Tirupati Zoo| సమీర్ జీవిత సమరం ఆగింది..!
x
తిరుపతి జూలో తెల్లపులి సమీర్ (ఫైల్)

Tirupati Zoo| 'సమీర్' జీవిత సమరం ఆగింది..!

వన్యమృగాలను వెంటాడుతున్న మృత్యువు.


తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల (SV Zoo Park )లో వన్యమృగాల మృత్యు ఘోష ఆగడం లేదు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కు నుంచి తీసుకుని వచ్చిన వన్యమృగాలు తిరుపతికి తీసుకుని వచ్చిన తరువాత వయసు మీదపడిన స్థితిలో అనారోగ్యంతోనే మరణించడం ఇక్కడ విషాదం నింపింది.

తిరుపతి జంతు ప్రదర్శనశాలలో సందర్శకులను ఆకట్టుకుంటున్న 'తెల్లపులి సమీర్' ఆదివారం తనువు చాలించింది. ఈ సంవత్సరంలోనే పులి, చిరుతలు, జాగ్వార్ కూడా ప్రమాదవశాత్తు కొన్ని, అనారోగ్యంతో ఇంకొన్ని ప్రాణాలు వదలడం జంతు ప్రదర్శన శాల సిబ్బందిని కూడా కతల చెందేలా చేశాయి.
14 సంవత్సరాలు అలరించి..

తిరుపతి జంతుప్రదర్శన శాలలో తెల్లపులి 'సమీర్' 14 సంవత్సరాలు సందర్శకులను అలరించింది. దీని సంరక్షణకు కూడా తిరుపతి జూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనారోగ్యంతో మరణించడం వల్ల తెల్లపులి ఇక తిరుపతి జూ పార్కు నుంచి కనుమరుగైంది.
"తెల్లపులి సమీర్.. అనారోగ్యంతో ఆదివారం మరణించింది" అని అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ప్రొటోకాల్స్ ప్రకారం తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో శవపంచనమా నిర్వహించిన తరువాత అంత్యక్రియలు పూర్తి చేశారు.
హైదరాబాద్ నుంచి వచ్చి..
హైదరాబాద్ నెహ్రూ జూలజికల్ పార్కు నుంచి తిరుపతిలోని ఎస్వీ జంతుప్రదర్శన శాలకు తెల్లపులిని తీసుకుని వచ్చారు. అపుడు ఈ తెల్లపులికి ఐదేళ్లు మాత్రమే. దీనికి "సమీర్" అని పేరు పెట్టారు. ఇన్నేళ్లుగా ఈ పులి తిరుపతి జూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వయసు పెరగడం, అనారోగ్య కారణాల వల్లే 19 సంవత్సరాలు వయస్సు ఉన్న సమీర్ మరణించిందని జూ అధికారులు తెలిపారు.
సంవత్సర నుంచి విశ్రాంతి...
తిరుపతి జూలో పెరిగి పెద్దైన తెల్లపులి సమీర్ ఒక సంవత్సరం నుంచి సందర్శకులకు కనిపించడం లేదు. ఈ జూతో పరిచయం ఉన్న వారికి మాత్రమే విషయం తెలుసు. తిరుపతి జూ వెబ్ సైట్ లో కనిపించే తెల్లపులిని చూడాలని వచ్చే సందర్శకులు సంవత్సరం నుంచి అది కనిపించపోవడానికి కారణం మాత్రం తెలియలేదు.
"వయసు పెరగడం వల్ల కదలలేని స్థితికి చేరుకున్న ఈ తెల్లపులిని నైట్ హైస్ (సందర్శకులకు కనబడకుండా ఏకాంత గది)కి పరిమితం చేశారు" ఈ విషయాన్నిఅటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు కూడా స్పష్టం చేశారు. అనారోగ్యానికి గురైన తెల్లపులిని ఎక్కువకాలం ఇంటెన్సివ్ కేర్ ( Intensive care) ల ఉంచారు. ఘనపదార్థాలు అంటే మాంసాంహారం తినలేని స్థితికి చేరుకున్న ఆ పులికి ద్రవహారం అందించినట్లు అధికారులు తెలిపారు.
ఆకస్మిక మరణం

తిరుపతి జంతుప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న తెల్లపులి అనారోగ్యంతో మరణించడంపై సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పులి మృతదేహానికి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పథాలజీ విభాగం నుంచి ప్రత్యేక నిపుణులతో శవపరీక్ష చేయించారు. అనారోగ్యంతో మరణించిన తెల్లపులి నెఫ్రోసిస్ మూత్రపిండాల సమస్యకు తోడు వృద్ధాప్యం కూడా కారణం అని పోస్టుమార్టం నివేదికలో స్పష్టం చేశారని అటవీశాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు స్పష్టం చేశారు.
2025 ఆగష్టులో.. సింధు మృతి
తిరుపతి ఎస్వీ జూ పార్కులో అనారోగ్యంతో 23 సంవత్సరాల సింధు అనే సింహం మరణించింది.
"ఈ సింహం ( Lion ) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది" అని అప్పట్లో క్యూరేటర్ సెల్వం చెప్పారు. 2002లో ఈ సింహాన్ని ఎనిమిది నెలల వయసులో తీసుకుని వచ్చారు. అంతకుముందే..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో విక్రమ్ అనే 11 ఏళ్ల మగ సింహం కూడా అనారోగ్యంతోనే మరణించింది.
2023 డిసెంబరు: 23 ఏళ్ల వయస్సు సీత అనే ఆడ సింహం వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా మరణించింది. అంతకు కొన్ని రోజుల ముందు, అనురాగ్ అనే మరో మగ సింహం కూడా మృతి చెందింది.
​2024 మార్చి: ఏడు సంవత్సరాల వయస్సు గల ఒక ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇది మూడు నెలల్లో జూలో చనిపోయిన మూడో సింహం. 2017 జన్మించిన ఈ సింహం కూడా పెల్విన్ లో ట్యూమర్లు, తోక వద్ద గాయడం వల్ల బాధపడుతూ మరణించింది. వైద్యుల సూచనలతో శస్త్రచికిత్స కూడా చేయించినా, నాలుగు రోజులుగా ఆహారం, నీరు కూడా సరిగా తీసుకోని స్థితిలో ఆ సింహం మరణించినట్లు అప్పట్లో జూ అధికారులు వెల్లడించారు.
కుశ ఆత్మహత్య?
2019లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుశ అనే జాగ్వార్ ను తిరుపతి జూకు తీసుకుని వచ్చారు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, కుశ అనే 15 సంవత్సరాల జాగ్వార్ మరణం తిరుపతి జూ సిబ్బందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. విశాలమైన ఎన్క్లోజర్ లో స్వేచ్ఛగా తిరిగే ఆ జాగ్వార్ చెట్టు కొమ్మల మధ్య తల ఇరికించేసి, బయటకు రాలేక ప్రాణాలు వదిలినట్టు అధికారులు చెప్పారు. 15 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో సంచరించిన ఆ జాగ్వార్ మరణం విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ విషాదం నుంచి జూ సిబ్బంది కోలుకోలేని స్థితిలో ఉండగానే... తెల్లపుల సమీర్ ప్రాణాలు వదలడం జూ సిబ్బందిని విషాదం ఏర్పడింది.
Read More
Next Story