ఎంపీ మిథున్ కు సీఆర్పీఎఫ్ భద్రత... అసలు కారణం అదేనా?!
ఎన్ఫికల ఫలితాల నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్, ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ జరుగుతున్న వేళ ఎంపీకి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించడం వెనుక కథ ఏమిటి?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ కూటమి శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోకి వెళ్లలేని పరిస్థితి. టీడీపీ కూటమి ప్రభుత్వం తమకు సెక్యూరిటీ తగ్గించిందని పెద్దిరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఓ బిల్లుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరుసటి రోజే ఆయనకు కేంద్ర హోంశాఖ సీఆర్పీపీఎఫ్ రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీని మతలబు ఏమిటనేది చర్చకు తెరలేసింది.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం సీఆర్పిఎఫ్ జవాన్లతో రక్షణ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. వారిలో ఇద్దరు కమాండోలు కూడా ఉంటారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లకు అదనంగా సీఆర్పీఎఫ్ జవాన్లతో ఆయనకు భద్రత కల్పిస్తారు.
పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయ విరోధి, బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కు సీఆర్పీఎఫ్ రక్షణ ఉంది. ఇప్పుడు ఆ కోవలో రెండో వ్యక్తిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేరారు.
తాజా సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ కూటమితో ప్రధానంగా బీజేపీతో వైఎస్ఆర్ సీపీ సంబంధాలు లేవని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం పార్లమెంటులోవక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిల మనసులు చూరగొనడానికి అన్నట్లుగా ఆ బిల్లును వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది. ఆ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ బిల్లుపై మాట్లాడుతూ,
"ముస్లిం మైనార్టీలకు మేలు చేయని ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాం" అని ప్రకటించారు.
ఇది జరిగిన మరుసటిరోజే (శుక్రవారం) ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ జవాన్లతో రక్షణ కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్న హోం శాఖ ఆయనకు అదనపు రక్షణ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నదని భావిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరింది. దీంతో బీజేపీతో అధికారంలో ఉండగా, ఐదేళ్లపాటు సాగిన మైత్రికి వైఎస్ఆర్ సీపీ దూరమైంది. ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో ఇటు రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు, అటు కేంద్రంలో టీడీపీ, జనసేన ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యులయ్యారు. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ, జనసేన బంధం పటిష్టంగానే ఉంది. కాగా,
రాజ్యసభలో వైఎస్ఆర్ సీపీ..
వైఎస్ఆర్ సీపీకి పార్లమెంట్లో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో మాత్రం 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో ఆ పార్టీ నాల్గవ పెద్ద పార్టీగా ఉంది. బీజేపీకి 97, కాంగ్రెస్కు 29, టీఎంసీ సభ్యులు 13 మంది తరువాత వైఎస్ఆర్ సీపీదే ప్రాధాన్యం. టీడీపీ ఆవిర్భవించిన తరువాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే ప్రధమం. వారి సభ్యులు సభలోకి రావాలంటే, ఇంకా రెండేళ్లు వేచి చూడాలేమో. దీంతో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి వైఎస్ఆర్ సీపీ అవసరం అనివార్యం.
ఆత్మరక్షణలో పెద్దిరెడ్డి
ఇదిలా వుండగా, తాజా సార్వత్రిక ఫలితాల్లో సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 కూటమి దక్కించుకుంది. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాలు అంతర్భాగంగా ఉన్న రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.
"నా తండ్రి మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామ చంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేకుండా ఉంది" అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఇటీవల వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతోపాటు, తండ్రితో పాటు తనకు సిఆర్పిఎఫ్ రక్షణ కల్పించండి అని ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాల నుంచి హోం శాఖ నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి పుంగునూరు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేకుండా పోయిందని విషయం స్పష్టం చేస్తూ నిఘవర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
అందుకు ప్రధానంగా..
ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. ఈ సమాచారం తెలియడంతో టీడీపీ కూటమి మద్దతుదారులైన కార్యకర్తలు, ఛోటా నేతలు పుంగనూరులో రోడ్లపైకి వచ్చి నిరసనలు దిగారు. "పెద్దిరెడ్డి రాజీనామా చేయాలి. నియోజకవర్గంలోకి రావద్దు" అంటూ నినదించారు. ఆ తర్వాత
జూన్ 18: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు కు వెళ్లారు. మాజీ ఎంపీ ఎం రెడ్డెప్ప నివాసంలో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు ఆవులపల్లె రిజర్వాయర్ వల్ల భూముల కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారు.
ఈ సమాచారం అందుకున్న టీడీపీ మద్దతుదారులు కూడా వారితో జత కలిశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని వారంతా చుట్టుముట్టారు. ఇంటి పైనుంచి మొదట దాడి జరిగిందని, దీంతో టీడీపీ కూటమి కార్యకర్తలు ప్రతిదాడికి పాల్పడడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు ఆయన వెంట వెళ్లిన కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆగ్రహంతో ఉన్న వారిని శాంతింపచేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి ఎంపీ మిథున్ గన్ మన్ గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత మధ్య తమ వాహంలో ఎక్కించుకొని తిరుపతికి తరలించారు. ఈ సంఘటనలపై కేసులు కూడా నమోదయ్యాయి.
"ఈ పరిస్థితుల్లో మేము పుంగనూరులో పర్యటించే అవకాశం లేకుండా పోయిందని, ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించి, ఓ వినతిపత్రం కూడా సమర్పించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో..
పార్టీల మధ్య వైరుధ్యం అనేది పక్కకు ఉంచి, ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించడానికి కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సెక్యూరిటీని తగ్గించిందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమపై రాజకీయ కక్షసాధింపులు ఎక్కవయ్యాయని వారు ఆరోపించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు హైకోర్టు సోమవారం విచారణకు కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా తండ్రీ, కుమారుడు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు లోకం మొత్తం చూస్తున్నాయి. అయితే, ఎంపీ మిథున్ వినతి తరువాత కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించడం వెనుక కూడా ఎన్డీఏ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనం దాగుందా? అనే చర్చ కూడా ప్రారంభమైంది.
Next Story