శ్రీవారికి కళా బృందాల నృత్య నీరాజనం
x

శ్రీవారికి కళా బృందాల నృత్య నీరాజనం

బ్రహ్మోత్సవ స్వామిని మురిపించి, యాత్రికులకు కనువిందు చేస్తున్ప కళాకారులు


తిరుమల శ్రీవారిని కళలతో మురిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి అలంకార ప్రియుడే కాదు. కళారాధకుడు కూడా. ఇలా ఎన్నో పేర్లు ఉన్న తిరుమల వెంకన్న సేవలో కళాకారులు మైమరిచి నృత్య నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు ఆ ప్రాంతాల సంస్కృతిని చాటిచెబుతున్నారు.


శ్రీవారి క్షేత్రంలో ఈనెల 24వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సంబరం నేపథ్యంలో దేశంలోని సంస్కృతీ సాంప్రదాయాలు తిరుమలలో మేళవిస్తున్నాయి. స్వామివారి వాహనసేవ ముందు కళాకారులు తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. ఆచార వ్యవహారాలే కాదు.


సంస్కృతిని పరస్పరం పంచుకునే విధంగా కళాబృందాలు చేస్తున్న ప్రదర్శనలు యాత్రికులను మైమరిపిస్తున్నాయి.


తిరుమల శ్రీవారిక్షేత్రంలో వాహనసేవ ముందు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు తమ ప్రాంతంలోని సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలతో ఏకత్వాన్ని చాటుతున్నారు. టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్ కళారూపాల ప్రదర్శనకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది.
"శ్రీవారి వాహన సేవల ముందు నాణ్యమైన కళలకు ప్రాధాన్యం ఇచ్చాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. గరుడోత్సవం రోజు కళాకారుల సంఖ్య మరింత పెంచుతామని కూడా ఆయన తెలిపారు. ఒకో రోజు ఉదయం, రాత్రి శ్రీవారి వాహనసేవలో 9 రాష్ట్రాల నుంచి 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచే విధంగా శ్రద్ధ తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.

రెండు కళ్లు చాలవేమో..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహ‌నసేవ‌లో మలయప్ప స్వామి విహరించుచుండగా 18 కళాబృందాలు 430 మంది కళాకారులు తమ కళా విన్యాసాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆహుతులను అబ్బురపరిచారు.

తిరుమల మాడవీధుల్లో ఈ కళలు చూసేందుకు రెండు కళ్లు చాలవేమో అన్నట్లుగా ప్రదర్శనలతో యాత్రికులను అలరిస్తున్న కళాకారులు శ్రీవారి సేవలో మమేకం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అస్సాం, కేరళ, త్రిపుర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు పాండిచ్చేరి మొత్తం 10 రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ కళా బృందాలు కనువిందు చేస్తున్నాయి.
విశాఖపట్టణానికి చెందిన శ్రీ‌మ‌తి సునీత బృందం ప్రదర్శించిన గోవింద గానం నృత్యం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటినది. తెలంగాణకు చెందిన శ్రీ‌ గౌరవి రెడ్డి బృందం ప్రదర్శించిన కుంభ మయూర నృత్యం నెమళ్లు సంచరించినట్లుగా అనిపించినది. మహారాష్ట్రకు చెందిన శ్రీ తరుణ శేఖర్ బృందం ప్రదర్శించిన మహారాష్ట్ర జానపద నృత్యం మెరుపు వేగంతో ఔరా! అనిపించాయి.

కర్ణాటకకు చెందిన డాక్టర్ దర్శిని మంజునాథ్ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలా తరంగిణి నృత్యరూపకం భాగవతంలోని అనేక ఘట్టాలను గుర్తుకు తెచ్చినది. మండపేటకు చెందిన వీరవేణి బృందం ప్రదర్శించిన కోలాటం, కడప జిల్లాకు చెందిన సి. బాబు బృందం చేసిన డ్రమ్ము లయ విన్యాసాలు, విశాఖపట్నానికి చెందిన ఎం. లక్ష్మి బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ రసలీల రూపకం బృందావనం మధుర ప్రదేశాలలో శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడించిన రాసకేలిని గుర్తుకు తెచ్చింది.

కేరళకు చెందిన అభిషేక్ బృందం ప్రదర్శించిన కథకళి నృత్యం, పాండిచ్చేరికి చెందిన కె.తిరుముగన్ ప్రదర్శించిన కరగట్టం నృత్యం, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుండి డాక్టర్ ఉషారాణి ప్రదర్శించిన దేవేరుల చిన్నవాహన సేవ, మహారాష్ట్రకు చెందిన రాహుల్ హల్డే బృందం ప్రదర్శించిన హోలీ నృత్యం, సి.హెచ్. అజయ్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, గూడూరుకు చెందిన శైలజా కుమారి బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద రూపకం భాగవతంలోని ప్రసాద చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. అస్సాంకు చెందిన జోయ్ దేవ్ దేకా బృందం ప్రదర్శించిన బోర్తాల్ నృత్యం అస్సామీ ప్రజల సంస్కృతి వైభవాన్ని చాటినది. పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రసూన్ బెనర్జీ బృందం ప్రదర్శించిన జుహ్మార్ నృత్యం ఆ రాష్ట్ర సంస్కృతిని కనుల ముందు సాక్షాత్కరింపచేసినది.

త్రిపురకు చెందిన రాజు మోగ్ బృందం ప్రదర్శించిన సన్గ్రైన్ గొడుగు నృత్యం నర్తకులు జంటలుగా గొడుగులతో కలిపి ఒకరినొకరు కలిసి చేస్తున్న నాట్యం ఈ కళ త్రిపుర సంస్కృతిని ప్రతిబింబించినది. తూర్పు గోదావరి జిల్లా, తణుకుకు చెందిన పి.హారిక బృందం, తిరుమలకు చెందిన కె.శ్రీనివాసులు కోలాట నృత్యాలతో భక్తులను తన్మయ పరచారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్బోబర్ రెండో తేదీ వరకు ఈ కళలు కనువిందు చేయడానికి వీలుగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
Read More
Next Story