
శ్రీకాళహస్తి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖీ నది
వానొచ్చే.. వరద తెచ్చే.. నదులన్నీ ఉప్పొంగే..
మోథా తుపానుతో కోస్తాలో వేదన. రాయలసీమలో నిండిన ప్రాజెక్టులు.
మొంథా తుపానుతో నదులకు జీవకళ వచ్చింది. మేజర్, మైనర్ నీటిపారుదల ప్రాజెక్టులు కళకళ లాడుతున్నాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో రాయలసీమలో ప్రాజెక్టులు నిండాయి. ఉత్తరాంధ్ర ప్రధానంగా కోస్తా జిల్లాల తీరప్రాంతంలో సముద్రం పోటెత్తింది. జనజీవనం, పంటలకు కొంత నష్టం వాటిల్లింది.
వరం.. శాపం..
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు సముద్ర తీరప్రాంతం ఉండడం అనేది కోస్తా జిల్లాలకు ప్రకృతి ప్రసాదించిన వరం. విపత్తుల వేళ నష్టం కూడా అన్ని వర్గాల ప్రజలను దెబ్బతీస్తోంది. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో చిన్న పెద్ద తరహా నదుల్లో 40 వరకు ప్రవహిస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నదులన్నీ నీటితో పోటెత్తాయి. ప్రకృతి వైపరీత్యం నుంచి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. అయినా, కోస్తా జిల్లాలలో భారీగా నష్టం జరిగినప్పటికీ రాయలసీమలో కూడా స్వల్పంగా పంటలు దెబ్బతిన్నాయి.
కరువు తీరింది..
ఈ వర్షాల వల్ల రానున్న వేసవికి తాగు నీటికే కాకుండా పంటల సాగుకు కూడా ఇబ్బంది ఉండదనే వాతావరణం కనిపిస్తోంది. తుపాను మంగళవారం రాత్రి తీరం దాటే సమయంలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కినప్పటికీ మరో కొన్ని రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులో. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం విశాఖపట్నం ఏలూరు కృష్ణా గుంటూరు తో పాటు రాయలసీమలో నంద్యాల, చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
పొంగుతున్న నదులు
మూడు రోజులపాటు కురిసిన వర్షాల కారణంగా రాయలసీమలోని కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులు వరదనీటితో ప్రవహిస్తున్నాయి. కృష్ణ, తుంగభద్రా నదులలో వరద నీటి వల్ల ప్రమాదాలు లేకుండా జిల్లా యంత్రాంగం ఇంకా అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వీటి తోపాటు..
తూర్పు కనుమలలో పుట్టిన వంశధార, నాగావళి, జంఝావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్లమల కొండల్లో ప్రారంభమయ్యే నదుల్లో ముఖ్యమైంది గుండ్లకమ్మ కూడా ప్రధానమైంది. అడవుల నుంచి పోటెత్తిన జలపాతాలతో ఈ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నదుల నీటి ప్రవాహం పెరుగుతోంది.
"ఒడిశా రాష్ట్రంలో వరదలపై దృష్టి పెట్టండి" అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో బహుదా నదికి వరద నీరు మరింత పోటెత్తి, నష్టం జరగకుండా, నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు.
స్వర్ణముఖిలో పరవళ్లు..
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా శేషాచలం కొండల నుంచి ప్రారంభమయ్యే స్వర్ణముఖి నది జోరుగా పారుతుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ నది తిరుపతి, శ్రీ కాళహస్తి నాయుడుపేట మీదుగా 130 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నది అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల నుంచి శ్రీకాళహస్తి శివాలయాలను స్పర్శిస్తూ ప్రవాహం సాగుతోంది.
"నాలుగు రోజుల కిందట తిరుపతిలో స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు కూడా చనిపోయిన దుర్ఘటన చోటుచేసుకుంది" ఈ విషాద ఘటనతో తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్వర్ణముఖి నదీ పరివాహ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
కర్ణాటక నుంచి రాయలసీమకు
కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా సీట్లగట్ట గ్రామం వద్ద ఊపిరి పోసుకునే పాపాగ్ని నది. కూడా రాయలసీమను తచ్చాడి, సోమశిల నుంచి సముద్రంలో కలుస్తోంది. 25 కిలోమీటర్లు దూరం తన ప్రవాహంతో ముంచెత్తుతున్న పాపాగ్ని నది పెన్నాకు ఉపనదిగా ఉంది. ఈ నది చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ నదీ జలాలు మదనపల్లి, పీలేరు. మీదుగా కడప జిల్లాలోని చెయ్యరు నదిలో కలుస్తుండడం వల్ల ఈ నది కూడా వరద నీటి ప్రవాహంతో జోరు మీద ఉంది. పాపాగ్ని నది చిత్తూరు, అనంతపురం, కడప జిల్లా నదిలో కలుస్తోంది.
సోమశిల నుంచి 78 టీఎంసీలు సముద్రంలోకి
రాయలసీమను స్పర్శిస్తూ వరద నీటితో ప్రవహిస్తున్న నదులన్నీ నెల్లూరు జిల్లా సోమశిల వద్ద కలుస్తున్నాయి. మోతాదు తుఫాను కారణంగా ప్రవహించే నదులన్నీ నెల్లూరు జిల్లా సోమశిల వద్దకు చేరుతున్న వరద నీటిది సామర్థ్యం పెరిగిపోవడం వల్ల 78 టిఎంసిల కంటే అధికంగానే వరద జలాలు బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు.
