రైజిన్స్,8.2 గ్రాముల బాదంపప్పు, 6.2 గ్రామలు చకెర క్యాండీ, 12 శాతం తేమ ఉండితీరాలి.
పోటు (Srivari Pottu :kitchen) సామర్థ్యం
2005లో పోటు సామర్థ్యం పెంచడం ద్వారా రోజుకు లక్ష లడ్డూల తయారు చేశారు. యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం వల్ల అందరకీ కోరినన్ని లడ్డూలు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో
2009లో కొంత సామర్థ్యం పెంచారు. యాత్రికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది
2020లో తిరుమలలో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రోజుకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల లడ్డూల తయారు చేయడానికి పోటు సామర్థ్యం పెంచడంతో పాటు వంటశాలలో వేడి నుంచి కార్మికులు ఇబ్బంది పడకుండా ధర్మోఫ్లూయిడ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ప్రస్తుతం డిమాండ్ కు తగినట్లు లడ్డూల తయారీకి మార్గం ఏర్పడింది.
మారిన అంచనాలు...
2025 జనవరి వరకు రోజుకు 3.50 లక్షల లడ్డూలు తయారు చేయడం, మరో 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ కింద నిలువ ఉంచే వారు. ఆ స్టాక్ విక్రయాలు జరిగాక, కొత్తగా తయారు చేసినవి కౌంటర్లలోకి తీసుకుని వచ్చే వారు. నాణ్యత పెరిగిన నేపథ్యంలో రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు.

జీడిపప్పు నాణ్యత పరిశీలిస్తున్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి

ఈ లడ్డూల తయారీకి..
శనగపిండి సుమారు 17 వందల బస్తాల శనగపిండి, 16 వేల కిలోల నెయ్యి, జీడిపప్పు 3,400 కిలోలు, చక్కెర 700 బస్తాలు, కలకండ, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు తగినంత వాడుతున్నారు.
"నాణ్యత, సువాసన, రుచి పెరగడంలో ఈఓ, అదనపు ఈఓ ప్రత్ర్యక శ్రద్ధ తీసుకున్నారు. గతంలో ఒకటి, రెండు లడ్డూలు అడిగే యాత్రికులు పదికి తక్కువ కాకుండా ఇవ్వమని అడుగుతున్నారు" అని పోటు ఏఈఓ మునిరత్నం 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఈ ఏడాది మే, జూన్ నెల నుంచి లడ్డూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు.
పెరిగిన యాత్రికుల సంఖ్య
2024లో 2.55 కోట్ల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారి నుంచి హుండీ కానుకల ద్వారా 1,367 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఆగష్టులో రూ.125. 62 కోట్లు ఆదాయం వస్తే, ఏప్రిల్ నెలలో 101 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. డిసెంబర్ లో 115 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు టీటీడీ పరకామణి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
జూలై నెలలో మాత్రమే సుమారు 22.13 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 125.35 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. సుమారు 1.04 కోట్ల లడ్డూలు విక్రయించారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
2025 జూలై12న 92,221 మంది,15వ తేదీ 73,020 మంది, 21వ తేదీ 77,481 మంది 23వ తేదీ 80,130 మంది భక్తులు దర్శించుకున్నారు. లడ్డూల విక్రయాలు కూడా పెరగడానిక దారితీసింది. అన్నప్రసాదాలు కూడా ఒక దోనె (ఆకుతో చేసిన చిన్న కప్పు)లో యాత్రికులకు అందిస్తుంటారు. ఒకటి తీసుకునే వారు నాలుగు దొనెలు తీసుకొంటున్నారని పోటు అధికారులు చెబుతున్నారు.
కర్నూలు ప్రాంతానికి చెందిన మరో భక్తుడు రమేష్ మాట్లాడుతూ,
"శ్రీవారి దర్శనం తరువాత అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత రుచిగా ఉంది. లడ్డూలు కూడా ఇంకా ఎక్కువ తీసుకోవాలని ఉంది. మా బడ్జెట్ కు తగినట్లు ఆరు తీసుకున్నాం" అని చెప్పారు.