చెయ్యరు నుంచి..
కడప జిల్లా నుంచి ప్రవహించే నదులలో బాహుదా, మాండవ్య నది తో పాటు కమలాపురం నుంచి ప్రారంభమై బద్వేలు నియోజకవర్గం సిద్ధపటం మీదుగా ప్రవహించే పెన్నా నది కూడా సోమశిల లో కలుస్తుంది.
కడప జిల్లా రాయచోటి సమీపంలోని పించర్ డ్యాం పరీవాహక ప్రాంతంలో దిగువన ఉన్న చెయ్యరులో ప్రవహించే వరద నీటిలో 2.242 టీఎంసీల నీరు కూడా సోమశిలకు చేరుతుంది. పెన్నా నదికి ఉపనదులుగా ఉన్న పాపాగ్ని, పెద్దేరు, కుందూ నదిలో కూడా నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం వద్ద ఉన్నసోమశిల జలసాయానికి వరద నీరు పోటెత్తింది. ఈ జలాశయం సామర్థ్యం 78 టీఎంసీలు కాగా తుఫాను కారణంగా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల 67 నుంచి 68 టీఎంసీల వరకు నీటి నిలువను పరిమితం చేసినట్లు సోమశిల జలాశయాధికారి చెప్పారు.
నిండుకుండల జలాశయాలు..
మోథా తుపాను కారణంగా ప్రధాన జలాశయాలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది.. అందులో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దామోదరం సాగర్ సామర్థ్యం 0.06 టిఎంసిలు కాగా. ఇప్పటికే 0.03 స్థాయికి నీటిమట్టం చేరింది. రానున్న రెండు రోజుల్లో 0.78 టీఎంసీల స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని పులిచింతల రిజర్వాయర్ 45.77 టీఎంసీలకు 5.61 ఉండగా వర్షాల కారణంగా వరద నీరు 14. టీఎంసీలకు చేరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేశారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ, ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్టు, నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఇప్పటికే నిండాయి. ఈ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, రాష్ట్రం నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో బుదశారం మీడియాతో ఏమన్నారంటే..
"గుండ్లకమ్మ పరీవాహ ప్రాంత అధిక వర్షాలతో అవుట్ ఫ్లో 70 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు పెంచడం ద్వారా వాటర్ మానేజ్మెంట్ పాటిస్తున్నాం" అని మంత్రి రామానాయుడు చెప్పారు. గుండ్లకమ్మ వరద నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించామని ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతం లో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరింది. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు రావడం తో రెండు టన్నెల్స్ లోకి 9కి. మీ మేర లోనికి నీరు ప్రవేశించింది. టన్నెల్ లో పని చేస్తున్న 250 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించాం. టన్నెల్ లో డీవాటరింగ్ పనులు వెంటనే చేయాలని అధికారులకు ఆదేశించాం" అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
మినీ ప్రాజెక్ట్
ప్రకాశం జిల్లా కంభం వద్ద ఉన్న చెరువు ఒక మినీ ప్రాజెక్టును తలపిస్తుంది. ఆసియాలోనే ఈ కంభం చెరువు రెండో అతిపెద్దది. మూడు పీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న ఈ చెరువు ఐదేళ్ల తర్వాత పూర్తిగా నిండరమే కాకుండా అలుగు కూడా పారుతోంది.
చిన్న మధ్య తరహా..
తుఫాను కారణంగా రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకున్నాయి. నదులు పోటెత్తడం వల్ల, వరద నీటి కారణంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో నష్టం జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో కూడా ఓ మోస్తరుగా పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరులో కలిసే స్వర్ణముఖి నది కూడా పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. ఇదిలాఉంటే, చిత్తూరు జిల్లాలో పెద్దేరు, మదనపల్లి వద్ద ఉన్న బహుద, అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న పింఛ, గుండుపల్లి సమీపంలోని వెలిగల్లు చిన్న తరహా డ్యాములనుంచి గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు వదులుతున్నారు.
"పించా ప్రాజెక్టు సామర్థ్యం 4113 కి సెక్కులు. ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. రెండు ఫ్లడ్ గేట్ల ద్వారా 4730. కేశక్తులు నీరు కిందికి వదులుతున్నాం" అని. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిచ్చంగల్ రాయుడు చెప్పారు. ఈ మైనర్ డ్యాముల ద్వారా 2.242 క్యూసెక్కుల వరద నీరు సోమశిల జలాశయం నుంచి సముద్రంలోకి కలుస్తుంది.
కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు తరువాత బద్వేలు సమీపంలోని సగిలేరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రధానమైనది. కడప నగరానికి ఎగువన ఉన్న పాలకొండలకు దిగువన నిర్మించిన బుగ్గ వంక ప్రాజెక్టు నుంచి 500 కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి చెరువులకు విడుదల చేశారు.
మొంథా తుపాను వల్ల రాష్ట్రంలోకి ఉత్తరాంధ్ర, తెలంగాణ నుంచి వచ్చే కృష్ణా, గోదావరి, కర్ణాటక నుంచి ప్రవేశించే తుంగభద్ర, పాపాఘ్ని నదులు జలకళసిరులతో నిండాయి. ఇంకా కొన్ని రోజులపాటు వర్షాలు కురవడానికి అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరిక వల్ల ఇప్పటికే నిండుకుండలా మారిన మేజర్, మైనర్ సేద్యపు నీటి ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Next Story