"రెండేళ్ల కిందటి పరిస్థితితో పోలిస్తే మాత్రం లడ్డు నాణ్యత, రుచిలో చాలా మార్పు ఉంది. నెయ్యి వాసన కూడా బాగుంది" అని రమేష్ వ్యాఖ్యానించారు.
2008 నాటి ధరే..
తిరుమలలో లడ్డూ ప్రసాదం ధర ఒకసారే పెరిగింది. ఒక లడ్డూ రూ. 25 ఉండేది. దళారులను అరికట్టాలనే ధర రూ. 50కి పెంచినట్టు టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. యాత్రికులకు కోరినన్ని లడ్డూలు అప్పటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. ముడిసరుకుల ధరలు పెరుగుతున్నా లడ్డూ ధర 2008లో నిర్ణయించిందే అమలు చేస్తున్నారు.
గతంలో భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు ఒక్కొక్కటి రూ.25 చొప్పున రెండు మాత్రమే ఇచ్చేవారు. 2008లో ఈ విధానాన్నిమార్చి, లడ్డూ ధరను రూ.25 నుంచి రూ.50కు పెంచి భక్తులు అడిగినన్ని ఇచ్చారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి రేటు పెంచి లడ్డూల సంఖ్య మీద నియంత్రణ తీసేశామని అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి తెలిపారు.
లడ్డు విక్రయాలు
తిరుమల, తిరుపతిలో కపిలతీర్ధం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం తోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాలు ఉన్న శ్రీవారి ఆలయం వద్ద కూడా రూ. 50 విలువైన లడ్డూలు అందుబాటులో ఉంచింది.
ఎవరికి ఏ లడ్డూ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులను సమానంగా పరిగణించడం లేదనడానికి నిదర్శనం లడ్డూ విక్రయాల్లో కనిపిస్తుంది.
1. ఆస్థానం లడ్డు : ఇది శ్రీవారి ప్రత్యేక ఉత్సవాల్లో తయారు చేస్తారు. 750 గ్రాములు ఉండే ఈ లడ్డూను దిట్టంలో ఉన్న మోతాదుకు మించి, ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వుతో తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ లడ్డు అందుతుంది.
2. కల్యాణోత్సవం లడ్డు : ఆర్జీత సేవలు చేయించుకున్న దంపతులకు అందుబాటులో ఉంటుంది. రూ. 200 విలువైన ఈ లడ్డూను కొంతకాలంగా సామాన్య యాత్రికులకు అందుబాటులో ఉంచారు.
3. ప్రోక్తం లడ్డు : సర్వదర్శనానికి వెళ్లే యాత్రకులకు కౌంటర్లలో ఈ లడ్డూ రూ. 50 అందుబాటులో ఉంచుతున్నారు.
దర్శనానికి వెళ్లి రాగానే ఆలయం లోపలే 25 గ్రాముల ఉన్న లడ్డూ ఉచితంగా ఇస్తుంటారు.
"స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూల తయారీ కోసం కర్ణాటక రాష్ట్రంలోని నందినీ బ్రాండ్ నెయ్యి కొనుగోలు చేస్తున్నాం" అని టీటీడీ ఈఓ జే. శ్యామలరావు చెప్పారు.
తిరుమల పోటులో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పైబడే లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. బఫర్ స్టాక్ గా మరో 3.50 లక్షల లడ్డూలు నిలువ ఉంచుతారు. కొత్త స్టాక్ రాగానే పాత లడ్డూలు రెండు రోజులకోసారి విక్రయాలు సాగిస్తున్నట్లు చెప్పారు.
తిరుమలలో లడ్డూల విక్రయానికి నిబంధనలు మార్పు చేశారు. శ్రీవారి దర్శనం చేసుకున్న వారికి, చేసుకోని వారికి విడివిడిగా నిబంధనలు పెట్టారు.
యాత్రికులకు సరిపడ లడ్డూలు అందించేందుకు శ్రద్ధ తీసుకున్నట్లు అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. "టోకన్ ఉన్న భక్తుడికి రూ. 50 లడ్డూ ఒకటి ఉచితంగా, ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు కొనవచ్చు" అని అదనపు ఈఓ తెలిపారు.
"గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ ఏర్పాటు చేశాం"అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Read More
Next Story